కేసీఆర్ సర్కారు తమ అస్త్రాలను బయటకు తీస్తోంది. సుమారు నెలరోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె మీద ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. సమ్మెను చావుదెబ్బ కొట్టడానికి ఇవే అంతిమ అస్త్రాలని, ఇవే బ్రహ్మాస్త్రాలని చెప్పలేం.. అయితే.. ఇవి అంతకంటె తక్కువ అస్త్రాలు కాదని మాత్రం అనుకోవచ్చు. ఆర్టీసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి.. అందుబాటులోకి తీసుకురావాలని, సమస్యకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి.. శనివారం నాటి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంటుంది.
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలినుంచి గుర్రుగానే ఉన్నారు. చాలా కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో.. ఉద్యమకారులకు ఆయన ఓ మోస్తరు ఝలక్ ఇచ్చారు. ఆర్టీసీ సంస్థే మూతపడే పరిస్థితిని తీసుకువస్తున్నారంటూ హూంకరించారు. అయితే విపక్షాలన్నీ మద్దతిస్తుండగా.. ఆర్టీసీ సమ్మె మాత్రం యధావిధిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కవ రూట్లలో ప్రెవేటు ఆపరేటర్లకు పర్మిట్లు ఇవ్వడం ద్వారా… సమ్మెపై సమ్మెటపోటు వేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా కనిపిస్తుంది.
ఇందులో భాగంగానే.. ఆర్టీసీని మూడు ముక్కలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నగరం హైదరాబాదుకు ఒక కార్పొరేషన్, తతిమ్మా రాష్ట్రానికి మరో రెండు కార్పొరేషన్లు సేవలందిస్తాయి. అలాగే ఆర్టీసీలో ప్రస్తుతం 25 శాతానికి మించకుండా లీజు బస్సులు తీసుకోవచ్చుననే నిబంధన ఉంది. దీనిని కూడా 30 శాతానికి పెంచే ఆలోచన చేస్తున్నారు.
ప్రెవేటు ఆపరేటర్లకు పర్మిట్లు ఇచ్చేయడం జరిగితే సమ్మె నీరుగారుతుంది. అలాగే ఆర్టీసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడం వల్ల కూడా సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాల బలం తగ్గుతుంది. మూడు కార్పొరేషన్లకు విడివిడిగా నిబంధనలు, ఉద్యోగ విధివిధానాలు అమల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు.
మొత్తానికి కేబినెట్ నిర్ణయం ద్వారా… సమ్మె ద్వారా ఎదురవుతున్న రవాణా కష్టాలకు ప్రత్యామ్నాయం చూడడానికి సర్కారు చొరవచూపిస్తున్న మాట నిజం. ఈ ప్రయత్నాలు కొంతమేర సఫలం అయినా.. ప్రజలు సమ్మెను పట్టించుకోవడం మానేస్తారు. సమ్మె కూడా క్రమంగా నీరుగారిపోయే అవకాశం ఉంది.