నాగబాబు ఎప్పుడూ ఇంతే. ఏదో ఒక విషయంలో పవన్ కల్యాణ్ ను ఇరుకున పెడుతుంటారు. తను ఇబ్బంది పడతారు, పవన్ ను ఇబ్బంది పెడతారు, పార్టీని ఇరకాటంలో పడేస్తారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా మరోసారి నాగబాబు చేసిన కామెంట్స్, పవన్ ను ఇరకాటంలోకి నెట్టాయి.
“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…!” అంటూ రాత్రి ఓ ట్వీట్ పెట్టారు నాగబాబు. ఇది పిఠాపురం వర్మను ఉద్దేశించి నాగబాబు పెట్టిన ట్వీట్ అని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం అల్లు అర్జున్ ను విమర్శిస్తూ నాగబాబు పెట్టినట్టు చెప్పుకొస్తున్నారు.
రెండోది బాగా కనెక్ట్ అయింది. పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం భగ్గుమంది. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ చేసిన పని అందరికీ తెలిసిందే. పవన్ కు మద్దతుగా ఆయన ఓ ట్వీట్ వేశాడు. ఆ వెంటనే నంధ్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికారు. ఇలా ఒకే ఎన్నికలో రెండు పార్టీల అభ్యర్థులకు ఆయన మద్దతు తెలపడంతో పాటు.. నిన్న ఓటు వేసే టైమ్ లో కూడా తన చర్యను గట్టిగా సమర్థించుకున్నాడు బన్నీ.
ఇవన్నీ నాగబాబును డీప్ గా హర్ట్ చేసినట్టున్నాయి. అందుకే రాత్రి గట్టిగా ట్వీట్ పెట్టారు. దీంతో పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మరోసారి గొడవ రాజుకుంది. తమది పవనిజం అంటూ వీళ్లు, తాము అల్లు ఆర్మీ అంటూ వాళ్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
నిజానికి నాగబాబు, తన ట్వీట్ ను పొద్దున్నే పెట్టొచ్చు. అలా చేస్తే ఎక్కడ ఓట్లు చీలతాయో అని ఆయన భయపడినట్టున్నారు. అందుకే పోలింగ్ పూర్తయ్యేవరకు ఆగి, తాపీగా రాత్రి ఈ ట్వీట్ వేసి అగ్గిరాజేశారు.
పవన్-బన్నీ ఫ్యాన్స్ మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ ఎప్పుడైతే కామెంట్ చేశాడో అప్పట్నుంచి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. తాజాగా నాగబాబు ట్వీట్ తో ఈ వైరం ఆకాశాన్నంటింది. ఫలితంగా అది పవన్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
నాగబాబు, పవన్, అల్లు అర్జున్.. వీళ్లంతా ఒకే కుటంబ సభ్యులు. ఏవైనా అభిప్రాయబేధాలు, విబేధాలు ఉండే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. పెద్దమనిషి చిరంజీవి ఎలాగూ ఉండనే ఉన్నారు. కానీ ఇలా పరోక్షంగా ట్వీట్లు పెట్టి అభిమానుల మధ్య చిచ్చుపెట్టడం ఎంత వరకు కరెక్ట్..?