కెరీర్ లో గ్యాప్ అనేదే లేకుండా సినిమాలు చేస్తున్నాడు. మినిమం గ్యాప్స్ లో అతడి నుంచి సినిమాలొస్తుంటాయి. అయితే వరుసపెట్టి సినిమాలొస్తున్నాయి కానీ, విశాల్ ఆశించిన సక్సెస్ మాత్రం అతడికి అందడం లేదు. రెండేళ్లుగా వరుసపెట్టి ఫ్లాపులిస్తున్న ఈ హీరో, కొత్త ఏడాదిని సక్సెస్ తో మొదలుపెట్టాలని చూస్తున్నాడు. తన ఆశలన్నీ సామాన్యుడు సినిమాపైనే పెట్టుకున్నాడు.
తను ఏ సినిమా చేసినా అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సామాన్యుడు కూడా అదే జానర్ లో తెరకెక్కింది. ఈసారి కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ ఈ సినిమా చేశాడు విశాల్. ట్రయిలర్ బాగుంది కానీ అందులో కొత్తదనం కనిపించలేదు. కనీసం సినిమాలోనైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే ఆదరణ దక్కుతుంది. లేదంటే కొత్త ఏడాదిలో విశాల్ కొత్తగా సాధించేం ఉండకపోవచ్చు.
తన కెరీర్ లో 31వ చిత్రంగా సామాన్యుడు సినిమాను తీశాడు విశాల్. ఇందులో హీరోగా నటించడమే కాకుండా, ఎప్పట్లానే తనే నిర్మించాడు. నాట్ ఏ కామన్ మేన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వడం విశాల్ కు అత్యవసరం. ఎందుకంటే, ఇప్పటికే టాలీవుడ్ లో విశాల్ మార్కెట్ పడిపోయింది. అతడి సినిమాల్ని ఎగబడి కొనే రోజులు ఎప్పుడో పోయాయి. మరోవైపు తెలుగులో నాన్-థియేట్రికల్ మార్కెట్ ను కూడా అతడు కోల్పోయాడు.
పోయిన మార్కెట్ తిరిగి వెనక్కి రావాలన్నా, విశాల్ మరోసారి క్రేజ్ తెచ్చుకోవాలన్నా.. అతడు నటించిన సామాన్యుడు సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి. డింపుల్ హయతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలోకొస్తోంది.