తిరుమలలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ తిరుమలలో పీఏసీ-5 వసతి సముదాయంలో రెండో అంతస్తు మీది నుంచి పడి కడపకు చెందిన మూడేళ్ల బాలుడు సాత్విక్ శ్రీనివాసరాజు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రుల శోకం కట్టలు తెంచుకుంది.
కడప నగరంలోని చిన్నచౌక్‌కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుని ఈ నెల 13న తిరుపతికి వెళ్లి టోకెన్లు కట్టించుకున్నారు. 16వ తేదీకి వాళ్లకు దర్శన టోకెన్లు లభించాయి. దీంతో బుధవారం శ్రీనివాసులు కుటుంబం తిరుమలకు చేరింది. ఆర్టీసీ బస్టాండ్‌లోని పద్మనాభ నిలయంలో శ్రీనివాసులు కుటుంబం లాకర్ తీసుకుంది.
సాయంత్రం ఐదు గంటల సమయంలో అన్నతో కలిసి రెండో అంతస్తులో సాత్విక్ ఆడుకుంటూ కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన సాత్విక్‌ను వెంటనే అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపర్లను సైతం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.