ఏంటో ప్రేక్షకుల అభిప్రాయాలు…నీరసంగా నటిస్తే లేజీ అని, అన్‌ఫిట్ అని విమర్శిస్తారు. కాస్త చలాకీగా నటిస్తే ఓవర్ యాక్షన్ అని ట్రోల్ చేస్తారు. మరి ప్రేక్షకులను, అభిమానులను మెప్పించాలంటే ఎలా నటించాలి? ఇప్పుడిది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ముఖ్యంగా హీరోయిన్‌ల విషయానికి వస్తేనే ఇలాంటి ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. హీరోలు ఎంత ఎక్కువ చేస్తే…అంత బాగా నటించినట్టు ప్రశంసిస్తారు. చిత్ర పరిశ్రమలో ఇదేం విడ్డూరమో అసలు అర్థం కాదు.
‘సరిలేరు నీకెవ్వరు’లో సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలసి రష్మిక నటించారు. ఈ చిత్రంలో ఆమె కాస్త ఓవర్ యాక్షన్ చేసిందనే విమర్శలు వినిపించాయి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతీదానికి అతిగా ఎగ్జైట్ అవుతూ ఓవర్ యాక్షన్ చేసిందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఈ అందాల తార ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది.
తాను అతిగా ప్రవర్తించానంటున్నారు.. కానీ తనకిచ్చిన పాత్రే అలాంటిదని వివరణ ఇచ్చుకున్నారు. పాత్రకు పూర్తి న్యాయం చేయడం తన బాధ్యతగా అభివర్ణించింది.
‘ సినిమాలో నా పాత్ర ఎలా డిజైన్ చేశారో దానికి తగ్గట్టుగానే నేను ప్రవర్తించాను. నిజానికి ఆ పాత్ర కోసం చాలా శ్రమించాను. ఇక విమర్శలంటారా.. దాన్ని నేను మనసారా ఆస్వాదిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నానంటే అవే కారణమని నమ్ముతున్నాను. నన్ను నేను మెరుగుపర్చుకోడానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయని’ తెలిపింది.
నిజానికి విమర్శలను స్వీకరించేందుకు చాలా సంస్కారం కావాలి. రష్మిక మాటలను వింటే ఆమె ఎంత సంస్కారవంతురాలో అర్థమవుతుంది.