క్లైమాక్స్ లేని మిస్టీరియ‌స్ థ్రిల్ల‌ర్.. జోడియ‌క్

సినిమాల‌తో హిట్ ఎలా కొట్టాల‌నే విజ‌య‌సూత్రం చాలా మందికి తెలిసి ఉంటుంది. ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగానో, జాన్రాలోనో.. హిట్టు కొట్ట‌డం చాలా మంది సులువైన ప‌నే. అయితే  తీసే ప్ర‌తి సినిమాతోనూ త‌మ ముద్ర‌ను…

సినిమాల‌తో హిట్ ఎలా కొట్టాల‌నే విజ‌య‌సూత్రం చాలా మందికి తెలిసి ఉంటుంది. ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగానో, జాన్రాలోనో.. హిట్టు కొట్ట‌డం చాలా మంది సులువైన ప‌నే. అయితే  తీసే ప్ర‌తి సినిమాతోనూ త‌మ ముద్ర‌ను ప్రతిసారీ ప్ర‌త్యేకంగా వేసుకోవాల‌ని త‌పించే ద‌ర్శ‌కులు కొంద‌రు ఉంటారు. ఇలాంటి వారిలో కూడా కొంద‌రు సీక్వెల్స్ అంటూ, ప్రీక్వెల్స్ అంటూ.. ఎంతో కొంత కంఫ‌ర్ట్ జోన్ ను వెదుక్కునే రోజులివి.

అయితే వారిలో కొంద‌రు టేక‌ప్ చేసే క‌థాంశం ద‌గ్గ‌ర నుంచి అడుగ‌డుగునా న‌వ్య‌త‌కు ప్రాధాన్య‌త‌ను ఇచ్చే అరుదైన నైపుణ్యాన్ని క‌లిగి ఉంటారు. అలాంటి ద‌ర్శ‌కుడే డేవిడ్ ఫిన్చ‌ర్. ఫిన్చ‌ర్ ఫిల్మోగ్ర‌ఫీని ప‌రిశీలిస్తే.. 28 యేళ్ల కింద‌ట తొలిసారి ద‌ర్శ‌కుడిగా మారాడు. ఇన్నేళ్ల‌లో తీసింది కేవ‌లం 10 ఫీచ‌ర్ ఫిల్మ్ లు, మ‌రో రెండు నెట్ ఫ్లిక్స్ కోసం. ప్ర‌తి సినిమాకూ వ్య‌త్యాసం క‌నీసం రెండు నుంచి మూడేళ్ల వ‌ర‌కూ ఉంటుంది. ఆ ప‌ది సినిమాల్లో ప్ర‌పంచం మెచ్చి, ఆరాధించే సినిమాల సంఖ్య ఐదారు వ‌ర‌కూ ఉంటుంది. అవి కేవ‌లం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, వాటి స్ఫూర్తితో అనేక సినిమాలను రూపొందించేంత శ‌క్తినిచ్చాయ‌వి!

ప్ర‌యోగాత్మ‌క క‌థా, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందించే ఫిన్చ‌ర్ ఒక‌సారి చేసిన త‌ర‌హా ప్ర‌యోగాన్ని మ‌రోసారి చేయ‌లేదు. దేనిక‌దే.. ప్ర‌త్యేకం. సెవెన్ అనే సినిమా ఒక సీరియ‌ల్ కిల్ల‌ర్ గురించి, ది గేమ్ సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్, ఫైట్ క్ల‌బ్ ఒక క‌ల్ట్ క్లాసిక్,  ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మ‌న్ బ‌టన్ ఒక వైవిధ్య‌మైన ప్ర‌యోగం… వీట‌న్నింటి మ‌ధ్య‌న ఫిన్చ‌న్ రూపొందించిన మ‌రో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ జోడియ‌క్.

ఫిన్చ‌ర్ రూపొందించిన అన్ని సినిమాల్లోనూ క్లైమాక్స్ ప్రేక్ష‌కుడిని అత్యంత ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. సెవ‌న్ లో సినిమాటిక్ క్లైమాక్సే కానీ, ది గేమ్ క్లైమాక్స్ అప్ప‌టి వ‌ర‌కూ సాగిన సినిమాకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మ‌న్  క్లైమాక్స్ ఎమోష‌న‌ల్, సినిమా స‌గంలోనే ప్రేక్ష‌కుడికి షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు గాన్ గ‌ర్ల్ లో… ఆ సినిమా క్లైమాక్స్ కూడా దాని మూడ్ కు త‌గిన‌ట్టుగా ఉంటుంది. ఇలా ప్ర‌తి సినిమాలోనూ ఒక్కో వైవిధ్య‌మైన క్లైమాక్స్ ను ఇచ్చిన ఫిన్చ‌ర్ జోడియ‌క్ లో మాత్రం ఎలాంటి క్లైమాక్స్ ను ఇవ్వ‌లేదు.

క్లైమాక్స్ లేకుండానే ముగిసే అతి త‌క్కువ సినిమాల్లో ఒక‌టి జోడియ‌క్. ఒక‌వేళ ఈ క‌థ‌కో క్లైమాక్స్ ఉండి ఉంటే, అనేక సీరియ‌ల్ కిల్ల‌ర్స్ సినిమాల్లో ఒక‌టిగా ఇదీ నిలిచేదేమో! సినిమా ఆసాంతం సాగే క్రైమ్ కు సంబంధించి నిందితుడు ఎవ‌ర‌నే అంశాన్ని ఆఖ‌ర్లో కూడా చూపించ‌క‌పోవ‌డం ఈ రియాలిస్టిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ప్ర‌త్యేక‌త‌. ప్ర‌పంచ సినిమాలో ఈ త‌ర‌హాలో గొప్ప హిట్టైన సినిమాలు రెండే ఉన్నాయి. వాటిలో ఒక‌టి సౌత్ కొరియ‌న్ మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్  మెమోరీస్ ఆఫ్ మ‌ర్డ‌ర్, రెండోది జోడియ‌క్. ఈ రెండూ దాదాపు ఒకే త‌ర‌హా సినిమాలు. వీటిలో ముందుగా వ‌చ్చింది మాత్రం మెమోరీస్ ఆఫ్ మ‌ర్డ‌ర్, ఆ త‌ర్వాతే జోడియ‌క్ వ‌చ్చింది. కానీ.. ఆ సౌత్ కొరియ‌న్ సినిమాతో ఎలాంటి పోలిక లేకుండా పూర్తి భిన్న‌మైన స్క్రిప్ట్ తో జోడియ‌క్ ప్రేక్ష‌కుడిని వెంటాడే సినిమాగా నిలిచిపోతుంది.

అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో లేట్ 1960, అర్లీ 70స్ లో జోడియ‌క్ కిల్ల‌ర్ పేరుతో ఒక‌డు కొంత‌మందిని చంప‌డం, మ‌రి కొంద‌రిని బెదిరించ‌డం వంటివి చేశాడు. అత‌డి బాధితులు అనేకం ఉన్నారు. అయితే ఆ జోడియ‌క్ కిల్ల‌ర్ ఎవ‌ర‌నేది ఎప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌లేదు. దీని గురించి పోలీసులు, మీడియా ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌లు చేసినా..అనుమానితులు కూడా కొంద‌రున్నా… అస‌లు కిల్ల‌ర్ ఎవ‌రో మాత్రం బ‌య‌ట ప‌డ‌లేదు. ఈ క‌థాంశంపై ముందుగా ఒక న‌వ‌ల వ‌చ్చింది. 

ఆ న‌వ‌ల‌నే మిస్టీరియ‌స్ థ్రిల్ల‌ర్ గా మ‌లిచాడు ఫిన్చ‌ర్. ఈ కేసు విష‌యంలో పోలీసుల‌, మీడియా ప‌రిశోధ‌న‌కు ధీటుగా.. దాదాపు ఏడాదిన్న‌ర పాటు సొంత ఇన్వెస్టిగేష‌న్ చేశాడ‌ట ఈ ద‌ర్శ‌కుడు. జోడియ‌క్ కిల్ల‌ర్ చేసిన హ‌త్య‌లు, అత‌డి బాధిత కుటుంబాల‌ను క‌ల‌వ‌డం, అత‌డిని చూశార‌నే వారిని క‌లిసి.. త‌న సినిమాకు అవ‌స‌ర‌మైన ఇన్వెస్టిగేష‌న్ అంతా చేశాడు ఆ ద‌ర్శ‌కుడు. ఏడాదిన్న‌ర పాటు సాగిన అత‌డి అప‌రాధ ప‌రిశోధ‌నతో ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన సినిమాను రూపొందించాడు.

1969 జూలై నాలుగో తేదీన రాత్రి జోడియ‌క్ కిల్ల‌ర్ హ‌త్యాకాండ మొద‌ల‌వుతుంది. ఆ రాత్రి పూట ఒక ప్రేమ జంట త‌మ కార్లో కూర్చుని ఉండ‌గా హ్యాండ్ గ‌న్ తో వారిపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జ‌రుపుతాడు ఆ హంత‌కుడు. కాల్పుల్లో యువ‌తి మ‌ర‌ణించ‌గా, యువ‌కుడు మాత్రం బ‌తుకుతాడు. ఆ హ‌త్య పై పోలీసుల ప‌రిశోధ‌న జ‌రిగినా ఉప‌యోగం ఉండ‌దు. వారిని ఎందుకు, ఎవ‌రు చంపార‌నే అంశాన్ని తేల్చ‌లేరు. దాదాపు నెల రోజుల త‌ర్వాత ఒక ప‌త్రికాఫీసుకు ఒక లెట‌ర్ వ‌స్తుంది. 

త‌న‌ను తాను జోడియ‌క్ గా ప‌రిచ‌యం చేసుకునే హంత‌కుడు త‌న ఐడెంటీని క‌నుక్కోమంటూ స‌వాల్ విసురుతాడు. త‌ను మ‌రి కొన్ని హ‌త్య‌లు చేస్తానంటూ కూడా ముంద‌స్తు హెచ్చ‌రిక జారీ చేస్తాడు. అయితే ఈ లెట‌ర్ ను సీరియ‌స్ గా తీసుకోవాలా వ‌ద్దా.. అనేది ప‌త్రిక వాళ్ల‌కు మొద‌ట్లో అంతుబ‌ట్ట‌దు. అయితే ఆ లెట‌ర్ ను సీరియ‌స్ గా తీసుకునే క్రైమ్ రిపోర్ట‌ర్.. జోడియ‌క్ మీద దృష్టి పెడ‌తాడు. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ నెల‌లో మ‌రోసారి జోడియ‌క్ రెచ్చిపోతాడు. ఇద్ద‌రు లా స్టూడెంట్స్ ను పొడిచి చంపే ప్ర‌య‌త్నం చేస్తాడు. వారిలో ఒక‌రు మ‌ర‌ణిస్తారు.

ఇలా జోడియ‌క్ త‌న హ‌త్యాకాండ‌ను కొన‌సాగిస్తున్న సంకేతాల‌ను ఇస్తాడు. ఆ త‌ర్వాత మ‌రో ట్యాక్సీ డ్రైవ‌ర్ ను కాల్చి చంపుతాడు. దీనిపై పోలీసు విచార‌ణ కొన‌సాగుతూ ఉంటుంది. మీడియా రిపోర్ట‌ర్లు కూడా ఈ అంశంపై త‌మ వైపు నుంచి ప‌రిశోధ‌న సాగిస్తూ ఉంటారు. అయితే జోడియ‌క్ ఆన‌వాళ్లు కానీ, అత‌డి జాడ కానీ దొర‌క‌దు. త‌న చేతిలో హ‌త‌మైన వారికి సంబంధించిన దుస్తుల‌ను, లేదా వ‌స్తువుల‌ను కూడా పార్సిల్ చేసి పంపుతాడు జోడియ‌క్. అటు తిరిగి, ఇటు తిరిగి ఒక అనుమానితుడొక‌డు తెర‌పైకి వ‌స్తాడు. అయితే అత‌డే హ‌త్య‌లు చేశాడ‌న‌డానికి ఆధారాలుండ‌వు. 

అలాగే హ్యాండ్ రైటింగ్ నిపుణులు కూడా అనుమానితుడే ఆ లేఖ‌లు రాశాడ‌ని చెప్ప‌లేమంటారు. అనేక మ‌లుపుల మ‌ధ్య‌న సినిమా సాగుతుంది. అలెన్ అనే నిందితుడే ఈ హ‌త్య‌లు చేసి ఉండ‌వ‌చ్చ‌ని రిపోర్ట‌ర్ అనుమానిస్తాడు. ఈ జోడియ‌క్ కిల్లింగ్స్ కు సంబంధించి త‌నే ఒక పుస్త‌కం రాస్తాడు. ఆ స‌మ‌యంలో కిల్ల‌ర్ నుంచి బెదిరింపుల‌ను ఎదుర్కొంటాడు. ఆ త‌ర్వాత ఏడెనిమిదేళ్లు గ‌డిచినా కేసు ఎటూ తేల‌దు. జోడియ‌క్ కిల్ల‌ర్ గా అనుమానించ‌బ‌డిన అలెన్ అనే నిందితుడు వేరే జాబ్ చేసుకుంటూ ఉంటాడు. కొన్నేళ్ల‌కు అత‌డు మ‌ర‌ణిస్తాడు. ఇంత‌కీ ఆ హ‌త్య‌లు చేసింది ఎవ‌ర‌నేది తేల‌కుండానే క్లేజ్ అలానే మిగిలిపోతుంది.

వాస్త‌వానికి కూడా ఈ సినిమా చాలా దగ్గ‌ర‌గా ఉంటుంది. జ‌రిగిన‌ది జ‌రిగిన‌ట్టుగా చూపించిన అరుదైన థ్రిల్ల‌ర్ గా నిలుస్తుంది. థ్రిల్ల‌ర్ల రూప‌క‌ల్ప‌న‌లో ఒక గైడ్ లాంటి సినిమా. 1960లు 70ల‌నాటి మూడ్ ను సెట్ చేసే చిత్రీక‌ర‌ణ కూడా చూడ‌చ‌క్క‌గా ఉంటుంది. గ్రేట్ యాక్టింగ్, వెల్ రిట‌న్ స్క్రిప్ట్ తో ఫ్లో అద్భుతంగా ఉంటుంది. ప్ర‌త్యేకించి ఆ పాత్ర‌ల‌కు వంద శాతం సూట‌య్యార‌నిపించే న‌టులు, మునివేళ్ల మీద నిల‌బెట్టే మ‌లుపులు, షార్ప్ డైలాగ్స్, స్కిల్ ఫుల్ డైరెక్ష‌న్ కు నిర్వ‌చ‌నంలా నిలుస్తుంది ఈ సినిమా.

హ‌త్య‌లు జ‌రిగాయి, జ‌రుగుతూనే ఉంటాయి.. కానీ హంత‌కుడు దొర‌క‌డు. ఈ పాయింట్ చాలా చ‌చ్చుగా అనిపించ‌వ‌చ్చు. హంత‌కుడు మీడియా ఆఫీసుల‌కు డైరెక్టుగా లెట‌ర్స్ రాయ‌డం, ఫోన్ కాల్స్ చేయ‌డం.. అయినా అత‌డు దొర‌క‌క‌పోవ‌డం లాజిక్ లెస్  అనిపించ‌వ‌చ్చు. అయితే ఒక సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌ను ఇంటెన్సివ్ చూపించిన విధానం ఈ సినిమాను థ్రిల్ల‌ర్ ప్రియులు త‌ప్ప‌న‌స‌రిగా చూడ‌ద‌గిన‌దిగా మార్చింది. 

థ్రిల్ల‌ర్ల‌కు ఏదో ఒక క్లైమాక్స్ ఇస్తేనే అదంతా రుచించ‌క‌పోవ‌చ్చు. అలాంటిది క్లైమాక్సే లేక‌పోయినా ఆస‌క్తిని కొన‌సాగించారంటే క‌థ చెప్పిన విధానం గురించి ఎంత క‌స‌ర‌త్తు జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. అన‌వ‌స‌ర‌మైన మ‌లుపులు, మెలోడ్రామా త‌ర‌హా క్లైమాక్స్, లాస్ట్ మినిట్ ప్లాట్ ట్విస్ట్ లు వంటి విసుగు కూడా ఉండ‌దు. అన్ని ర‌కాలుగానూ  ఒక డిసిప్లైన్డ్ ఫిల్మ్ 'జోడియ‌క్'.

-జీవ‌న్ రెడ్డి.బి