సరిగ్గా ఏడాది కిందటి సంగతి.. 2021 జనవరి. రవితేజ నటించిన క్రాక్ సినిమా మంచి శుభారంభాన్నిచ్చింది. కట్ చేస్తే, ఈ ఏడాది ఇదే జనవరి బాక్సాఫీస్ కు ఆ శుభారంభాన్ని అందించలేకపోయింది. జనవరి ప్రారంభంలో విడుదలైన సినిమాలతో పాటు సంక్రాంతి సినిమాల్లో ఏదీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవకపోవడంతో.. ఈ ఏడాది తొలి మాసం చప్పగా ముగిసింది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వరుసగా రెండో ఏడాది డల్ గా క్లోజ్ అయింది.
ఇందువదన, ఆశ ఎన్ కౌంటర్ అనే 2 సినిమాలతో ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ మొదలైంది. వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన సినిమాతో పాటు ఆశ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇక సంక్రాంతికి వస్తాయనుకున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ లాంటి సినిమాలు వాయిదా బాట పట్టడంతో.. చిన్నాచితకా సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఇందులో భాగంగా సంక్రాంతి సీజన్ అతిథి దేవోభవ, 1945, వేయి శుభములు కలుగునీకు లాంటి సినిమాలతో మొదలైంది.
అతిథి దేవోభవ సినిమాతో ఆది సాయికుమార్ మరోసారి నిరాశపరిచాడు. ఇక రానా నటించిన 1945 అనే సినిమా చర్చకు కూడా రాలేదంటే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన వేయి శుభములు కలుగునీకు అనే సినిమా కూడా ఫ్లాప్ అయింది.
ఇక సంక్రాంతికి సూపర్ మచ్చి, రౌడీ బాయ్స్, బంగార్రాజు సినిమాలొచ్చాయి. వీటిలో చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమా అన్నింటికంటే ముందు ఫ్లాప్ అయింది. సరిగ్గా ప్రమోషన్ లేక, రిలీజ్ తర్వాత సినిమాలో కంటెంట్ లేక ఈ సినిమా చతికిలపడింది. ఇక దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్ హీరోగా మారి చేసిన సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వలేకపోయింది. దిల్ రాజు మాత్రం తన సినిమా హిట్ అయినట్టు చెప్పుకుంటున్నారు.
సంక్రాంతికి భారీ అంచనాల మధ్య వచ్చిన ఒకే ఒక్క సినిమా బంగార్రాజు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ కూడా సంక్రాంతిని క్యాష్ చేసుకోలేకపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా ఆంధ్రాలో మాత్రమే హిట్. నైజాంలో, ఓవర్సీస్ లో ఫ్లాప్ అయింది. ఓవరాల్ గా రెవెన్యూ పరంగా ఎబోవ్-యావరేజ్ అనిపించుకుంది బంగార్రాజు సినిమా. బంగార్రాజు రిలీజైన మరుసటి రోజు అశోక్ గల్లా నటించిన హీరో సినిమా వచ్చింది. ఇది కూడా ఫ్లాప్ అయింది.
ఇక సంక్రాంతి తర్వాత ఉనికి, వధు కట్నం, గుడ్ లక్ సఖి లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమా గుడ్ లక్ సఖి మాత్రమే. కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా రిలీజైన మొదటి రోజే డిజాస్టర్ అయింది. పస లేని నెరేషన్ తో బోర్ కొట్టించింది. ఇలా జనవరి నెలలో, మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద మెరవలేకపోయాయి.
ఈ ఏడాది టాలీవుడ్ లో ఆరంభం అంతంతమాత్రంగానే ఉంది. ఫిబ్రవరిలో ఆడవాళ్లు మీకు జోహార్లు, ఖిలాడీ, సామాన్యుడు లాంటి సినిమాలొస్తున్నాయి. వీటిలో ఏదైనా సినిమా బాక్సాఫీస్ కు మంచి ఆరంభాన్నిస్తుందేమో చూడాలి.