కమల్ హాసన్.. విశ్వనటుడు. బహుశా ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఇండియన్ స్క్రీన్ పై మరో హీరో చేయలేదు. మరి ఈ విలక్షణ నటుడు తన సినిమాను తాను థియేటర్ లో చూసుకుంటారా? తన సినిమా విడుదలైన మొదటి రోజు కమల్ హాసన్ పరిస్థితేంటి?
“నా ప్రతి సినిమాను మొదటి రోజు థియేటర్లలో చూడాలనుకుంటాను. కానీ వెళ్లను. నేను పెద్ద స్టార్ ని అనే పొగరుతో థియేటర్లకు వెళ్లడం ఆపేయలేదు. నేను ఆ షోలో ఉన్నానని తెలిస్తే, ఫోకస్ మొత్తం నావైపు మారిపోతుంది. స్క్రీన్ చూడకుండా జనాలు వెనక్కి తిరిగి చూడడం మొదలుపెడతారు. వాళ్లను నేను డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అందుకే రిలీజైన 10-20 రోజుల తర్వాత వెళ్తాను. ఆల్రెడీ అప్పటికే చూసేసిన వాళ్లకు అది పెద్ద ఇబ్బంది అనిపించదు.”
ఇక సినిమా రిజల్ట్ గురించి తను ఎప్పుడూ ఆలోచించనంటున్నారు కమల్. చేసిన పాత్రకు న్యాయం చేశామా లేదా అనేది మాత్రమే చూస్తానని, కమర్షియల్ లెక్కలు చూడనని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తను చేయాల్సిన పాత్రలపై కూడా స్పందించారు.
“నేను చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. 232 సినిమాలు చేశాను. ఇది జస్ట్ నంబర్ మాత్రమే. అందులో పెద్ద అర్థం ఉన్నట్టు నాకు అనిపించలేదు. వీటిలో 30-32 సినిమాల్లో నేను ప్రూవ్ చేసుకున్నానేమో. కాస్త కొత్తగా ఉన్నాయేమో. కాబట్టి చేయాల్సిన పాత్రలు ఇంకా చాలానే ఉన్నాయి. కాకపోతే ఫలానా టైపులో కావాలని అడిగే మేకర్స్ చాలా తక్కువమంది ఉన్నారు.”
విక్రమ్ సినిమాతో థియేటర్లలోకి వస్తున్నారు కమల్. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకుంటానని చెబుతున్నారు. ఈ సినిమా కథ రాసింది దర్శకుడు లోకేషే అయినప్పటికీ.. ఆ కథకు కావాల్సిన స్టోరీలైన్ ను తానే అందించానంటున్నారు కమల్.