బూతులు పెడితే అప్ డేట్ అయినట్టేనా!

బోల్డ్ అనే పదానికి ఎప్పుడో అర్థం మార్చేశారు టాలీవుడ్ మేకర్స్. 2 బూతులు, 3 సెక్స్ సీన్లు పెడితే అదే బోల్డ్ అని ఫీల్ అయిపోతున్నారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఇదే మాట…

బోల్డ్ అనే పదానికి ఎప్పుడో అర్థం మార్చేశారు టాలీవుడ్ మేకర్స్. 2 బూతులు, 3 సెక్స్ సీన్లు పెడితే అదే బోల్డ్ అని ఫీల్ అయిపోతున్నారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. అన్నీ తానై తీసిన ఫలక్ నుమా దాస్ లో విచ్చలవిడిగా బూతులు వాడిన ఈ హీరో, తన తాజా చిత్రం హిట్ లో కూడా ఆ ఛాయలు చూపించాడు. దాన్ని బోల్డ్ అంటున్నాడు. అంతే కాదు, అప్ డేట్ అవ్వడం అంతే ఇదే అంటున్నాడు.

“అప్ డేట్ అవ్వడం అంటే ఇదే. మేం బోల్డ్ ఫిలిం మేకర్స్ గా మారాం. ఇక నా విషయానికొస్తే నేను హద్దులు పెట్టుకోను. ఓ బూతు పెడితే ఆడియన్స్ రారేమో అని అనుకోను. ప్రతి సినిమాలో అన్ని హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. నా సినిమాలో కూడా అలాంటి ఎమోషన్స్ ఉండాలనుకుంటాను. అందులో భాగంగా బూతు వస్తుంది తప్ప, కావాలని నేను బూతు ఎందుకు పెడతాను.”

ఇక్కడితో ఆగలేదు మన విశ్వక్ సేనుడు. సినిమాలో ఆ సన్నివేశంలో, ఆ పాత్ర తనతో అలా మాట్లాడించిందని చెబుతున్నాడు. పైగా ఈసారి తన ప్రమేయం చాలా తక్కువ అని కూడా శెలవిస్తున్నాడు.

“ఆ సిచ్యుయేషన్ లో బూతు మాట్లాడాలి కాబట్టి బూతు వచ్చింది. కావాలని మాత్రం పెట్టుకోలేదు. మరీ ముఖ్యంగా హిట్ మూవీ స్క్రిప్ట్ నేను రాయలేదు, నేను డైరక్ట్ చేయలేదు. కేవలం దర్శకుడికి పప్పెట్ గా మాత్రమే పనిచేశాను.”

ఇలా హిట్ సినిమాలో బూతులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్. నిన్నట్నుంచి హిట్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన విశ్వక్.. ఈసారి వివాదాలకు దూరంగా మాట్లాడాడు. ఏ హీరోను (గతంలో విజయ్ దేవరకొండను కించపరిచేలా మాట్లాడాడు) కించపరిచే విధంగా మాట్లాడలేదు. తన సినిమాలో 2 డజన్లు ట్విస్టులు ఉన్నాయని, సినిమా కచ్చితంగా చూడమని చెబుతున్నాడు.