పవన్ కల్యాణ్ ను కెలకడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేం కాదు. ఆ మాటకొస్తే ఏకంగా పవన్ కల్యాణ్ పై ఓ సినిమానే తీశాడు ఈ దర్శకుడు. ఎప్పుడూ పవన్ ను ఏదో ఒకటి అనకుండా ఉండలేడు ఆర్జీవీ.
ఏదైనా అంటే మళ్లీ తనే పెద్ద పవన్ ఫ్యాన్స్ అంటాడు. ట్వీట్లలో మాత్రం కెలుకుడు కామన్. ఇప్పుడిదంతా ఎందుకంటే, ఈ దర్శకుడు మరోసారి పవన్ ను కెలికాడు. భీమ్లానాయక్, అల్లు అర్జున్ పుష్పను కంపేర్ చేస్తూ కంగాళీ చేశాడు.
పుష్ప సినిమా నార్త్ లో హిట్టయిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై ట్వీట్లు స్టార్ట్ చేశాడు వర్మ. పుష్ప సినిమానే ఉత్తరాదిన అంత చేస్తే, పవర్ స్టార్ నటించిన భీమ్లానాయక్ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేమంటూ ట్వీట్ చేశాడు వర్మ.
ఒకవేళ భీమ్లానాయక్ ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకపోతే, పవన్ ఫ్యాన్ అయిన తను బన్నీ ఫ్యాన్స్ కు సమాధానం చెప్పుకోలేనన్నాడు. ఇక్కడితో ఆగలేదు ఆర్జీవీ.
గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో రిలీజ్ చేయొద్ద, వర్కవుట్ అవ్వదని చెప్పాడట వర్మ. కానీ అప్పుడు పవన్ కల్యాణ్ వినలేదట. ఇప్పుడు మాత్రం భీమ్లానాయక్ ను హిందీలో రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా పుష్ప-భీమ్లానాయక్ కంటెంట్స్ మధ్య తేడా కూడా చెబుతున్నాడు.
ఎక్కడో మారుమూల ఆంధ్రాలో జరిగిన సబ్జెక్ట్ తో పుష్ప తీస్తే అది పాన్ ఇండియా మూవీ అయిందని.. కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్టులు కూడా పాన్ ఇండియా సినిమాలు అయినప్పుడు.. భీమ్లానాయక్ పాన్-వరల్డ్ సబ్జెక్ట్ అవుతుందంటున్నాడు వర్మ.
పవన్ తర్వాతొచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతుంటే.. పవన్ ఇంకా తెలుగును పట్టుకోని వేలాడడం తనకు కన్నీళ్లు తెప్పిస్తోందన్నాడు ఆర్జీవీ.