ఈమధ్య కాలంలో ఏ యువ హీరో అందుకోనంత రేంజ్‌ని అతి తక్కువ కాలంలోనే అందుకున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్‌రెడ్డి' సక్సెస్‌ని ఫ్లూక్‌గానే పరిగణించింది చిత్ర సీమ. ఈ విషయాన్ని చిరంజీవి, దిల్ రాజు కూడా పేర్కొన్నారు. కానీ 'గీత గోవిందం'తో తనని 'వన్ ఫిలిం వండర్' అనుకున్నవారికి విజయ్ బదులిచ్చేసాడు.
విజయవంతం కావడమంటే ఏదో అల్లాటప్పా విజయం కాకుండా ఏకంగా అరవై కోట్ల షేర్ వసూలు చేసే దిశగా గీత గోవిందం దూసుకుపోతోంది. అలాగని ఇదేమీ అద్భుతమైన చిత్రం కాదు. ఒక సగటు వినోదాత్మక చిత్రమే. దీనికి విజయ్ క్రేజ్ తోడవడం వల్ల కలక్షన్లు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. ఈ స్థాయి విజయాన్ని కనీసం ఆ చిత్ర రూపకర్తలు కూడా ఊహించలేదు.
విజయ్ ఒక్కసారిగా దూసుకురావడంతో అతని సమవుజ్జీలైన హీరోలు హడలెత్తిపోతున్నారు. ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు అంతా విజయ్ కోసం బారులు తీరుతున్నారు. దీంతో చాలా విజయాలు అందించిన హీరోలకి కూడా కాస్త ఇన్‌సెక్యూరిటీ మొదలైంది. విజయ్ మిడ్ టేబుల్‌లోనే కొంత కాలం వుంటాడో లేక రాబోయే రెండు, మూడు చిత్రాలతో అగ్రశ్రేణి హీరోల సరసన చేరిపోతాడో చూడాలి.