అమరావతి విజయోత్సవ సభ పెట్టడానికి అంతా రెడీగా ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ దీనిపై ఏకమవుతున్నాయి. అయితే దీనికి ఇప్పుడో క్యాప్షన్ కావాలి. అర్జంట్ గా త్రివిక్రమ్ డైలాగుని కాపీ కొట్టేస్తున్నారట. భీమ్లా నాయక్ సినిమా కోసం “అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధం” అనే హుక్ లైన్ పెట్టారు కదా.. దాన్నే అమరావతి విజయోత్సవానికి కూడా తీసుకుంటున్నారట. అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరిగిన యుద్ధం అంటూ దాన్ని హైలెట్ చేయబోతున్నారట.
ఎవరిది అహంకారం.. ఎవరిది ఆత్మాభిమానం..
పోనీ ప్రభుత్వానిది అహంకారమే అనుకుందాం.. మరి ఆత్మాభిమానం అంటే కేవలం అమరావతి రైతులదేనా.. కర్నూలు వాళ్లకి లేదా, విశాఖ వారిది కాదా..? రాజధాని ప్రాంత ప్రయోజనాలు తమకి కూడా అందుతాయనే ఆశతో ఉన్నవారికి ఈ తీర్పు అశనిపాతమే కదా.? అలాంటప్పుడు వారి ఆత్మాభిమానం కూడా దెబ్బతిన్నట్టే కదా..?
ఇక అహంకారం అంటే దానికి పర్యాయపదం చంద్రబాబు. చంద్రబాబు కట్టాలనుకున్న రాజధాని సమాజం కోసం కాదని, సామాజిక వర్గం కోసమేననేది వైసీపీ వాదన. అడుగడుగునా దాన్ని రుజువు చేస్తూ తమ వర్గం వారితో కేసులు వేయిస్తూ, కనీసం ఎస్సీ, ఎస్టీలకు కూడా రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుది. ఆ అహంకారంతోనే స్పాన్సర్ షిప్ ప్రోగ్రామ్ లు మొదలు పెట్టి చివరకు మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మోకాలడ్డారు.
కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినంత మాత్రాన అమరావతి రైతులు గెలిచినట్టు కాదు, జగన్ ఓడినట్టు కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టినప్పుడే జగన్ గెలిచారు. దాన్ని మండలిలో అడ్డుకుని తప్పు చేసిన టీడీపీ అప్పుడే ఓడిపోయింది. అభివృద్ధికి తాను వ్యతిరేకం అని ఒప్పుకుంది. రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చేసిన విస్పష్ట ప్రకటన చాలు ఎవరిది అహంకారమో, ఎవరిది ఆత్మాభిమానమో చెప్పడానికి.
తోలు తీస్తా.. తొక్క తీస్తా అంటూ సినిమా డైలాగులు చెప్పుకోడానికి ఇవి బాగానే ఉంటాయి. కానీ ప్రజా క్షేత్రంలో అమరావతి సహా రాష్ట్ర ప్రజానీకం అంతా ఎప్పుడో చంద్రబాబు తోలు తీశారు, డొక్క చించారు. వాతలు పెట్టారు. తమ ఆత్మాభిమానాన్ని చాటి చెప్పుకున్నారు.