టైగర్, జవాన్ ను బీట్ చేయగలడా?

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్-3 సినిమా బాక్సాఫీస్ బరిలో భారీగా ఓపెన్ అయింది. దీపావళి సీజన్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటి రోజు దేశవ్యాప్తంగా 44 కోట్ల 50 లక్షల రూపాయల…

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్-3 సినిమా బాక్సాఫీస్ బరిలో భారీగా ఓపెన్ అయింది. దీపావళి సీజన్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటి రోజు దేశవ్యాప్తంగా 44 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు అంతకంటే ఎక్కువగా 57 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ సాధించింది. ఓవరాల్ గా ఈ సినిమా 2 రోజుల్లో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది.

ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే, ఉత్తరాదిన దీపావళి హంగామా ఇంకా నడుస్తోంది. గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ ఉండనే ఉన్నాయి. వీటి కారణంగా వసూళ్లు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

తన 2 రోజుల రన్ కే టైగర్-3 సినిమా జవాన్, పఠాన్ రికార్డులు కొన్నింటిని క్రాస్ చేసింది. రెండో రోజు వసూళ్లలో జవాన్, పఠాన్ సినిమాల కంటే మెరుగ్గా పెర్ ఫార్మ్ చేసింది. అయితే ఈ ఊపు సరిపోతుందా..? జవాన్ సృష్టించిన ఆల్ టైమ్ రికార్డ్ ను టైగర్ -3 క్రాస్ చేసేస్తుందా..? ఈ ప్రశ్నలకు మాత్రం ట్రేడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు..

టాక్ లోనే తేడా..

జవాన్, టైగర్-3 సినిమాల మధ్య టాక్ లోనే తేడా చెబుతోంది ట్రేడ్. జవాన్ సినిమా రిలీజైన వెంటనే యునానిమస్ టాక్ వచ్చింది. సినిమా బాగుందంటూ అంతా ముక్తకంఠంతో చెప్పారు. అలాంటి వేవ్ టైగర్-3 విషయంలో కనిపించలేదు. మొదటి 2 రోజులు ఫ్యాన్స్ హంగామాతోనే సరిపోయింది. అసలైన టాక్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ విషయంలో విశ్లేషకులు కూడా విడిపోయారు.

జవాన్ రేంజ్ లో టైగర్-3కి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే భారీ వసూళ్లు సాధ్యం. మరీ ముఖ్యంగా కేవలం నార్త్ నుంచి ఈ టాక్ వస్తే సరిపోదు, అన్ని ప్రాంతాల నుంచి రావాలి. అప్పుడే జవాన్ ను బీట్ చేసే స్థాయికి చేరుకుంటుంది టైగర్-3.

స్క్రీన్స్ కేటాయింపుల్లో కూడా తేడా..

మరోవైపు రెండు సినిమాల మధ్య స్క్రీన్స్ కేటాయింపుల్లో కూడా తేడా స్పష్టంగా తెలుస్తోంది. టైగర్-3 సినిమా ప్రపంచవ్యాప్తంగా 9వేల స్క్రీన్స్ లో రిలీజైంది. అదే జవాన్ విషయానికొస్తే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. జవాన్ సినిమా స్టడీగా 2 వారాల పాటు అన్ని ఏరియాస్ లో కొనసాగింది. టైగర్-3 కూడా అలా కొనసాగాల్సి ఉంది. వారం రన్ తర్వాత జవాన్ తన స్క్రీన్స్ కోల్పోలేదు. టైగర్-3 కూడా అలా స్టడీగా నిలబడాలి.

స్టార్ డమ్ లో కూడా తేడా..

జవాన్ సినిమా ఆ రేంజ్ లో ఆడడానికి కారణం, అంతకుముందు షారూక్ నటించిన సినిమా పెద్ద హిట్టవ్వడమే. పఠాన్ సినిమా సక్సెస్ తో జవాన్ కు ఓ ఊపు వచ్చింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాంటి రెస్పాన్స్ సల్మాన్ విషయంలో కనిపించడం లేదు ఎందుకంటే, సల్మాన్ ఖాన్ వరుసగా ఫ్లాపులిస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతడి గత చిత్రం కిసీకో భాయ్ కిసీకో జాన్ అనే సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇలాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన టైగర్-3పై ఆటోమేటిగ్గానే సాధారణ జనం అంచనాలు తగ్గుతాయి. ప్రస్తుతానికైతే దీపావళి ఊపులో ఈ సినిమాకు వసూళ్లు బాగానే కనిపిస్తున్నాయి. మరో 2 రోజులు గడిచిన తర్వాత టైగర్-3 అసలు రంగు బయటపడుతుంది. జవాన్ ను ఈ సినిమా బీట్ చేయకపోయినా, కనీసం ఆ సినిమా దరిదాపులకు వెళ్లినా, బాలీవుడ్ మరో భారీ హిట్ చూసినట్టే.