ఏప్రిల్ తో ఎంత లాభం.. ఆలోచనలో పడిన నిర్మాతలు

సమ్మర్ అంటే స్కూల్ పిల్లలకు ఎంత ఇష్టమో.. సినిమా వాళ్లకు అంతకంటే ఇష్టం. కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చనే ఆలోచన వారిది. కానీ ఈసారి థర్డ్ వేవ్ వల్ల సమ్మర్ సీజన్ కాస్త వెనక్కి జరిగింది. పిల్లల…

సమ్మర్ అంటే స్కూల్ పిల్లలకు ఎంత ఇష్టమో.. సినిమా వాళ్లకు అంతకంటే ఇష్టం. కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చనే ఆలోచన వారిది. కానీ ఈసారి థర్డ్ వేవ్ వల్ల సమ్మర్ సీజన్ కాస్త వెనక్కి జరిగింది. పిల్లల స్కూళ్లు, ఎగ్జామ్స్..  మే వరకు కొనసాగే అవకాశముంది. అంటే ఏప్రిల్ లో విడుదల తేదీలు ఖరారు చేసిన కేజీఎఫ్-2, బీస్ట్ మూవీస్ కు కష్ట కాలమేనని చెప్పాలి. ఇంకాస్త ముందుగా మార్చి 25న వస్తున్న ఆర్ఆర్ఆర్ కి కూడా శెలవులు కలిసొచ్చే అవకాశం లేదు. మరి వీరంతా ఏం చేస్తారో చూడాలి.

తెలుగు సినిమాలకు కూడా పెద్ద పండగలా చెప్పుకునే సంక్రాంతి సీజన్ ని ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ మిస్ అయ్యాయి. కరోనా కారణంగా, ఫిఫ్టీ పర్సెంట్ రేషియో నియమ నిబంధనలతో.. అందరూ వెనక్కి తగ్గారు. అందులోనూ ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కూడా వారి ఆశలపై నీళ్లు చల్లింది. అయితే బంగార్రాజు లాంటి సినిమాలు సర్దుకుపోయి, కరోనాతో పోటీపడి మరీ థియేటర్లలోకి వచ్చి సేఫ్ జర్నీ చేశాయి. వాయిదాలు వేసుకున్నవాళ్లంతా.. వేసవిపైనే దృష్టిపెట్టారు. కానీ ఇప్పుడు సమ్మర్ సీజనే అసలు సమస్యగా మారింది.

ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కూడా సమ్మర్ సీజన్ ముందుకెళ్లిపోయింది. కరోనా సెలవుల్లో జరగాల్సిన సిలబస్ ని ఏప్రిల్ నెలాఖరు వరకు క్లాసులు పొడిగించి కవర్ చేస్తున్నారు. అంటే మే రెండో వారం వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఈలోగా సినిమాలు విడుదలైనా స్టూడెంట్స్ సినిమాలకు రారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమైనట్టే. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే సమ్మర్ సినిమాలకు కలెక్షన్లు ఉండవు. అందుకే పెద్ద సినిమాల నిర్మాతలు భయపడుతున్నారు.

సమ్మర్ లెక్కలు వేసుకుని మార్చి, ఏప్రిల్ లో సినిమాల విడుదల తేదీలపై కర్చీఫ్ వేసుకున్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు తరగతుల విషయంలో తకరారు మొదలైంది. పిల్లలకు సెలవలు లేని సమ్మర్ లో సినిమాలు వేయాలా.. లేక కొన్నిరోజులు ఆగాలా అనే డైలమాలో పడ్డారు నిర్మాతలు. తేదీలు, మహూర్తాలు, ఇగోలు పక్కనపెడితే.. సెలవల్లో కలెక్షన్లు రావాలి అందరికీ. అందుకే మరోసారి విడుదల తేదీలపై తర్జనభర్జనలు మొదలయ్యాయి.

ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ కు రెడీ అయిన ఆచార్య, ఎఫ్3 సినిమాలపై ఈ ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. మార్చి 25న రిలీజ్ కు సిద్ధమైన ఆర్ఆర్ఆర్, ఏప్రిల్ మధ్యలో వస్తున్న కేజీఆఫ్, బీస్ట్ లాంటి సినిమాలపై మాత్రం ప్రభావం పడేలా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ స్కూళ్లలో కూడా తరగతులను పొడిగించే ఆలోచనలు జరుగుతున్నాయి. థర్డ్ వేవ్ దాదాపు ముగిసిపోవడంతో, వేసవి శెలవులు కుదించి, క్లాసులు పొడిగించి, కాస్త ఆలస్యంగా పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్ని రాష్ట్రాలు ఉన్నాయి.