మత్తుగా గమ్మత్తుగా యువత మాదక ద్రవ్యాల వైపుగా సాగిపోతోంది. ఇది కల్చర్ గా మొదలై చివరికి కన్నీటిగా యువ జీవితాలను మారుస్తోంది. మరీ ముఖ్యంగా సిటీ ఎక్కడైతే పెద్ద ఎత్తున విస్తరిస్తుందో అక్కడే ఈ డ్రగ్స్ కల్చర్ కూడా మెల్లగా అడుగుపెడుతోంది. అది కాస్తా చివరికి ఊడలు వేసుకుని పాతుకుపోతోంది.
విశాఖలో చూసుకుంటే పబ్ కల్చర్ బాగా తక్కువ. అలాగే డ్రగ్ కల్చర్ కూడా ఇంకా పెద్దగా లేదని పోలీస్ వర్గాలు ఇప్పటిదాకా చెబుతున్నాయి. అయితే వరసగా గత రెండు నెలల్లో నాలుగు కేసులను డ్రగ్స్ కి సంబంధించి పోలీసులు నమోదు చేశారు. ఇవి దొరికిన వారివి అయితే దొరకని వారు ఎంత మంది అన్నదే ఆరా తీస్తున్నారు.
లేటెస్ట్ గా చూసుకుంటే హైదరాబాద్ నుంచి, బెంగుళూర్, గోవా నుంచి విశాఖకు డ్రగ్స్ రవాణా అన్నది నెమ్మదిగా మొదలైంది అని పోలీస్ వర్గాలు గుర్తించాయి. తాజాగా హైదరాబాద్ నుంచి ఒక యువతి విశాఖకు వచ్చి మరీ దానికి బానిస అయిన ఒక యువకుడికి అందచేసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ, దీనికి ఆర్ధిక సాయం అందచేసిన మరో యువకుడిని అరెస్ట్ చేశారు.
అయితే హైదరాబాద్ నుంచి ఈ యువతి ద్వారా మాదక ద్రవ్యాలు పంపించిన మరో యువతిని కూడా అదుపులో తీసుకుంటే తప్ప ఈ రాకెట్ మొత్తం గుట్టు మట్లు తెలిసే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ యువతి మత్తు మాత్రలతో పాటు, పౌడర్ ని కూడా విశాఖలో యువతకు రవాణా చేస్తోంది అని పోలీసులు చెబుతున్నారు. మత్తుని ఇచ్చే పద్దెనిమిది ఎం డీ ఎం ఏ టాబ్లెట్లతో పాటు, రెండు ప్యాకెట్ల ఎం డీ క్రిస్టల్ పౌడర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా విశాఖలో డ్రగ్స్ కల్చర్ పాతుకుపోకముందే తుదముట్టించాలన్న లక్ష్యంతో పోలీసులు ప్రతీ సోమవారం నగరంలో మార్పు పేరిట మత్తుకు బానిస అయిన యువతకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అదే విధంగా మత్తు నుంచి బయటపడాలని యువతను చైతన్యం చేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే విశాఖలో డ్రగ్స్ కలకలం ఒక్కసారిగా రేగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.