గోపీచంద్ మలినేని-నందమూరి బాలయ్య కాంబినేషన్ లో గత ఏడాది సంక్రాంతికి వచ్చింది వీరసింహారెడ్డి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు నమోదు చేసింది. ఈ సినిమా తరువాత మైత్రీ సంస్థలోనే జాట్ అనే బాలీవుడ్ సినిమా సన్నీడియోల్ తో చేస్తున్నారు మలినేని.
ఇదిలా వుంటే వీరసింహారెడ్డి తరువాత దర్ళకుడు బాబీతో ఢాకూ మహరాజ్ సినిమా చేసారు బాలయ్య. ఆ సినిమా తరువాత అఖండ 2 సినిమా చేస్తున్నారు. జాట్ తరువాత మలినేని, అఖండ 2 తరువాత బాలయ్య మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ఈ సమ్మర్ తరువాత నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం వుంది.
అయితే ఇంతకీ ఈ సినిమాకు నిర్మాత ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. రెండు నిర్మాణ సంస్థల పేర్లు ఫైనల్ లిస్ట్ లో వున్నాయి. ఒకటి చెరుకూరి సుధాకర్ సంస్థ. మోక్షుతో సినిమా ప్లానింగ్ లో వుంది. కానీ అది కాస్త ముందు వెనుకలు అవుతోంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక పక్కన పెడితే, బాలయ్య-మలినేని సినిమా చెరుకూరి సుధాకర్ నిర్మిస్తారు. అలా కాకుండా ఆయన మోక్షు సినిమానే నిర్మిస్తే, బాలయ్య సినిమాను సతీష్ కిలారు తన వృద్ధి సంస్థ బ్యానర్ పై నిర్మిస్తారు ఫ్రస్తుతం ఆయన బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా నిర్మిస్తున్నారు.
మొత్తానికి బ్యానర్లు, దర్శకులు విషయంలో నందమూరి బాలకృష్ణ చాలా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. సరైన కథ, సరైన దర్శకుడు ఎవరు అన్నది చూస్తున్నారు. అదే టైమ్ లో బ్యానర్ ఎవరు అన్నది ఆయనే డిసైడ్ చేస్తున్నారు.