కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలు రాబోతున్నాయి. దాదాపు స్టార్ హీరోలంతా 2023లో సందడి చేయబోతున్నారు. దీంతో పాటు మరో స్పెషాలిటీ కూడా ఉంది. కొత్త ఏడాదిలో కుర్ర హీరోలు తమ పారితోషికాలు పెంచుతున్నారు. ఆల్రెడీ కొందరు పెంచేశారు, మరికొందరు అదే దారిలో ఉన్నారు.
ఈ ఏడాది పాన్ ఇండియా స్టార్ అయ్యాడు నిఖిల్. కార్తికేయ-2 సినిమా అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ ఘనతను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు ఈ హీరో. తాజా సమాచారం ప్రకారం, తన అప్ కమింగ్ సినిమాలకు ఇతడు 7 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట.
ఇంతకంటే కాస్త ఎక్కువే డిమాండ్ చేసే పనిలో ఉన్నాడు మరో హీరో అడివి శేష్. ఈ ఇయర్ మేజర్, హిట్-2 సినిమాలతో భారీ విజయాలు అందుకున్నాడు. పైగా ఓవర్సీస్ లో తన మార్కెట్ ను సుస్థిరం చేసుకున్నాడు. ప్రమోషన్ల విషయంలో మిగతా హీరోల కంటే ఒక అడుగు ముందే ఉంటాడనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీంతో తన పారితోషికాన్ని భారీగా సవరించి, 8 కోట్ల రూపాయలు చేశాడంట ఈ హీరో.
ఇక సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డీజే టిల్లూతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో, ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్, టిల్లూ స్క్ర్వేర్ పనిలో పడ్డాడు. ఈ సినిమాకు అన్నీతానై వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే మరో 2 సినిమాలకు ప్యాకేజీ సిస్టమ్ కింద రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు ఈ హీరో. అంటే.. కథ, కథనం, దర్శకత్వం, నటన.. అవసరమైతే మ్యూజిక్.. ఇలా ఈ విభాగాలన్నింటినీ ఇతడే దగ్గరుండి చూసుకొని సినిమా పూర్తి చేస్తాడట. దీనికోసం 4 కోట్ల రూపాయల వరకు ఇతడు డిమాండ్ చేస్తున్నట్టు టాక్.
విశ్వక్ సేన్, శర్వానంద్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది అశోకవనంలో అర్జునకల్యాణం, ఓరి దేవుడా సినిమాలతో ఓకే అనిపించుకున్నాడు విశ్వక్. ఈ సినిమాల థియేట్రికల్ రన్స్ పక్కనపెడితే.. నాన్-థియేట్రికల్ పరంగా విశ్వక్ తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు. దీంతో తన అప్ కమింగ్ సినిమాలకు కాస్త రేట్లు సవరించాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న ధమ్కీ, సొంత సినిమా కాబట్టి రెమ్యూనరేషన్ తో పనిలేదు. ఆ మూవీ తర్వాత వచ్చే ప్రాజెక్టులకు కనీసం 30శాతం పారితోషికం పెంచాలని అనుకుంటున్నాడట.
అటు శర్వానంద్ కూడా చాన్నాళ్ల తర్వాతొచ్చిన విజయాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్న ఈ హీరో, కొత్త ఏడాదిలో తన పారితోషికాన్ని కనీసం ఓ 50 లక్షలైనా పెంచాలని అనుకుంటున్నాడు.
ఈ హీరోలంతా ఓవైపు ఇలా రేట్లు పెంచుతుంటే, మరోవైపు మరికొంతమంది యంగ్ హీరోలు మాత్రం కొత్త ఏడాదిలో అవసరమైతే తమ పారితోషికాలు తగ్గించుకోవాలని చూస్తున్నారు. శ్రీవిష్ణు, రాజ్ తరుణ్, ఆది సాయికుమార్, కిరణ్ అబ్బవరం, నాగశౌర్య లాంటి హీరోలు మంచి బ్యానర్లు, కథ సెట్టయితే పారితోషికాన్ని తగ్గించుకొని సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు.