టాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ జోష్ లో వుంది. తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలో డల్ అయ్యాయి. తమిళ హీరోలు, దర్శకుడు తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. మరోపక్క డిజిటల్ కంటెంట్ కు డిమాండ్ పెరిగింది. జీ స్టూడియోస్ లాంటి సంస్థలు సరైన ప్రాజెక్టు వుంటే ఫండింగ్ కు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు అంతా హుషారుగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు.
కాస్త ఒకటి రెండు ప్రాజెక్ట్ లు చేసిన వాళ్లు అయితే చాలు, ఆ పేరుకు ఏదో ఓ మంచి నిర్మాత పేరు యాడ్ అయితే చాలు. ఓటిటి లు కొనడానికి రెడీ అయిపోతున్నాయి. మళ్లీ అలా అని పూర్తిగా కొత్తపేర్లు, కొత్త సంస్థలు అయితే మాత్రం పని జరగడం లేదు. సెలబ్రిటీలు, వారి పిల్లలు అయితే మరీ పని సులువు అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు పలువురు రెడీ అవుతున్నారు. హీరో రామ్ చరణ్ ఇప్పటికే తల్లి పేరుతో బ్యానర్ పెట్టారు. రెండు సినిమాలు చేసారు. ఆ తరువాత నేరుగా సినిమాలు నిర్మించడం ఆపేసారు. కేవలం భాగస్వామ్యం తీసుకుంటున్నారు. ఆయనే ఇప్పుడు మరో బ్యానర్ స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
యువి సంస్థకు చెందిన విక్రమ్ తో కలిసి రామ్ చరణ్ చిన్న, మీడియం కంటెంట్ కోసం బ్యానర్ స్టార్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ కు విక్రమ్ కు మంచి స్నేహం వుంది. వ్యాపార భాగస్వామ్యాలు కూడా వున్నాయి.
మరో మెగా హీరో అల్లు అర్ఙున్ కూడా స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభిస్తారని ఏనాటి నుంచో వార్తలు వున్నాయి. ఈ మేరకు సమయం దగ్గరకు వచ్చిందని తెలుస్తోంది. ఆయన కుటుంబానికి గీతా బ్యానర్ వుంది. అలాగే జిఎ 2 బ్యానర్ కూడా వుంది. ఇవి కాకుండా కేవలం అల్లు అర్ఙున్ స్వంత బ్యానర్ ఒకటి ప్రారంభిస్తారని తెలుస్తోంది.
హీరో గోపీచంద్ తండ్రికి నిర్మాణ సంస్థ వుండేది. గోపీచంద్ మాత్రం నిర్మాణరంగంలోకి ఇప్పటి వరకు దిగలేదు. ఆయన కూడా రెమ్యూనిరేషన్ మీద సినిమాలు చేస్తూనే, ఒకటి రెండు సినిమాలు భాగస్వామ్య పద్దతిలో కూడా చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తం మీద కరోనా కల్లోలం, ఆంధ్రలో టికెట్ ల సమస్య ముగిసిపోతే టాలీవుడ్ ఇంకా హుషారుగా ముందుకు దూసుకుపోతుంది.