జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగితే టీఆర్ఎస్ నేతలు ససేమిరా అన్నారట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలవడానికీ వీలు కలగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సోషల్ మీడియా వేదికగా.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై కేసీఆర్‌తో చర్చించాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్. అదీ అసలు విషయం. తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తే.. కేసీఆర్, ఆర్టీసీ సమ్మె విషయమై ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేరన్న విషయం స్పష్టమవుతోంది.
ఎక్కడిదాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో సఖ్యత కొనసాగిస్తున్న కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనంపై వెటకారం చేసిన విషయం విదితమే. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ అంత పట్టుదలతో వున్నారు.
'విలీనమూ జరగదు.. మన్నూ జరగదు..' అని జగన్ మీదనే వెటకారం చేసే స్థాయికి వెళ్ళారు కేసీఆర్. అలాంటి కేసీఆర్‌ని అపాయింట్మెంట్ కోరడమే జనసేనాని చేసిన వ్యూహాత్మక తప్పిదంగా చెప్పుకోవచ్చు. పైగా, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వని విషయాన్ని కూడా ప్రచారం చేసుకుంటోంది జనసేన పార్టీ.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేనాని ఈ నెల 3న 'లాంగ్ మార్చ్' తలపెట్టారు. విశాఖలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. నిజానికి క్షణం తీరిక లేకుండా ఆ ఏర్పాట్లలో తలమునకలై వుండాలి జనసేనాని.
ఉత్తరాంధ్రకి చెందిన జనసేన శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు విశాఖలోనే వుండాల్సింది పోయి.. ఎంచక్కా, తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టారు జనసేనాని. పైగా, కెలక్కూడని సమయంలో కేసీఆర్‌ని కెలకాలనుకోవడం ఎంతవరకు సబబో ఏమో, జనసేనానికే తెలియాలి.
భవన నిర్మాణ కార్మికులకు బాసడగా.. అంటూ 'లాంగ్ మార్చ్'ని ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, టీడీపీని మద్దతు అడగ్గానే చంద్రబాబు ఓకే చెప్పేశారు. అదే తరహాలో ఆయనకి కేసీఆర్ నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందని ఆశించడాన్ని ఏమనుకోవాలి.? ఈ విషయమై జనసైనికులే పూర్తి కన్ఫ్యూజన్లో పడిపోయారు.
పాపం, తమ అధినేత తప్పటడుగుల్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు జనసైనికులు.