cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఆవిరి

సినిమా రివ్యూ: ఆవిరి

సమీక్ష: ఆవిరి
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌:
ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్‌
తారాగణం: రవిబాబు, నేహా చౌహాన్‌, బేబి శ్రీముక్త, ముక్తార్‌ ఖాన్‌, ప్రియ వడ్లమని తదితరులు
కథనం: సత్యానంద్‌
సంగీతం: వైదీ
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: ఎన్‌. సుధాకర్‌ రెడ్డి
రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు
విడుదల తేదీ: నవంబర్‌ 1, 2019

లో బడ్జెట్‌లో క్రియేటివ్‌ ఐడియాస్‌తో కొన్ని అలరించే చిత్రాలు అందించిన రవిబాబుతో ఒక సమస్య వుంది. అతని చిత్రాలు అయితే బాగుంటాయి... లేదా తల బాదుకునేలా చేస్తాయి. టెరిబుల్‌ సినిమా తీసినా కానీ మళ్లీ వెంటనే సర్‌ప్రైజ్‌ చేయగల టాలెంట్‌ అతనిది. అయితే ఐడియాలన్నీ 'ఆవిరి' అయిపోయాయా అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటిగా రవిబాబు అందిస్తోన్న కళాఖండాలని చూస్తోంటే... ఇక అతడినుంచి అల్లరి, అనుసూయ ఆశించడం అత్యాశే అవుతుందేమో అనిపిస్తోంది.

అవును 2, అదుగో లాంటి డిజాస్టర్స్‌ తర్వాత రవిబాబు నుంచి వచ్చిన తాజా చిత్రం 'ఆవిరి'. హారర్‌ జోనర్‌లో రవిబాబు ఇప్పటికే చాలా చిత్రాలు తీసేసాడు. మళ్లీ అదే జోనర్‌లో సినిమా తీయాలని అనుకున్నపుడు కనీసం అది తననైనా ఎక్సయిట్‌ చేసే ఐడియా అయి వుండాలి. ఇంతకుముందు తన సినిమాలలో చూసిన సెటప్‌, అదే తరహా సీన్స్‌తో 'ఆవిరి' ఎందుకు తీసినట్టో అతనికే తెలియాలి.

తన ఐడియాలకి ఫైనాన్స్‌ కూడా తానే చేసుకుంటాడు కనుక ఇక తనని క్వశ్చన్‌ చేసేవాళ్లు వుండట్లేదు. అందుకే అదుగో, ఆవిరి లాంటి చిత్రాలని ఇష్టారాజ్యంగా తీసేస్తున్నాడు. ఒక జంట తమ కూతురితో కలిసి ఒక పాత బంగ్లాలోకి వెళతారు. అక్కడో కనిపించని దెయ్యం ఆ పాపతో మాట్లాడుతూ వుంటుంది. తనతో చిత్రమైన పనులు చేయిస్తుంటుంది. ఎన్నిసార్లు చూసిన సెటప్‌ ఇది? కొత్తగా ఇంకో సినిమా అయితే తీయాల్సిన అవసరమే లేని ఈ సెటప్‌కి రవిబాబు ఏదైనా కొత్తదనం జోడించాడా అంటే అదీ లేదు.

'బొంబాయిలో అంతే' అన్నట్టుగా 'హారర్‌ సినిమాల్లో ఇంతే' అని మీకూ తెలుసుగా అన్నట్టుగా లేజీ సీన్స్‌తో నింపేసాడు. నీట్‌గా అన్నీ అమర్చినట్టు వున్న ఇంట్లో దెయ్యం వుండడమనేది 'అవును'లో కొత్తగా అనిపించింది. ఇప్పటికీ రవిబాబు అదే ప్రొడక్షన్‌ డిజైన్‌తో హారర్‌ సినిమాని నడిపించాలని చూస్తున్నాడు. ఈసారి దెయ్యానికి మేకప్‌ కూడా వేయకుండా... హీరోయిన్‌తోనే దెయ్యంలా నోరు తెరిచి నడవమని చెప్పాడు. కనీసం చీకట్లో భయపెట్టే స్కోప్‌ కూడా ఇవ్వకుండా ఆ సీన్‌ పట్టపగలు సెట్‌ చేసాడు. పాపం అలా నోరు తెరుచుకుని దెయ్యం ఎఫెక్ట్‌ తేవడానికి నేహా చౌహాన్‌ పడ్డ కష్టం చూస్తే జాలి కలుగుతుంది.

డ్రైవర్‌ లేని బైక్‌పై చిన్న పాప పిలియన్‌ రైడింగ్‌ చేస్తూ వెళ్లడం చూసిన తల్లికి అలా ఎలా వెళ్లిందనే అనుమానమే కలగదు. తండ్రిపై పింగాణి కప్పులు, ప్లేట్లు విసిరేసిన కూతురి ప్రవర్తనపై కించిత్‌ అసహనం కనిపించదు. పిజ్జా డెలివర్‌ చేయడానికి వచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కి ఆ పిజ్జా ప్యాకెట్‌ గాల్లోకి ఎగిరి ఫీట్లు చేసినా పెద్దగా పట్టింపుండదు. బేబీ సిట్టింగ్‌కి వచ్చిన స్త్రీ (హిమజ మల్లిడి... ఈమెకి వేసిన గెటప్‌ చూడాల్సిందే!) కొన్ని నిమిషాల్లోనే పలాయనం చిత్తగిస్తే ఏం జరిగిందనేది సిసి టీవీ కెమెరా ఫుటేజీలో చూడాలని కూడా అనిపించదు. ఏదో కన్వీనియంట్‌గా అలా సన్నివేశాలన్నీ దర్శకుడి ఇష్టానికి తగ్గట్టు సాగిపోతుంటాయి.

ఇంటర్వెల్‌ వరకు క్వశ్చన్స్‌ ఏమీ అడక్కూడదనేది రవిబాబు పెట్టుకున్న రూల్‌ అయి వుండాలి. ఆ తర్వాత 'ఆవిరి'కి ఇచ్చే టైటిల్‌ జస్టిఫికేషన్‌, దెయ్యాలని 'నిప్పు' అంటే భయం అంటూ చెప్పే కట్టు కథ, సూటేసుకున్న తాంత్రికుడిలాంటి వ్యక్తి చేసే ఓవరాక్షన్‌, దెయ్యంలా కనిపించడానికి నేహా చౌహాన్‌ పడే తాపత్రయం, ఇక అసలు కథ ఏమిటంటూ చివర్లో చూపించే సిల్లీ లస్ట్‌ స్టోరీ... వెరసి 'ఆవిరి'.. చూడ్డానికి థియేటర్ల వరకు వచ్చిన ప్రేక్షకుల మీదే జోక్‌ వేసినట్టుంది. 'నేనిలాంటి సినిమా తీస్తే దానికి మీరు డబ్బులు పెట్టుకుని, టైమ్‌ వేస్ట్‌ చేసుకుని మరీ వచ్చి చూసారు' అంటూ రవిబాబు నవ్వుతున్నట్టనిపిస్తుంది.

'అదుగో' తర్వాత సురేష్‌బాబు ఈసారి తన పేరుని రవిబాబు సినిమా పోస్టర్‌పై వేయడానికి నిరాకరించారో ఏమో ఇప్పుడు దిల్‌ రాజు పేరు ప్రత్యక్షమయింది. ఈ జోక్‌ ఆయన మీద కూడా వేసినట్టయింది.

ప్రధాన పాత్ర పోషించిన రవిబాబుకి ఈ చిత్రం వరకు ఎంత ఎఫర్ట్‌ పెట్టాలనేది మాత్రం బాగానే తెలుసు. అందుకే అస్సలు కష్టపడకుండా నిద్రలో నడుస్తోన్న తీరున నటించేసాడు. నేహా చౌహాన్‌ మాత్రం పలుచోట్ల ప్రేక్షకుల సానుభూతిని చూరగొంటుంది. ఆమె నటనతో కాదు... నటి కావడం వల్ల ఈ చిత్రంలో ఈ పాత్ర పోషించాల్సి వచ్చినందుకు.

ఒక కీలక సన్నివేశంలో తమ వెనుక కూతురికి ఎదురయిన సంఘటనలు సిసిటీవీ ఫుటేజీలో చూస్తూ వుంటే... చౌహాన్‌ కళ్లు మూసుకుని ఏడుస్తుంటుంది. ఆమెని రవిబాబు పిలిచి చూపించే వరకు షాక్‌ అవకూడదనేది ఆ సీన్‌లో ఆమెకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌. ఇక దెయ్యంలా కనిపించాలంటూ నోరు బార్లా తెరుచుకుని నడవమనేది అదో రకం హెరాస్‌మెంట్‌. నటన పరంగా పెద్ద వాళ్ల కంటే బేబీ శ్రీముక్త బెటర్‌ అనిపిస్తుంది.

హారర్‌ సినిమా ఎఫెక్ట్‌ అవసరమే లేకుండా సినిమాటోగ్రఫీ భలే కలర్‌ఫుల్‌గా వెలుగులు చిమ్మింది. నేపథ్య సంగీతం, సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో భయపెట్టాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. స్క్రీన్‌ప్లే రచయితగా సీనియర్‌ రైటర్‌ సత్యానంద్‌ పేరు చిన్నబోయింది. దర్శకుడిగా రవిబాబు పనితనం... 'అదుగో'కి, 'అవును 2'కి మధ్య ఎక్కడో వుంటుంది.

భయపడే అనుభూతిని ఆస్వాదించడానికి ఆవిరికి వెళ్లడం కంటే ఆల్రెడీ అరడజను సార్లు విజిట్‌ చేసిన స్కేరీ హౌస్‌లోకి మళ్లీ ఇంకోసారి వెళితే కాస్తయినా ఆ ఫీలింగ్‌ వస్తుంది. లేదా అవును టీవీలో ఇంకోసారి చూసినా ఇంతకంటే బెటర్‌ థ్రిల్లే ఇస్తుంది.

బాటమ్‌ లైన్‌: ఆవులింత!
-గణేష్‌ రావూరి