ఆ ‘కాఫీ’లో రంగు-రుచి-వాసన ఎందుకు తగ్గింది?

కాఫీ విత్ కరణ్.. కాఫీ అక్కడే ఉంది, కరణ్ కూడా అక్కడే ఉన్నాడు. తారలు కూడా కనిపిస్తున్నారు. కానీ ఎందుకో ఆ కాఫీలో రంగు, రుచి, చిక్కదనం కనిపించడం లేదు. అవును.. కాఫీ విత్…

కాఫీ విత్ కరణ్.. కాఫీ అక్కడే ఉంది, కరణ్ కూడా అక్కడే ఉన్నాడు. తారలు కూడా కనిపిస్తున్నారు. కానీ ఎందుకో ఆ కాఫీలో రంగు, రుచి, చిక్కదనం కనిపించడం లేదు. అవును.. కాఫీ విత్ కరణ్, తన ప్రాభవాన్ని కోల్పోతోంది. తన మేజిక్ ను చూపించలేకపోతోంది. దీనికి కారణం కరణ్ జోహార్ మాత్రం కాదు.

ఎన్ని సీజన్లు మారినా అతడిలో అప్పటికీ ఇప్పటికీ అదే వాక్చాతుర్యం, అదే హాస్యం కనిపిస్తోంది. తారల మనసు లోతుల్లో దాగున్న విషయాల్ని బయటకు లాగడంలో అతడు తనకుతానే సాటి అనిపించుకున్నాడు. ఎటొచ్చి తారలు మాత్రం ఒకప్పట్లా తమ మనసు పొరల్లో దాగున్న విషయాల్ని బయట పెట్టాలనుకోవడం లేదు. అదే ఇప్పుడీ కార్యక్రమానికి కారుమబ్బులా మారింది.

తనకు ఎలాంటి సెక్స్ భంగిమ అంటే ఇష్టమో ఓపెన్ గా చెప్పింది అలియాభట్. తను ఎవరితో డేటింగ్ చేస్తున్నానో పరోక్షంగా వెల్లడించింది కత్రినాకైఫ్. ఐశ్వర్య రాయ్ ను చూస్తే ప్లాస్టిక్ గుర్తొస్తుందంటూ బాహాటంగా బయటపడ్డాడు ఇమ్రాన్ హస్మి. ఇప్పుడు ఎంతమంది ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు? పైపైన మాట్లాడి, 3-4 జోకులు వేసుకొని, 'కాఫీ' తాగి వెళ్లిపోయే బాపతే ఎక్కువమంది. ఈ మెంటాలటీ చాలు, కాఫీ విద్ కరణ్ తన మేజిక్ టచ్ కోల్పోవడానికి.

సమస్య స్టార్స్ లో లేదు, కరణ్ మారలేదు, మరి ఏంటి?

అయితే ఇక్కడ సమస్య అతిథులుగా వస్తున్న షారూక్, సల్మాన్, రణ్వీర్, దీపిక లాంటి స్టార్స్ లో లేదు. కరణ్ టైమింగ్ కూడా తగ్గలేదు. వయసు పెరిగినా అతడి మాటల గారడీ మారలేదు. గుచ్చిగుచ్చి అడిగే మనస్తత్వం పోలేదు. వివాదాలు రేపాలనే కుతి అలానే ఉంది. ఎటొచ్చి బాలీవుడ్ లో పరిస్థితులు మారిపోయాయి.

కరోనా తర్వాత బాలీవుడ్ లో పని సంస్కృతి మారింది. అదే టైమ్ లో తారల మానసిక స్థితి కూడా మారింది. ఒకప్పట్లా ఓపెన్ గా మాట్లాడ్డం తగ్గించుకున్నారు తారలు. తమ వ్యక్తిగత విషయాల కంటే సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఓపెన్ గా మాట్లాడిన హిందీ తారలు, ఇప్పుడు అనవసర వివాదాల జోలికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ప్రేక్షకులు తమ వ్యక్తిగత జీవితాల కంటే సినిమాల పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారేమో అనే అనుమానాన్ని స్వయంగా షారూక్ వ్యక్తం చేశాడంటే.. పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మార్పు ఎందుకొచ్చిందనేది స్పష్టంగా చెప్పలేం కానీ, కాఫీ విద్ కరణ్ కు ఇదే తొలి ఎదురుదెబ్బ అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.

ఆ పాత మెరుపులు ఇప్పుడెక్కడ?

సీజన్ 4, సీజన్ 6 లో చూసిన మెరుపులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అప్పట్లో కాఫీ విత్ కరణ్ అంటే ఓ వైభోగం. వివాదాలకు కేంద్రం. ఎన్నో సంచలన విషయాలకు అడ్డా. ఓ సీజన్ లో కరీనా కపూర్ మాట్లాడుతూ.. తను త్వరలోనే సైఫ్ ను పెళ్లి చేసుకోబోతున్నానంటూ ప్రకటించినప్పుడు పక్కనే ఉన్న సైఫ్ కూడా షాక్ అయ్యాడంటే, ఈ షో అప్పట్లో ఎంత రంజుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రణబీర్ కపూర్ కండోమ్ బ్రాండ్ ప్రచారానికి సరిగ్గా సరిపోతాడని దీపిక పదుకోన్ స్టేట్ మెంట్ ఇవ్వగానే, జనాలు ఎన్ని రకాలుగా ఊహించుకున్నారో, అప్పటి యూత్ కు మాత్రమే తెలుసు. అంతెందుకు, ఇదే షోలో వర్జిన్ అంటూ తనకుతానుగా ప్రకటించుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ ముఖ కవళికల్ని ఎవ్వరు మర్చిపోగలరు?

ఇలా చెప్పుకుంటూవెళ్తే చాలానే ఉన్నాయి. ఓ సీజన్ లో విద్యాబాలన్ తన ఫాంటసీల గురించి మాట్లాడుతూ.. ఓ వివాహిత వ్యక్తి తన భార్యను మోసం చేసి, తనతో గడిపితే బాగుంటుందంటూ ప్రకటించింది. అలాంటి వ్యక్తిగా షారూక్ ఖాన్ ను తను ఊహించుకుంటానని కూడా తెలిపింది. ఆ తర్వాత ఆమె జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

కాఫీలో కారం పొడి జల్లిన సోషల్ మీడియా..

ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు, డేటింగ్స్, సెక్స్, ఫుడ్, ఆస్తులు.. ఇలా ఒకటేంటి, సమస్త విషయాలపై ఓపెన్ గా మాట్లాడుకున్న రోజులవి. కానీ ఇప్పుడంతా డిప్లమసీ వచ్చేసింది. ఒకప్పుడు తారలంతా కరణ్ షోలో ఛిల్ అయ్యేవారు. మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేవారు. కానీ ఇప్పుడలా మాట్లాడితే సోషల్ మీడియా ఊరుకోవడం లేదు. ఏకి పడేస్తున్నారు. విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అవసరమైతే మార్ఫింగ్ ల వరకు వెళ్లిపోతున్నారు. దీనికితోడు బాలీవుడ్ లో పెరిగిన అసహనం తారల్ని కార్నర్ లోకి నెట్టేసింది.

ఇప్పటితరం తారలు ఒకప్పటి షారూక్, దీపిక, టబు, విద్యాబాలన్ లా ఓపెన్ గా మాట్లాడ్డం లేదు. అంతా తమకు అనుకూలమైన ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. నవ్వులతో కొన్నింటిని కవర్ చేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, తారలంతా రాజకీయ నాయకులైపోయారు. ఈ పద్ధతి కాఫీ విత్ కరణ్ కు అస్సలు పనికిరాదు. గడిచిన ఆరేళ్లుగా ఇదే కనిపిస్తోంది. దీంతో కాఫీ రుచి మారిపోయింది.

పైగా కార్యక్రమానికి వచ్చే అతిథుల మధ్య కూడా ఎలాంటి కనెక్షన్ ఉండడం లేదు. వ్యక్తిగతంగా ఎవరికివారు దూరంగా ఉంటున్నారు. దీనికితోడు ప్రజల అభిరుచుల్లో కూడా మార్పు వచ్చింది. తారల్ని ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నది మరో వాదన. ఇలా కాఫీ విత్ కరణ్ తన మెరుపు కోల్పోవడానికి ఎన్నో కారణాలు. ఒక దశలో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించాడు కరణ్ జోహార్. బహుశా, అతడు ఆ మాటకు కట్టుబడి ఉంటే బాగుండేది.