అది మిస్సయింది.. ఇది డెబ్యూ అయింది

మైదాన్ అనే సినిమా నేను చేయాలి. నా హిందీ డెబ్యూ అదే అవ్వాలి. మహానటి సినిమా తర్వాత నాకు ఈ హిందీ సినిమా ఆఫర్ వచ్చింది.

చాలామంది హీరోహీరోయిన్ల విషయంలో ఇలానే జరుగుతుంది. ఓ సినిమాతో డెబ్యూ ఇద్దాం అనుకుంటారు, కానీ మరో సినిమాతో లాంఛ్ అవుతుంటారు. చాలామందికి ఇలా జరిగింది. ఇప్పుడు కీర్తి సురేష్ కు కూడా.

“మైదాన్ అనే సినిమా నేను చేయాలి. నా హిందీ డెబ్యూ అదే అవ్వాలి. మహానటి సినిమా తర్వాత నాకు ఈ హిందీ సినిమా ఆఫర్ వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను.”

ఇలా తను మిస్సయిన సినిమా పేరు వెల్లడించింది కీర్తిసురేష్. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా కోసం కీర్తి సురేష్ స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు.

అప్పట్నుంచి సరైన బాలీవుడ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కీర్తిసురేష్ కు, బేబీ జాన్ రూపంలో అవకాశం వచ్చింది. సౌత్ రీమేక్ కావడం, డైరక్టర్ అట్లీ కూడా కోరడంతో కీర్తిసురేష్ కాదనలేకపోయింది.

“ప్రస్తుతం వివిధ రకాల పరిశ్రమల మధ్య తిరుగుతున్నాను. మలయాళం సినిమా చేస్తున్నాను. ఓ తమిళ సినిమా, మరో తెలుగు సినిమా కూడా చేస్తున్నాను. త్వరలోనే మరో హిందీ సినిమా చేయబోతున్నాను. ఇలా వివిధ పరిశ్రమల్లో పనిచేయడం ఎగ్జయిటింగ్ గా ఉంది.”

పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి తొలిసారి పొంగల్ సెలబ్రేట్ చేసుకున్న ఈ హీరోయిన్, ఎప్పట్లానే సినిమాలు కొనసాగిస్తానని ప్రకటించింది. ఏదో ఒక ఇండస్ట్రీకి పరిమితం కావడం ఇష్టం లేదని, మంచి రోల్స్ ఎక్కడ దొరికితే అక్కడ సినిమాలు చేస్తానని అంటోంది.