రివ్యూ: 118
రేటింగ్: 3/5
బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలిని పాండే, నాజర్, ప్రభాస్ శ్రీను, హరితేజ, రాజీవ్ కనకాల, విజయ్‌చందర్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
కూర్పు: తమ్మిరాజు
నిర్మాత: మహేష్ కోనేరు
కథ, కథనం, ఛాయాగ్రహణం, దర్శకత్వం: కె.వి. గుహన్
విడుదల తేదీ: మార్చి 1, 2019
118 రెగ్యులర్ సినిమాల మధ్య డిఫరెంట్‌గా అనిపిస్తుంది కానీ థ్రిల్లర్ చిత్రాల నడుమ మరీ ప్రత్యేకంగా ఏమీ నిలబడదు. దర్శకుడు గుహన్ ఒక సగటు సస్పెన్స్ థ్రిల్లర్‌కి కావాల్సిన అంశాలని తీసుకుని, కాస్త కాల్పనికత జోడిస్తూ, కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్‌ని తెరకెక్కించాడు. డ్రీమ్స్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, స్కామ్ లాంటి ఎలిమెంట్స్‌ని తీసుకుని ఒక పకడ్బందీ స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. ఒకట్రెండు సార్లు అవసరం లేని యాక్షన్ సీన్స్‌తో హీరోని శాటిస్‌ఫై చేయాలని చూసినా కానీ సినిమా నిడివిలో చాలా భాగం కథని విడిచి సాము చేయలేదు.
కథాపరంగా చూస్తే… ఒక ఇన్వెస్టిగేవ్ జర్నలిస్టుకి ఒక కల వస్తుంది. దాని గురించి పెద్దగా పట్టించుకోడు. మళ్లీ ఆరు నెలల తర్వాత అదే కల వస్తుంది. ఆ కల రెండుసార్లు రావడానికి గల కోఇన్సిడెన్స్ గమనిస్తాడు. అందులో ఏదో వుందనుకునేలోగానే తేలిగ్గా తీసుకుంటాడు. కానీ ఆ కలలో కనిపించిన చోటు, కారు అతనికి తారసపడతాయి. ఇక మిస్టరీ చేధించడానికి ఒక్కో డాట్ కలుపుకుంటూ వెళతాడు. ఫైనల్‌గా అతని పయనం ఎటు దారి తీస్తుంది? ఆ కల వెనుక అసలు రహస్యమేంటి?
ఏ మిస్టరీ అయినా చేధించే వరకు ఆసక్తికరంగానే వుంటుంది. అయితే ఆ మిస్టరీ ఏమిటనేది తెలుసుకోవాలనే ఆరాటం చూసే వాళ్లలో కలిగించడంలోనే ఇలాంటి కథల విజయం దాగి వుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కథలు చెప్పడానికి ముందు 'కమర్షియల్ అప్పీల్' పేరుతో కాలక్షేపం చేసేస్తుంటారు. కామెడీ అని, రొమాన్స్ అని అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం వృధా చేస్తారు. ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా గుహన్ పాయింట్‌కి వెళ్లాడు కానీ కమర్షియల్ అప్పీల్ కోసం కొంత రాజీ పడకుండా లేడు. ఉదాహరణకి ఒక యాక్షన్ సన్నివేశంతో హీరోని పరిచయం చేసాడు. తర్వాత ఆ పాయింట్‌ని ప్లాట్‌కి రిలేట్ చేసుకుని వాడుకున్నా కానీ తర్వాత దాని ఊసే వుండదు.
అలాగే ఈ కథకి ప్రత్యేకించి ఒక కథానాయిక అవసరం లేదు. షాలిని పాండేని కేవలం 'అలంకారం'గా మాత్రమే వాడుకున్నారు. చాలా సందర్భాల్లో ఆమె హీరో వెనుక నిలబడి, అక్కడుంది కనుక ఏవో కొన్ని మాటలు చెబుతుంటుంది. కాకపొతే ఈ క్యారెక్టర్ వుంది కదా అని పాటల కోసం బ్రేక్‌లు తీసుకోకుండా మంచి పని చేసారు. నెరేటివ్‌లో ఎక్కడ బ్రేక్ వచ్చినా ఆడియన్స్ డిస్‌కనక్ట్ అయ్యే ప్రమాదాన్ని పసిగట్టి అలాంటి తప్పులు చేయలేదు. అలాగే అసలు పాయింట్ ఎలాగో రెగ్యులర్‌గానే వుంది కనుక అక్కడి వరకు వెళ్లడానికి గాను వివిధ క్యారెక్టర్లని కలుపుతూ, చిన్న చిన్న మలుపులతో సస్పెన్స్ హోల్డ్ చేసారు. ప్రథమార్ధంలో ఎక్కడా బిగి సడలకుండా, వేగంగా కథని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది.
అయితే ద్వితియార్ధంలో మాత్రం విలన్స్ ధోరణి మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంటుంది. హీరో క్లూస్ కోసం ఎవరి దగ్గరకి వెళతాడో వారిని ఒక్కొక్కరిగా చంపేస్తూ పోయే వారు సరాసరి హీరోని టార్గెట్ చేయకపోవడం హాస్యాస్పదంగా, మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. విలన్స్ ఏ దశలోను ప్రమాదకరంగా అనిపించకపోవడం, హీరోని ఎంతమంది వచ్చినా చెండాడే ధీరుడన్నట్టు చూపించడం తగదు. ఈ కథలోని జర్నలిస్ట్ పాత్రకి పోరాటయోధుడు కావాల్సిన అవసరం లేదు. సామాన్యుడిగా, వల్నరబుల్‌గా చూపించినట్టయితే ఇంకా ఉత్కంఠకి తావుండేది. విలన్స్ చేసేది కోట్ల రూపాయల స్కామ్ అయినా, వారి ఉనికికి ప్రమాదం వచ్చినపుడు సరిగ్గా రియాక్ట్ అవరు. ఇక్కడ విలన్స్‌ని స్ట్రాంగ్‌గా, హీరోని ఫిజికల్‌గా వీక్‌గా చూపించడం వల్ల ఈ ఘట్టాలని రసవత్తరంగా నడిపించే అవకాశముండేది. కాకపోతే ఇక్కడ దర్శకుడు కమర్షియల్ కారణాల కోసం రాజీ పడినట్టు అనిపిస్తుంది.
ఇక అన్నిటికంటే కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఇలాంటి సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే ఫార్మాసూటికల్ స్కామ్‌తో ముడి పడి వుంటుంది. ఈ సన్నివేశాలని ఎక్కువ సాగదీయకుండా సింపుల్‌గా చూపించడం, నివేదా థామస్ ఈ సన్నివేశాలని రక్తి కట్టించడంతో ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. పతాక సన్నివేశాలు సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడుకున్నాయి. అవి కూడా ఫర్వాలేదనిపిస్తాయి. సస్పెన్స్‌ని హోల్డ్ చేయడం, స్క్రీన్‌ప్లే ఇంట్రెస్టింగ్‌గా వుండడం ఈ తరహా చిత్రాలకి కీలకం. ఆ రెండు విషయాల్లోను దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అసలు మిస్టరీకి సంబంధించిన అంశాన్ని కూడా కొత్తగా ఆలోచించినట్టయితే ఈ చిత్రం తాలూకు విజువల్ ఎక్స్‌పీరియన్స్ మరింత బెటర్ అనిపించేది.
కళ్యాణ్‌రామ్ ఇమేజ్ మేకోవర్ కోసం చేస్తోన్న ప్రయత్నాలు బాగున్నాయి. పాత్రానుగుణంగా యాక్షన్ లాంటి వాటికి దూరంగా వుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నివేదా థామస్‌కి తక్కువ నిడివి వున్నా కానీ తనే హైలైట్‌గా నిలిచింది. చక్కని అభినయంతో 'ఆద్య' పాత్రతో కనక్ట్ అయ్యేట్టు, ఆ పాత్ర పట్ల సానుభూతి తెలిపేట్టు చేయగలిగింది. ముందే చెప్పినట్టు షాలిని పాండే అలంకారానికి మాత్రమే పనికొచ్చింది. విలన్స్ పాత్రలని సరిగ్గా తీర్చిదిద్దడంతో పాటు బెటర్ యాక్టర్స్‌ని తీసుకుని వుండాల్సింది. వారు ఏ దశలోను త్రెట్‌లా అనిపించకపోవడం కాస్త మైనస్ అయింది.
నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి. ముఖ్యంగా కార్ ఛేజ్ సన్నివేశాలని గుహన్ కెమెరా తెరకెక్కించిన విధానం మెప్పిస్తుంది. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. నిర్మాత మహేష్ కోనేరు వైవిధ్యభరిత కథాంశాన్ని ఎంచుకుని సినిమాకి కావాల్సిన వనరులు సమకూర్చాడు. దర్శకుడు గుహన్ ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో, ఓవరాల్‌గా డీసెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. అద్భుతం అనిపించకపోయినా, చూస్తున్నంతసేపు లీనం చేయడంలో, రెండు గంటలు కాలక్షేపం ఇవ్వడంలో 118 స్కోర్ చేస్తుంది.
బాటమ్ లైన్: డీసెంట్ థ్రిల్లర్!
– గణేష్ రావూరి