మీరు పర్మిషన్ తెచ్చుకోండి.. మేం సెట్స్ కు వస్తాం

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలందరి పరిస్థితి ఇలానే ఉంది. సినిమా హిట్టయితే క్రెడిట్ మొత్తం వీళ్లదే. మూవీ బడ్జెట్ లో 40శాతం వీళ్ల పారితోషికమే. టాలీవుడ్ పేరు చెప్పగానే వీళ్ల పేర్లే ముందు గుర్తుకొస్తాయి.…

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలందరి పరిస్థితి ఇలానే ఉంది. సినిమా హిట్టయితే క్రెడిట్ మొత్తం వీళ్లదే. మూవీ బడ్జెట్ లో 40శాతం వీళ్ల పారితోషికమే. టాలీవుడ్ పేరు చెప్పగానే వీళ్ల పేర్లే ముందు గుర్తుకొస్తాయి. క్రేజ్-అభిమాన సంఘాల్లో వీళ్లకు వీళ్లే సాటి. కానీ టాలీవుడ్ కు కష్టమొచ్చినప్పుడు మాత్రం వీళ్లెవరూ ముందుకురావు. లాక్ డౌన్ తో షూటింగ్స్ ఆగిపోతే వీళ్లకు సంబంధం లేదు. నిర్మాతలే కాళ్లు అరిగేలా తిరగాలి. అందర్నీ కలవాలి. అనుమతులు తెచ్చుకోవాలి. హీరోలు మాత్రం ఇళ్లు కదలరు. మీరు అనుమతులు తెచ్చుకోండి.. మేం షూటింగ్స్ కు వస్తాం అన్నట్టున్నారంతా.

70 వసంతాల సుదీర్ఘ చరిత్ర కలిగిన టాలీవుడ్ ఎన్నో కష్టనష్టాలు చూసింది. ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడింది. సంక్షోభం నుంచి కొత్త పాఠం నేర్చుకుంటూ ప్రతిసారి టాలీవుడ్ తననుతాను మార్చుకుంది. కానీ ఇలాంటి సమస్య ఎదుర్కోవడం టాలీవుడ్ కు ఇదే తొలిసారి. హీరోడైరక్టర్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఏమౌతుందో.. హీరోహీరోయిన్ సెట్స్ లో పెక్ (చిన్న కౌగిలింత) చేసుకుంటే ఏమౌతుందో.. ఇలాంటి అనుమానాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు.

లాక్ డౌన్ నుంచి ఇప్పుడిప్పుడు అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. సినీపరిశ్రమ కూడా త్వరలోనే తేరుకుంటుంది. మెల్లగా షూటింగ్స్ కూడా మొదలవుతాయి. అయితే ఈ క్రమంలో ఎంతమంది హీరోలు పరిశ్రమ గాడిన పడ్డానికి ప్రయత్నించారనేది ఇక్కడ చర్చనీయాంశం. లాక్ డౌన్ టైమ్ లో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు హీరోలంతా ముందుకొచ్చారు. తలో చేయి వేశారు. అందర్నీ ఆదుకున్నారు.

ఇందులో ఎవ్వర్నీ శంకించడానికి, తక్కువ చేయడానికి వీళ్లేదు. మరి ఇదే ఐకమత్యం టాలీవుడ్ ను మళ్లీ తిరిగి తెరిపించడానికి ఎందుకు చూపించలేదు. కేవలం ఇది నిర్మాతల పని అన్నట్టు హీరోలు వ్యవహరిస్తే ఎలా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి, కిషన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడ్డానికి హీరోలు ఎందుకు ముందుకు రాలేదు??

గతంలో ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ ముందుండి పరిశ్రమను నడిపించారు. ఎలాంటి భేషజాలు లేకుండా ప్రభుత్వాలతో చర్చించిన దాఖలాలున్నాయి. వీళ్లకు కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోల నుంచి పూర్తి సహకారం లభించేది. అప్పటి మద్రాసు నుంచి హైదరాబాద్ కు సినీపరిశ్రమను తరలించే క్రమంలో ఈ ఇద్దరు దిగ్గజాలు ఎన్ని కష్టాలు పడ్డారో అప్పటి నిర్మాతల్ని, సినీవిమర్శకుల్ని అడిగితే పుంఖానుపుంఖాలుగా చెబుతారు. మరి అదే చొరవను ఇప్పటి హీరోలు ఎందుకు చూపించలేకపోతున్నారు.

నిర్మాతల కంటే ఫేస్ వాల్యూ ఉన్న హీరోలు ముందుకొచ్చి సమస్యను ప్రస్తావిస్తే దాని ఇంపాక్ట్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఈ విషయాన్ని అంతా అంగీకరించాల్సిందే. కానీ స్టార్ హీరోలు మాత్రం ఈ విషయంలో స్తబ్దుగా మారిపోయారు. అదంతా నిర్మాతల వ్యవహారం అన్నట్టు మిన్నకుండిపోయారు. చిరంజీవి, నాగార్జున మినహా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క హీరో ఈ దిశగా చొరవ తీసుకోలేదు.

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు