జనసేన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఉరుములేని పిడుగులా ఓ ప్రకటన వచ్చింది. సోషల్ మీడియా కోసం జనసేనాని ఇంటర్వ్యూ ఇస్తున్నారనేది దాని సారాంశం. దానితో పాటు మాంచి స్టిల్స్ ఓ నాలుగు వదిలారు. యథావిధిగా వాటిలో పశువులకు మేత పెట్టేవి, చేతిలో పుస్తకం పట్టుకునేవి, విశ్వాంతరాళంలోకి అలా మేథావిలో తొంగిచూసేవి.. ఉన్నాయి. కొత్తగా మాంచి బ్రాండెడ్ వైట్ మాస్క్ తో ఉన్న ఫొటో దీనికి అదనం. అయితే ఆ వెంటనే ఇంటర్వ్యూ వస్తుందనుకున్న జనాలకు మాత్రం చిన్న షాక్ ఇచ్చారు పవన్.
సినిమా ప్రమోషన్ టైపులో ఇంటర్వ్యూకు సంబంధించి టీజర్ గా నిన్న ఫొటోలు రిలీజ్ చేశారు. ఈరోజు ఇంటర్వ్యూ విడుదల చేస్తారట. పవన్ కల్యాణ్ సామాజిక, స్థానిక, దేశ, అంతర్జాతీయ వ్యవహారాలు, సినీ విశేషాలపై స్పందించారని ఇంటర్వ్యూ పూర్తిపాఠంలో ఈరోజు మొదటి భాగం విడుదల చేస్తామని అన్నారు. కొండంత రాగం తీసి ఏదో చేసినట్టు.. చివరకు ఈ మెసేజ్ పెట్టారు.
ఇలాంటి బిల్డప్ సీన్లు, ఎలివేషన్ పార్ట్ లు సినిమాల్లో పనికొస్తాయి కానీ రాజకీయాల్లో కాదు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి మహూర్తం పెట్టుకుంటే అదే టైమ్ కి దాన్ని రిలీజ్ చేయాలి కానీ, ప్రోమో వదిలి, టీజర్ కట్ చేసి, ఇంటర్వ్యూ పెట్టడమంటే దాన్ని ఇంకేమనాలి. ఏదైనా న్యూస్ ఛానెల్ తన ప్రమోషన్ కోసం ఇలాంటి ఫీట్లు చేసిందంటే పర్లేదు కానీ, ప్రజలకు సందేశాన్నివాలనుకుంటున్న పవన్ కల్యాణ్ లో ఇలాంటి పైత్యం ఎందుకు.
జనసైనికులు ఆయనకంటే మరో నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పవన్ విడుదల చేసిన స్టిల్స్ లో ఆయన చేతిలో 'ద పవర్ ఆఫ్ మిత్' అనే పుస్తకం ఉంది. ఇక చూస్కోండి కొంతమంది మేథావులు ఆ పుస్తకాన్ని ఆన్ లైన్లో వెదికి, దాన్ని ఆర్డర్ ఇచ్చి, ఆ ఆర్డర్ కాపీని తమ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేసిందాకా నిద్రపోలేదు. పవర్ స్టార్ చదివిన పుస్తకాన్ని తాము కూడా ఆర్డర్ చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారు.
పవన్ నుంచి రాబోయే ఇంటర్వ్యూలో కొత్త విషయాలేవీ ఉండవని అందరికీ తెలుసు. బీజేపీ భజనకే ఎక్కువ టైమ్ కేటాయించారనే విషయం కూడా తెలుసు. కానీ ఆర్భాటం మాత్రం నిన్నట్నుంచి ఓ రేంజ్ లో జరుగుతోంది. ఒక ఇంటర్వ్యూ కోసం ఇంత ఆర్భాటం ఎందుకో జనసైనికులికే తెలియాలి.