తమ పార్టీ గురించి వారిలో వారికి ఎంతటి స్వాతిశయం, అభిమానం, నమ్మకం ఉన్నప్పటికీ.. కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శవాసనం వేసి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చచ్చిన గుర్రానికి ఊపిరి ఊది.. తిరిగిలేపి నిలబెట్టగల సత్తా ఎవరికి ఉంది? ఈ చచ్చిన గుర్రాన్ని సవారీ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఏఐసీసీ కసరత్తు ఇప్పుడే మొదలైంది.
పీసీసీకి ప్రస్తుతం రఘువీరారెడ్డి సారథ్యం వహిస్తున్న విషయం రికార్డులకు మాత్రమే పరిమితం. ఆయన పార్టీ పీసీసీ చీఫ్ పదవికి తాను ఎన్నడో రాజీనామా చేసేశానని ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఎన్నికల నాటికి ఆయన ఆపద్ధర్మ సారధి మాత్రమే. ఆ తర్వాత ఆయన మరింత ఇనాక్టివ్ అయిపోయారు. పార్టీ గురించి పట్టించుకోవడం మానేశారు. మిగిలిన విపక్షాలు ఎలా పనిచేస్తున్నా… ఆయన కనీసం పార్టీ ఊసు కూడా పట్టించుకోవడం లేదు.
ఇన్నాళ్లూ కొత్త పీసీసీ చీఫ్ ఎంపికను ఎలా సాగదీసినప్పటికీ.. ఇప్పుడు కూడా పట్టించుకోకపోయినట్లయితే.. నష్టం కాస్త ఎక్కువగానే ఉంటుందని పార్టీ అధినాయకత్వం భయపడినట్లు కనిపిస్తోంది. అందుకే ఊమెన్ చాందీ రంగంలోకి దిగారు. సారథ్యం ఎవరికి అప్పగించాలనే విషయంలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మాజీమంత్రి శైలాజానాధ్ కు చాలాకాలంగా పీసీసీ చీఫ్ పదవి మీద కన్నుంది. అవకాశం అడుగుతున్నారు.
తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కూడా తాజాగా సారథ్యం అడుతున్నారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ కూడా అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరు కొత్త సారథి అయితే… పార్టీకి జవసత్వాలు వస్తాయో తెలుసుకోడానికి ఊమెన్ చాందీ ప్రయత్నిస్తున్నారు. అయితే.. క్రియాశీలంగా క్షేత్రస్థాయిలో పనిచేయకుండా, తెలుగు ప్రజల గురించిచ ఢిల్లీ నాయకత్వం పట్టించుకోకుండా ఎవరు సారథి అయినా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని వారు గుర్తించాలి.