Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఆటగాళ్ళు

సినిమా రివ్యూ: ఆటగాళ్ళు

రివ్యూ: ఆటగాళ్ళు
రేటింగ్‌: 1/5
బ్యానర్‌:
ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌
తారాగణం: నారా రోహిత్‌, జగపతిబాబు, దర్శనా బానిక్‌, సుబ్బరాజు, బ్రహ్మానందం, తులసి తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌
నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర
కథ, కథనం, దర్శకత్వం: పరుచూరి మురళి
విడుదల తేదీ: ఆగస్ట్‌ 24, 2018

నాలుగు లైన్లలో ఒక కథ అనేసుకుని, మంచి పాయింటే కదా అంటూ తెరకెక్కిపోతోన్న అనేకానేక చిత్రాల్లో ఇదీ ఒకటి. విచిత్రమేమిటంటే ఆ నాలుగు లైన్లకే పేరున్న నటులు కూడా సై అంటూ సైన్‌ చేసేస్తున్నారు. 'నీ స్నేహం', 'ఆంధ్రుడు', 'పెదబాబు' లాంటి డీసెంట్‌ సినిమాలు తీసిన దర్శకుడు కనుక ఈ కథని డీల్‌ చేసేస్తాడులే అని నమ్మేసారనుకోవాలి. 

ఇంతకీ ఆ కథేమిటంటే... ఒక పాపులర్‌ సినీ దర్శకుడు సిద్ధార్థ్‌ (రోహిత్‌) తన భార్యని చంపేసాడనే అభియోగంపై అరెస్ట్‌ అవుతాడు. న్యాయం కోసం సీఎంని అయినా ఎదిరించే తత్వమున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వీరేంద్ర (జగపతిబాబు) అతడికి వ్యతిరేకంగా వాదిస్తాడు. సిద్ధార్థ్‌ కథ తెలుసుకుని, అతడు నిర్దోషి అని వాదించి విడిపిస్తాడు వీరేంద్ర. కానీ ఆ హత్య సిద్ధార్థ్‌ చేసాడని తెలియడంతో ఎలాగైనా అతడిని దోషిగా నిరూపించాలని అతడితో ఆట మొదలు పెడతాడు. 

నెగెటివ్‌ షేడ్స్‌ వున్న హీరో క్యారెక్టర్‌ కనుక రోహిత్‌, హీరోతో సమానమైన ఎలివేషన్‌ వున్న క్యారెక్టర్‌ అని జగపతిబాబు ఎక్సయిట్‌ అయి వుంటారు. అయితే ఈ కథని ఎన్ని విధాలుగా కంగాళీ చేయవచ్చో అన్ని రకాలుగా చెడగొట్టి వదిలారు. మొదటి సీన్లోనే కోమాలో వున్న పాపకి చనిపోయిన తన తల్లిదండ్రుల చివరి చూపు దక్కాలని ఒక టాబ్లెట్‌ వేసి లేపుతారు. అది చూసి తట్టుకోలేదంటూ మరో టాబ్లెట్‌ వేసి ఆమెని మళ్లీ కోమాలోకి పంపుతారు. 'మెడికల్‌ మిరాకిల్‌'లాంటి ఈ సీన్‌తో స్టార్ట్‌ అయిన సినిమా ఇక ఎంత మెర్సీలెస్‌గా ఆడియన్స్‌తో ఆటాడుకుంటుందనేది మీరే ఇమాజిన్‌ చేసుకోవచ్చు. 

కెమెరాలు జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్‌ అవుతూ, ఇటు నుంచి అటు పాన్‌ అవుతూ అలా చిందర వందర చేస్తోంటే, వాటన్నిటికీ వెనుక సౌండ్‌ ఎఫెక్టులు వేస్తూ ఎంత రసాభాస చేస్తారనేది వివరించడం కష్టం... అనుభవించి తెలుసుకోవాల్సిందే. ఈ గందరగోళం అంతా ముగిసి లవ్‌స్టోరీ స్టార్ట్‌ అయ్యేసరికి కాస్తంత తెరిపి దొరుకుతుందని ఆశిస్తే... బ్రహ్మానందంని తీసుకొచ్చి 'నవ్వుతారా లేదంటే ఇలాంటి కామెడీ ఇంకా చేయించమంటారా?' అని బెదిరిస్తున్నట్టుగా హాస్య హింసకి గురి చేస్తారు. ఈ మధ్యలో హీరో హీరోయిన్లు ఎప్పుడు లవ్‌లో పడిపోయారో, ఎందుకు పడిపోయారో కూడా అర్థం కాదు. అయినా కానీ ఆడియన్స్‌ ఎవరూ కంప్లయింట్‌ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే మళ్లీ ఆ డీటెయిల్స్‌ కావాలంటే ఇంకెంత 'కామెడీ' చూడాల్సి వస్తుందోనని. 

సైడ్‌ యాక్టర్లంతా రూపాయికి అయిదు రూపాయల పర్‌ఫార్మెన్స్‌ ఇస్తూ ఏదో ఆ కోర్టు గోల ముగిసిందని అనుకుంటే, అప్పట్నుంచీ కథ ఇంకో టర్న్‌ తీసుకుంటుంది. నేరం చేసి తప్పించుకున్న డైరెక్టర్‌ని ఎలాగైనా దోషిగా నిలబెట్టాలని లాయర్‌ కంకణం కట్టుకుంటాడు. ఇక అక్కడ్నుంచీ జరిగే సన్నివేశాలన్నీ 'ఏంటిది ఇప్పుడు నిజంగా జరిగిందా' అంటూ మనల్ని మనం గిల్లి చూసుకునేట్టు వుంటాయి. జగపతిబాబు, రోహిత్‌ కాబట్టి వాళ్లు ఏమి చేసినా చూసేస్తారనే ధోరణిలో అర్థం లేని సన్నివేశాలు తీసుకుంటూ పోయి... వాళ్లు ఆడేది గేమ్‌ అని, వాళ్లిద్దరూ 'ఆటగాళ్ళు' అని భావించమని చెప్పకనే చెబుతారు. 

ఇమేజ్‌ కాపాడుకోవడం కోసం ఏ ఎండ్‌కి అయినా వెళ్లిపోయే పాత్రని తీర్చిదిద్దేప్పుడు ఆ లక్షణాలు మొదట్నుంచీ అతనిలో చూపిస్తుండాలని, ఆ యాంగిల్‌ని ఎస్టాబ్లిష్‌ చేస్తూ రావాలని కూడా పట్టించుకోకుండా, సింపుల్‌గా అదే కారణం అనేస్తే సరిపోతుందని దర్శకుడు భావించడం విడ్డూరం. సాధారణంగా వేరే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం, వాటిని తీర్చిదిద్దడంలో దర్శకులకి అవగాహనా లోపం ఏర్పడవచ్చు. కానీ ఇక్కడ పరుచూరి మురళి డీల్‌ చేసేది ఒక సినీ దర్శకుడి క్యారెక్టర్‌ని. తానే దర్శకుడు కనుక ఆ పని అతడికి ఈజీ అవ్వాలి. కానీ ఫిలిం డైరెక్టర్‌ సైక్‌పై, అతని ఐడియాలజీ, పర్సనాలటీపై మినిమమ్‌ అవగాహన లేని అవుట్‌ సైడర్‌లా ఆ పాత్రని తీర్చిదిద్దడం ఐరనీ. 

రోహిత్‌ తన పాత్రలని సిన్సియారిటీతో పోషిస్తుంటాడు. కానీ ఈ చిత్రంలో అతనిలో ఒక నిర్లిప్త ధోరణి గోచరిస్తుంది. ఎక్కడా సీన్‌ రక్తి కట్టించాలనే ఆసక్తి కానీ, తనవైపు నుంచి ఎఫర్ట్‌ కానీ లేకుండా పోయింది. కాస్త కాంప్లెక్స్‌ క్యారెక్టర్‌ కనుక ఈ పాత్రకి తనవంతుగా హోమ్‌వర్క్‌ చేసినట్టయితే బెటర్‌ అవుట్‌పుట్‌ వచ్చి వుండేది. జగపతిబాబు శైలికి సూట్‌ అయ్యే క్యారెక్టర్‌ కావడం వల్ల ఆయన పర్‌ఫార్మెన్స్‌ బాగానే అనిపిస్తుంది. అయితే ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం మాత్రం ఎంతమాత్రం అలరించలేకపోతుంది. 

ఒకేసారి ముప్పయ్యేళ్లు వెనక్కి తీసుకుపోయే నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ఒక ఎత్తు అయితే, ఉన్న డబ్బులన్నీ జగపతిబాబు, రోహిత్‌కి ఇవ్వడంతోనే అయిపోయాయన్నట్టుగా టెలీఫిలిం తరహా మేకింగ్‌ వేల్యూస్‌తో వెలవెలబోతూ కనిపించే ఫ్రేములు మరో ఎత్తు. వనరులు ఎంతగా లేకపోయినా కానీ ఎక్కడో సన్నివేశాల అంతరాంతరాల్లోంచి లీలగా కనిపించే కథని చూస్తే కాసింత కసరత్తు చేస్తే ఖచ్చితంగా ఒక డీసెంట్‌ థ్రిల్లర్‌ అయ్యే లక్షణాలున్నాయే అనిపించక మానదు. 

పోస్టర్లపై కనిపిస్తోన్న ఇద్దరు నటుల ముఖచిత్రాలు చూసి ఈ ఆటగాళ్ళ ఆట తిలకించవచ్చుననే ధీమాతో థియేటర్లలో అడుగుపెడితే ఆ ఆటగాళ్ళకి ఆటవస్తువుగా మారిపోక తప్పదు. చిన్న ఐడియాతో రెండున్నర గంటల వినోదం పండించి కోట్లు రాబట్టవచ్చునని ఒకవైపు కొన్ని చిత్రాలు నిరూపిస్తోంటే, చెప్పుకోతగ్గ కథ చేతిలో వున్నా, నాణ్యమైన నటులు సమకూరినా... పద్ధతైన సినిమాగా మలచలేక కోటి అవస్థలు పడుతోన్న చిత్రాలు ఇంకోవైపు.

బాటమ్‌ లైన్‌: ఆడియన్స్‌తో ఆడుకున్నారు!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?