మళ్లీ రొట్టకొట్టుడు సినిమాలు ఆడేస్తున్నాయి!

కరోనా కాలంలో పెద్ద సినిమాలకి కాలం చెల్లిపోయిందని చాలామంది అనుకున్నారు. పెద్ద సినిమాలు చేసినా కొత్తదనం కోరుకునే అద్భుతాలు తియ్యాలి తప్ప రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు తీస్తే ఆడవన్నారు. థియేటర్స్ కి ఇక మనుగడ…

కరోనా కాలంలో పెద్ద సినిమాలకి కాలం చెల్లిపోయిందని చాలామంది అనుకున్నారు. పెద్ద సినిమాలు చేసినా కొత్తదనం కోరుకునే అద్భుతాలు తియ్యాలి తప్ప రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు తీస్తే ఆడవన్నారు. థియేటర్స్ కి ఇక మనుగడ లేదని సురేష్ బాబు లాంటి వాళ్లే చెప్పారు. ప్రేక్షకులు ఓటీటీలకి అలవాటు పడిపోయారని, దానివల్ల ఇక హీరోల స్టార్డం కూడా ఆవిరైపోవడం ఖాయమని అన్నారు. 

ఇదంతా అనుకుని ఏడాది-రెండేళ్లు అయ్యిందేమో! 

చెంప చెళ్లుమనేలాగ థియేటర్స్ వద్ద కాసులు గలగలమంటునే ఉన్నాయి. అది కూడా రొట్టకొట్టుడు చిత్రాలకి. 

వాల్తేర్ వీరయ్య ఏ రేంజులో ఆడుతోందో చూసాం. అందులో కొత్తదనం, కాకరకాయల్లాంటివి ఏమీ లేవు. వింటేజ్ మోడల్ చిరంజీవి సినిమా అంతే. ఆ తరం ఈ తరం తేడా లేకుండా అందరూ హారతిపట్టేసి ఆడించేసారు. సినిమాని ఆడించే గుణం తమ మెదడులోది కాదని, తమ డి.ఎన్.ఏ లోదని తేల్చి చెప్పారు. 

ఇదేదో తెలుగువారి నైజం అనుకుంటే పొరపాటు. బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి. “పఠాన్” ఊహించని విధంగా కలెక్షన్స్ రాబడుతోంది. 1990ల తర్వాత కాష్మీర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్న సినిమా ఇదే. ఒక ప్రాంతమని కాదు.. భారతీయ సినీ ప్రేక్షకుల డి.ఎన్.ఏ కి అద్దం పట్టే విధంగా మాస్ మసాలా సినిమాలు ఆడేస్తున్నాయి. 

ఇదంతా ఒకెత్తైతే ఈ పఠాన్, వాల్తేర్ వీరయ్యలు ఆడడానికి ఇతర కారణాలు కూడా లేకపోలేదు. 

ముందు “పఠాన్” గురించి చెప్పుకుందాం. బీజేపీ వాళ్లు ఈ సినిమాపట్ల చాలా అతి చేసారు. దీపికాపడుకొనె బికినీ రంగు భాజపా జెండా రంగులో ఉందని గొడవ మొదలుపెట్టారు. దానికి ముందు షారుఖ్ ఖాన్ పట్ల ద్వేషంతో “బాయ్కాట్” నినాదాలు చేస్తూ ట్విట్టర్లో ట్రెండింగ్ చేసారు కొందరు.అంతకు ముందు షారుఖ్ కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వివాదం పత్రికల్లో పతాక శీర్షిక అయ్యి కూర్చుంది. వెరసి ఈ సంఘటనలన్నీ షారుఖ్ ని నిత్యం వార్తల్లో ఉండేలా చేసాయి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టుగా ఈ నెగటివ్ వార్తలన్నీ సినిమా బజ్ కి పాజిటివ్ గా పని చేసాయి. ఇక్కడ పబ్లిసిటీ ఉందా లేదా అనేది మేటర్ తప్ప అది పాజిటివా, నెగటివా అనేది కాదు. 

అలాగే చిరంజీవి “మా” ఎన్నికలప్పటి నుంచీ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. మరో పక్క గరికపాటి వివాదం కావచ్చు, మరొకటి కావొచ్చు, వరుసపెట్టి సినిమాలు కావొచ్చు…నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండడం వల్ల యంగ్ ఆడియన్స్ కి కూడా రిలవెంట్ గా కనిపిస్తూ తాజా చిత్రానికి అధిక కలెక్షన్స్ తెచ్చుకోగలిగారు. అఫ్కోర్స్ వీటన్నిటికంటే పెద్ద విషయం సంక్రాంతి సీజన్ కూడా కావడం. 

మొత్తానికి సినిమారంగానికి ఎటువంటి కొత్త ఒడిదుడుకులు లేవని, మాస్ మసాలా సినిమాలు చేస్తే థియేటర్స్ కి వచ్చి ఆదరించడానికి నవతరం కూడా సిద్ధంగా ఉందని ప్రూవ్ అయింది. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనుగడ ప్రశ్నార్ధకంగా ఉన్నది ఓటీటీలకే. కరోనా లాక్డౌన్లప్పుడు చూసినంతగా ఇప్పుడు ఓటీటీలపై జనం టైం పెట్టడం లేదు. చాలా ఓటీటీ సంస్థలు ఫండ్స్ లేవని చెబుతూ సినిమాలను కొనడంలేదు. కొన్నా కూడా డబ్బు మొత్తాన్ని సెటిల్ చేయడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్నట్టు వినికిడి. తమకున్న చందాదారులను జారిపోకుండా చూసుకోవడం, మరో పక్క ఇతర సంస్థల నుంచి పోటీని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది వివిధ ఓటీటీలకి. 

శ్రీనివాసమూర్తి