అర్జున్ రెడ్డి + డియర్ కామ్రేడ్ = వరల్డ్ ఫేమస్ లవర్

మూవీలో కంటెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ కొద్దిసేపటి కిందట విడుదలైన వరల్డ్ ఫేమస్ లవ్ టీజర్ మాత్రం అచ్చం మేం పెట్టిన హెడ్డింగ్ లానే ఉంది. అర్జున్ రెడ్డి ఛాయలు, డియర్…

మూవీలో కంటెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ కొద్దిసేపటి కిందట విడుదలైన వరల్డ్ ఫేమస్ లవ్ టీజర్ మాత్రం అచ్చం మేం పెట్టిన హెడ్డింగ్ లానే ఉంది. అర్జున్ రెడ్డి ఛాయలు, డియర్ కామ్రేడ్ మేనరిజమ్స్ టీజర్ లో కొట్టొచ్చినట్టు కనిపించాయి.

డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ జాగ్రత్త పడ్డాడంటూ వార్తలు వచ్చాయి. అతడి స్టోరీ సెలక్షన్ కూడా ఈసారి కొత్తగా ఉండబోతోందంటూ కథనాలు వచ్చాయి. అయితే ఇది అంతకంటే ముందు ఒప్పుకున్న మూవీ. కాబట్టి అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ హ్యాంగోవర్ ఇందులో స్పష్టంగా కనిపించిందని అనుకోవాలి. యాక్టింగ్ లో ఇప్పటికే బోర్ కొట్టేసిన విజయ్ దేవరకొండ, చివరికి తన లుక్స్ లో కూడా మార్పు చూపించలేకపోయాడు.

అసలు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడే, జస్ట్ ఫొటో చూసి అర్జున్ రెడ్డి టైపులో ఉందంటూ కామెంట్స్ పడ్డాయి. అప్పుడే మేకర్స్ జాగ్రత్తపడి ఉంటే, టీజర్ కాస్త కొత్తగా వచ్చి ఉండేదేమో. అలాంటి ప్రయత్నాలేవీ జరిగినట్టు కనిపించలేదు. చివరికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టీజర్ కటింగ్ విషయంలో కూడా సాహో, మత్తువదలరా లాంటి సినిమాల ఫార్మాట్స్ నే ఫాలో అయ్యారు. ప్రస్తుతానికైతే సినిమా టీజర్ పై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. కనీసం ట్రయిలర్ లోనైనా కొత్తదనం చూపిస్తారేమో చూడాలి.

ఉంగరాల రాంబాబు సినిమాను మినహాయిస్తే.. ఇంతకుముందు క్రాంతిమాధవ్ తీసిన ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలు రెండూ కథాబలం ఉన్నవే. అదే కోవలో ఈ #WFL కూడా ఉంటే ఓకే. లేదంటే ప్రేక్షకులతో పాటు యూనిట్ కూడా నిరాశపడాల్సి వస్తుంది. ప్రేమికుల రోజు కానుకగా వచ్చేనెల 14న థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా.