కడప పార్లమెంట్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. దీనికి కారణం… వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు ఢీకొడుతుండడమే. వైసీపీ తరపున కడప సిటింగ్ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నారు. తాను రాజన్న బిడ్డనని, ఆదరించాలని షర్మిల ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే రాజన్న తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ షర్మిల, సునీత నిలదీస్తూ కడప జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కడప ప్రజానీకం ఎలాంటి తీర్పు ఇచ్చి వుంటారనే చర్చకు తెరలేచింది. ఓటింగ్ సరళిని గమనిస్తే.. కడప పార్లమెంట్లో కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇది షర్మిలను గెలిపిస్తుందా? అంటే… లేదనే సమాధానం వస్తోంది. పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజక వర్గాల్లో కొంత వరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని సమాచారం. రెండు మూడుశాతం ముస్లింల ఓట్లు కూడా షర్మిలను చూసి కాకుండా, కాంగ్రెస్‌పై సానుకూల ధోరణితో వేసినట్టు తెలిసింది.
అయితే ఈ క్రాస్ ఓటింగ్ వైసీపీ విజయాన్ని ఆపలేదని మెజార్టీ అభిప్రాయం. కొన్ని చోట్ల టీడీపీ నేతలు షర్మిలకు ఓట్లు వేయాలని ప్రచారం చేసినట్టు సమాచారం. షర్మిలకు అనుకూలమని కాకపోయినా, అవినాష్‌పై వ్యతిరేకతతో కొన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు శాతం క్రాస్ ఓటింగ్ జరిగినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంత మాత్రాన అవినాష్ ఓడిపోతారని, షర్మిల అద్భుతం సృష్టిస్తుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదు.
అవినాష్‌పై కోపం వుంది, దాన్ని ఓటు రూపంలో తెలియజేయాలంటే, ప్రత్యామ్నాయంగా వైసీపీ ఓటర్లు కొన్ని చోట్ల షర్మిలను ఎంచుకున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం.