కాస్త క్రేజ్ ఉన్న ప్రాజెక్టుకు విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్ లాంటి వ్యవహారాలన్నీ లాక్ అయిపోతున్నాయి. ప్రస్తుతం శాటిలైట్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంచి బజ్ ఉన్న సినిమాను దక్కించుకునేందుకు టీవీ ఛానెళ్లన్నీ ఎగబడుతున్నాయి. ఇందులో భాగంగా ఇస్మార్ట్ శంకర్ మేకర్స్ ను కూడా టీవీ ఛానెళ్లు సంప్రదించాయి. వాటన్నింటికీ మూకుమ్మడిగా షాక్ ఇచ్చాడు శంకర్.
అవును.. ఇస్మార్ట్ శంకర్ శాటిలైట్ రేటు చూసి టీవీ ఛానెళ్లు బెంబేలెత్తిపోతున్నాయి. 10 కోట్ల రూపాయలిస్తేనే శాటిలైట్ రైట్స్ ఇస్తామంటూ బేరం పెట్టారట మేకర్స్. నిజానికి అటు పూరి జగన్నాధ్ కు, ఇటు రామ్ కు అంత మార్కెట్ లేదు. ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ కు ఇంత రేటు చెప్పి బెదరగొట్టడం ఏంటని కామెంట్స్ చేస్తున్నాయి ఛానెళ్లు.
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. మేకర్స్ చెబుతున్న 10 కోట్ల ఆఫర్ కేవలం శాటిలైట్ కు మాత్రమేనట. డిజిటల్ కోసం వాళ్లు మరో రేటు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. సినిమాతో సంబంధం లేకపోయినా, ఈ మొత్తం వ్యవహారం వెనక స్రవంతి రవికిషోర్ ఉన్నట్టు తెలుస్తోంది. చార్మితో కలిసి ఆయన ఈ డీలింగ్స్ అన్నీ చూస్తున్నారు.
టెంపర్ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ ఇవ్వలేదు పూరి జగన్నాధ్. అటు రామ్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. రీసెంట్ గా హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాలు చేశాడు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్న సినిమాకు ఇప్పుడే ఇంత రేటు చెబుతున్నారంటే, రేపు థియేట్రికల్ రైట్స్ కింద ఇంకెంత చెబుతారో చూడాలి.