మూవీ రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు

టైటిల్: ఆడవాళ్లు మీకు జోహార్లు రేటింగ్: 2.5/5 తారాగణం: శర్వానంద్, రష్మిక, ఖుష్బూ, రాధిక, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్యక్రిష్ణన్ తదితరులు కెమెరా: సుజీత్ సారంగ్ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ సంగీతం: దేవీ శ్రీ…

టైటిల్: ఆడవాళ్లు మీకు జోహార్లు
రేటింగ్: 2.5/5
తారాగణం: శర్వానంద్, రష్మిక, ఖుష్బూ, రాధిక, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్యక్రిష్ణన్ తదితరులు
కెమెరా: సుజీత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
విడుదల తేదీ: 4 మార్చ్ 2022

“ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే 1980ల్లో లాంటి టైటిలుతో ముందుకొచ్చిన సరికొత్త చిత్రం ఇది. ట్యాలెంటెడ్ నటుడు, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే కథానాయకుడు, మహిళాప్రేక్షకులకి నచ్చే హీరో శర్వానంద్ ఇందులో మెయిన్ క్యారెక్టర్.

ఎంత ట్యాలెంటున్నా వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ కి బ్రేకులేని హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక హీరోయిన్ గా జతకట్టింది.

పైగా 1980ల్లో హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన నటీమణులు ఇందులో ఉండడం ఒక ప్రత్యేకత. విడుదలైన పాటలకి, ట్రైలర్ కి మంచి స్పందన లబించింది. సినిమా మీద అంచనాల్ని పెంచింది.

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి లాంటి చిత్రాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకుడు. ఇంతకీ శర్వానంద్ కి ఈ చిత్రంతో లేడీ లక్ కలిసొచ్చిందా అనేది చూద్దాం.

కథపరంగా చూస్తే ఇందులో చెప్పుకోవడానికేం లేదు. ఐదుగురు తల్లుల చాటు కొడుకు ఒక తల్లిచాటు కూతుర్ని ఇష్టపడి పెళ్లిచేసుకోవడమంతే. ఇక్కడ నిజంగా ఐదుగురు తల్లుల ప్రాధాన్యత ఉందా అంటే కేవలం యాంబియన్స్ కోసం పెట్టినట్టుంది. 

స్త్రీపాత్రలే ప్రధానంగా కనపడుతూ అసలు పురుష పాత్రలకి ప్రాధాన్యం లేకుండా జాగ్రత్తపడి కావాలని లేడీ డామినేషన్ కథ రాసుకుని తీసిన సినిమాలా ఉంది. మేల్ సెంట్రిక్ సినిమాలు చూసి చూసి ఈ సినిమా చూస్తుంటే పెద్ద స్క్రీన్ మీద టీవీ సీరియల్ ని చూసిన ఫీలింగొస్తుంది. ఇక్కడ టీవీ సీరియల్ తో పోల్చడమంటే తక్కువజేయడానికి కాదు. కేవలం యాంబియన్స్ కి చెందిన పోలికంతే. 

ఫస్టాఫ్ ల్యాగులతో విసిగిస్తుంది. ఎంత లాగినా కథ నడవదు. పావు గంటలో చెప్పాల్సింది గంట లాగినట్టుంది. ఇంటర్వల్ ముందు ఊర్వశి చెప్పే ఒక డయలాగ్, సెకండాఫులో వెన్నెల కిషోర్ ది ఒకటి, కమెడియన్ సత్య చెప్పిన డయలాగ్ ఒకటి తప్ప మిగిలిన సంభాషణలన్నీ సాధారణంగా ఉన్నాయి. 

టెక్నికల్ గా చూస్తే దేవీశ్రీ అందించిన పాటలు, వాటిలోని సాహిత్యం కూర్చోపెట్టేసాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఏమీ లేదు కానీ ఎప్పటిలాగే ఇలాంటి సినిమాలకి ఉండే విధంగా ఉంది. కెమెరా మరియు ఇతర నిర్మాణవిలువలన్నీ భారీగానే ఉన్నాయి. 

దర్శకుడు కిషోర్ తిరుమల ప్రెజెంటేషన్ మీద ఫోకస్ బాగానే పెట్టినా కథ మీద మాత్రం కసరత్తు చేసినట్టు కనపడదు. చాలా సన్నివేశాలు కృతకంగానూ, సీరియస్ అవ్వకుండా లైట్ చేయడానికి చేసే బలవంతపు ప్రయత్నాలుగానూ ఉన్నాయి. 

రకరకాల మనస్తత్వాలు గల ఆడవాళ్లు, వాళ్ల భిన్న వ్యక్తిత్వాలు, వాళ్లల్లోని మంచీ చెడూ అన్నీ చర్చిస్తూనే కామెడీ పండించగలిగే స్కోప్ ఉన్న టైటిల్ ఇది. కానీ అలాకాకుండా అంతా ఏకపక్షంగా ఒకటే కోణంలోంచి తీసినట్టుంది. ఉదాహరణకి ఖుష్బూ, ఝాన్సీ పాత్రల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ఇక హీరోగారి ఐదుగురు తల్లులూ ఒకటే మాదిరిగా ఉంటారు. ఎవరికీ వ్యక్తిత్వాలుండవు. 

శర్వానంద్ ఎప్పటిలాగానే మంచి ఈజ్ తో చేసాడు కానీ హీరోగా తనలోని ప్రత్యేక లక్షణాలేవీ కథపరంగా గుర్తుండేలా లేవు.

రష్మికది కూడా సాదాసీదా పాత్రే. చెప్పుకోదగ్గ మెరుపులేమీ లేవు.

మిగిలిన పాత్రధారులంతా ఓకే. సత్య, ప్రదీప్ రావత్ ల మీద మంచి కామెడీ సీన్స్ పండించే అవకాశమున్నా ఏవో కొన్ని పంచులవరకు సరిపెట్టారు తప్ప పూర్తిగా వాడుకోలేదు. 

సెకండాఫులో హడావిడిగా పరిచయం చేసిన రవిశంకర్ క్యారెక్టర్ వెంటనే తేలిపోయింది. రవిశంకర్ ముందు శర్వా, వెన్నెల కిషోర్ చేసే సో కాల్డ్ కామెడీకి జోహార్లు చెప్పాలి. సాగతీతతో విసిగించిన సన్నివేశమది. 

మహిళాదినోత్సవానికి నాలుగురోజులు ముందొచ్చిన ఈ “ఆడవాళ్లు మీకు జోహార్లు” కొంతవరకు మహిళా ప్రేక్షకులకి నచ్చేలా ఉంది తప్ప మిగిలిన వర్గాల వాళ్లకి అంతగా ఎక్కేలా లేదు. అసలీ సినిమా ఏ సంక్రాంతికో వచ్చుంటే మెరుగైన ప్రేక్షకాదరణ పొందుండేది. ప్రస్తుతానికిది రాంగ్ టైం రిలీజే. ఓటీటీ ద్వారా ఈ సినిమానే మహిళాప్రేక్షకుల దగ్గరకి వెళ్లాలి తప్ప మహిళలు ఈ టైములో థియేటర్స్ కి వచ్చి ఆదరించడం అనుమానమే. 

బాటం లైన్: ఆడవాళ్లకు మాత్రమే