సంక్రాంతికి రావాల్సిన డబ్బింగ్ సినిమాలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే సదరు సినిమాల్లో చాలామటుకు కోలీవుడ్ లో రిలీజయ్యాయి. కాస్త ఆలస్యంగా తెలుగు తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో తెలుగు బయ్యర్లు, నిర్మాతలు టాలీవుడ్ లో చేస్తున్న ప్రచారం కాస్త వింతగా తోస్తోంది. అక్కడ సూపర్ హిట్టయిందని చెప్పుకుంటూ ఇక్కడ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.
ఉదాహరణకు అయలాన్ సినిమానే తీసుకుందాం.. ఈ సినిమాకు 4-స్టార్ రేటింగ్ ఇచ్చిన వెబ్ సైట్ క్లిప్పింగ్స్, స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్, మిషన్ ఛాప్టర్-1 సినిమాలకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు.
తమిళ్ లో హిట్టయిన ప్రతి సినిమా తెలుగులో హిట్టవుతుందా? తమిళ-తెలుగు ఆడియన్స్ మధ్య అభిరుచుల్లో చాలా వ్యత్యాసం ఉన్న విషయం తెలిసిందే కదా. అలాంటప్పుడు అక్కడ హిట్టయిందని ఇక్కడ ఊదరగొట్టడం ఎందుకు?
ఆ మాటకొస్తే, తమిళ్ లో హిట్టయిన ఎన్నో సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయిన సందర్భాలు కోకొల్లలు. చరిత్ర చూస్తే ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని దొరుకుతాయి. అలాంటప్పుడు 'తమిళ్ లో హిట్టయింది, తెలుగులో చూడండి' అంటూ ప్రచారం చేయడంలో అర్థం లేదు కదా.
కోలీవుడ్ రేటింగ్స్ ను ఇక్కడ ప్రచారం చేసుకునే కంటే, కంటెంట్ తో ప్రమోట్ చేసుకోవడం ఎంతో అవసరం. సంక్రాంతి సినిమాల జాతకాలు తేలిపోయాయి. కాబట్టి డబ్బింగ్ సినిమాలకు కావాల్సినన్ని థియేటర్లు దొరకుతాయి. ఇదే సరైన సమయం.