అమరావతే రాజధాని అని ఏపీ హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పరమానందభరితులవుతున్నారు. హైకోర్టుకు సాష్టాంగ ప్రమాణాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని టీడీపీ ఆనందపడిపోతోంది.
కానీ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటిమాదిరిగానే ప్రజలను అయోమయంలో పడేస్తున్నాడు. బొత్స మాట్లాడేది తొందరగా అర్ధం చేసుకోవడం కష్టం. మూడు రాజధానుల బిల్లును రద్దు చేసాం కదా. కాబట్టి హైకోర్టు తీర్పుకు విలువలేదన్నట్లు మాట్లాడాడు. కానీ మూడు రాజధానుల విధానం వదులుకోలేదని కూడా చెప్పాడు.
త్వరలోనే కొత్త బిల్లు తెస్తామన్నాడు. ఇవి బొత్స సొంతంగా చెప్పిన మాటలు కాకపోవచ్చు. ఇలా చెప్పడానికి జగన్ పర్మిట్ చేసిఉంటాడు. జగన్ తత్త్వం ఏమిటంటే …ఆయన ఓటమిని ఒక పట్టాన ఒప్పుకోడు. ఏ విషయంలోనైనా తన మాటే నెగ్గాలనుకుంటాడు. కోర్టు వ్యవహారాల్లో కూడా అంతే. ఇందుకు చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది కూడా.
మూడు రాజధానుల విషయంలో జగన్ చాలా పట్టుదలగా ఉన్నట్లు అనేక సందర్భాల్లో స్పష్టమైంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే మంత్రులు కూడా దూకుడుగా మాట్లాడుతున్నారు. అది సహజమేననుకోండి. హైకోర్టు తన తీర్పులో రెండు ముఖ్యమైన షరతులు పెట్టింది. రాజధాని ప్రాంతంలో పాట్లు మూడు నెల్లల్లో అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలి. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి కావాలి. ప్రాక్టికల్ గా ఈ రెండు పనులు సాధ్యం కాదు. ఇవాళ జగన్ పత్రిక సాక్షి కూడా ఇదే రాసింది. అమరావతి మీద తీర్పు ఇచ్చింది హైకోర్టు మాత్రమే.
అంటే ఈ తీర్పే ఫైనల్ కాదు. దీని పైన సుప్రీం కోర్టు ఉంది. అక్కడ తప్పని సరిగా అప్పీల్ చేస్తుంది జగన్ సర్కారు. అక్కడ తీర్పు సర్కారుకు అనుకూలంగా రావొచ్చు, ప్రతికూలంగా రావొచ్చు. లేదా హైకోర్టు తీర్పునే సవరించి మరోలా ఇవ్వొచ్చు. అది సర్కారుకు కొంత వెసులుబాటు కల్పించవచ్చు.
కాబట్టి జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా ఉండదు. ఈ ప్రయత్నం చేయకపోతే చంద్రబాబుకు జగన్ లొంగినట్లు అవుతుంది. కాబట్టి రాజధాని నిర్మాణం ఇప్పట్లో ముందుకు కదలక పోవొచ్చు. కేసు సుప్రీం కోర్టుకు వెళితే మాత్రం అది తెమిలేసరికి ఎన్నేళ్లు అవుతుందో చెప్పలేం. ఈ లోగా ఎన్నికలు వచ్చినా రావొచ్చు. కాబట్టి తొందరపడి సంబరాలు చేసుకోవలసిన అవసరం లేదు.