విశాఖ రాజధానికి అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. మరో నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని షిఫ్ట్ అవుతుందని ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికార్ ప్రవీణ్ ప్రకాష్ తాజాగా చేసిన విశాఖ టూర్లో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటూ లెక్కలు తీశారు.
పైగా ఆయన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల గురించి కూడా వివరాలు తెప్పించుకున్నారు. దీంతో విశాఖ రాజధానికి కసరత్తు షురూ అయిందని అధికార వర్గాలకు పూర్తిగా తెలిసిపోయింది.
ఇవన్నీ ఇలా ఉంటే సచివాలయం కోసం రుషికొండ సమీపంలో ఉన్న ఐటీ హిల్స్ భవనాలను పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్థుల భవనాలు చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే సచివాలయం అవసరాలు తీరుతాయని అంటున్నారు.
అదే విధంగా భీమిలీ నడిబొడ్డున చిట్టివలస జ్యూట్ మిల్లుకు చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది. దీని ఓషన్ వ్యూ గెస్ట్ హౌస్ అని పిలుస్తారు. ఇది పూర్తిగా జ్యూట్ మిల్లు వారిదే అయినా ఇపుడు మిల్లే మూసివేతలో ఉంది. దాంతో గెస్ట్ హౌస్ కూడా నిరుపయోగంగా ఉంది. దీన్ని తీసుకుని బ్యూటిఫికేషన్ చేస్తే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా అద్భుతంగా ఊంటుందని అధికారులు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అదే కనుక జరిగితే అందమైన క్యాంప్ ఆఫీస్ ముఖ్యమంత్రికి ఇక్కడ దొరికినట్లేనని అంటున్నారు. ఇక విశాఖ, భీమిలీ మధ్యలో ఎన్నో భవనాలు ఖాళీగా ఉండడంతో సచివాలయ ఉద్యోగులకు కూడా వసతి సదుపాయాలకు కొరత ఉండదని అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే ప్రవీణ్ ప్రకాష్ టూర్ తరువాత విశాఖలో రాజధాని హడావుడి బాగా పెరిగిందని అంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలివచ్చేస్తుందని అంటున్నారు.