Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అరవింద సమేత... వీర రాఘవ

సినిమా రివ్యూ: అరవింద సమేత... వీర రాఘవ

రివ్యూ: అరవింద సమేత... వీర రాఘవ
రేటింగ్‌: 3/5
తారాగణం: ఎన్టీఆర్‌, పూజ హెగ్డె, జగపతిబాబు, సునీల్‌, నవీన్‌ చంద్ర, ఈషా రెబ్బా, రావు రమేష్‌, శుభలేఖ సుధాకర్‌,  నాగబాబు, శ్రీనివాసరెడ్డి, సుప్రియ పాఠక్‌, సితార, దేవయాని తదితరులు
సంగీతం: తమన్‌ .ఎస్‌
ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌
కూర్పు: నవీన్‌ నూలి
నిర్మాత: ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు)
కథ, కథనం, దర్శకత్వం: త్రివిక్రమ్‌

ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. అద్భుతమైన రీతిలో అలరించి ఇండస్ట్రీ హిట్‌ అయ్యాయి చాలా సీమ కథలు. ఈ నేపథ్యంలో పదుల కొద్దీ సినిమాలు తీసేసి ఇక ఫార్ములా పాతబడిపోయిందని వదిలేసారు తెలుగు సినిమా రచయితలు, దర్శకులు. అయితే త్రివిక్రమ్‌ మరోసారి ఆ బ్యాక్‌డ్రాప్‌నే ఎంచుకుని సాహసం చేసాడు. కాకపోతే ఇక ఆ బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా చెప్పడానికి ఏముంది, ఇంకా ఏమి చూపిస్తారనేదే సందేహాలు రేకెత్తించింది. తన శైలిలో ఈ కథని ఎవరూ ఇంకా డీల్‌ చేయలేదనేది త్రివిక్రమ్‌ ధైర్యమై వుండాలి.

సహజంగా ఫ్యాక్షన్‌ కథలని లైటర్‌ వీన్‌లో స్టార్ట్‌ చేసి తర్వాత హీరో బ్యాక్‌డ్రాప్‌ రివీల్‌ చేసినపుడు అతనిలోని వయొలెంట్‌ యాంగిల్‌ రివీల్‌ చేస్తుంటారు. త్రివిక్రమ్‌ అందుకు భిన్నంగా ముందే హీరోని అత్యంత పవర్‌ఫుల్‌ సీన్‌తో పరిచయం చేసేసి, అతని సామర్ధ్యం చూపించేసి ఆ వెంటనే అతనిలో పరివర్తన తీసుకొచ్చే సన్నివేశాలతో హీరోని పాసివ్‌ మోడ్‌లోకి తీసుకెళ్లాడు. అటునుంచి కథ పట్నానికి షిఫ్ట్‌ అయి అక్కడ్నుంచి కాస్త కలర్‌ఫుల్‌గా మారుతుంది.

త్రివిక్రమ్‌ కనుక హీరో గతాన్ని దాచి, ముందుగా హీరోయిన్‌ ట్రాక్‌నుంచి కథ స్టార్ట్‌ చేసినట్టయితే రాంగ్‌ ట్రాక్‌ ఎక్కేది. ఇక్కడే త్రివిక్రమ్‌లోని రచయిత తెలివిగా యోచించి, అంతటి హెవీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని స్టార్టింగ్‌లోనే పెట్టే సాహసం చేసాడు. దీని వల్ల సినిమా మొదలు కావడంతోనే ఒక విధమైన మూడ్‌ సెట్‌ అవుతుంది. కథానాయకుడిలో పరివర్తన తెచ్చేందుకు బలమైన మాటలు రాయడంతో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ స్మూత్‌గా జరిగిపోతుంది.

అయితే అంతటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్న హీరో వెంటనే ఒక మామూలు అమ్మాయికి మనసిచ్చేయడం, ఆమెలో 'శాంతి'ని వెతుక్కోవడం పాత్రోచితంగా లేదు. కథానాయకుడు ఆమెవైపు మొగ్గడానికి అనుగుణంగా ఆమె ఆలోచనలని ప్రతిబింబించే మంచి సంభాషణలయితే వున్నాయి కానీ ఆ పాత్రని తీర్చి దిద్దిన విధానం అంతగా ఆకట్టుకోదు. అతడిని కదిలించేంత గొప్ప గుణాలున్న అమ్మాయి పాత్రలా (ఉదాహరణకి శ్రీమంతుడులో శృతిహాసన్‌లా) చూపించాల్సింది పోయి త్రివిక్రమ్‌ మార్కు 'ఆకతాయి' హీరోయిన్‌తోనే ఫిలాసఫీ మాట్లాడించడం ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఇకపోతే అంత బలమైన సంఘటనలతో మొదలైన కథ అలా ఒక్కసారిగా లైట్‌గా మారడం, వినోదం కోసం ప్రయాస పడడం, హీరో పాత్ర కూడా తన స్వభావానికి భిన్నంగా కొన్నిసార్లు అల్లరిగా కనిపించడం చూసేందుకు అంత బాగా అనిపించదు. అతడులో మహేష్‌ కనిపించినట్టుగా అతని ప్రవర్తనలో మార్పులు లేకుండానే వినోదం పండించుకునే వీలున్నా కానీ జల్సాలో ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌ తర్వాత హీరోలో కనిపించే అల్లరితనం తొణికిసలాడడం సమజసంగా లేదు.

అయితే ఈ ధోరణి ఎక్కువ సమయం లేకుండా రాఘవ పాత్ర మూడ్‌ షిఫ్ట్స్‌ చూపిస్తూ, సునీల్‌తో తన అంతర్మధనం పంచుకోవడం లాంటివి పెట్టడం వల్ల కథ ట్రాక్‌ తప్పలేదు. త్రివిక్రమ్‌ ఈసారి తనలోని మాటల రచయితపై ఎక్కువగా డిపెండ్‌ అయిన ఫీలింగ్‌ వస్తుంది. సన్నివేశ బలం కంటే సంభాషణలతో కన్విన్స్‌ చేసే ప్రయత్నం ఎక్కువ జరిగింది. మంచి రచయిత కనుక చాలా సందర్భాలలో అతని మాటల గారడీకి సరెండర్‌ అయిపోతాం.

కాకపోతే మాటలతోనే అవతలి వారిలో పరివర్తన తెచ్చేయడం అనేది నమ్మశక్యంగా అనిపించదు. ఉదాహరణకి పూజ, ఆమె తమ్ముడిని దుండగులు అపహరించే సన్నివేశంలో కేవలం ఫోన్‌లో బెదిరించి వాళ్లని కాపాడేస్తాడు ఎన్టీఆర్‌. సగటు రౌడీల వరకు భయపడ్డారంటే ఫర్వాలేదు... కానీ పగతో రగిలిపోతున్న విలన్‌ తనయుడు కూడా మాటలకే భయపడిపోవడం హీరోని ఎలివేట్‌ చేస్తుందేమో కానీ విలన్‌ని వీక్‌ చేస్తుంది. నాయకుడి బలం తెలియాలంటే బలమైన ప్రతినాయకుడు వుండాలని ఎన్టీఆరే అన్నాడు. కాకపోతే ప్రతినాయకుడు చూడ్డానికి భయానకంగా వుంటాడే తప్ప ఎక్కడా తన బలం చూపించడు.

గ్రాఫ్‌ పడుతూ లేస్తూ సాగుతున్నా, ఒక్కోసారి ఫ్లాట్‌గా వెళ్లిపోతున్నా సడన్‌గా ఒక ఎలివేషన్‌ సీన్‌తో మళ్లీ ఊపు తీసుకురావడమనే లక్షణం ఈ చిత్రంలో చివరంటా కనిపిస్తుంది. కిక్‌ ఇచ్చే సాలిడ్‌ ఎపిసోడ్స్‌ నాలుగైదు వుండడం, వాటిని తారక్‌ తన నటనతో మరో రేంజికి తీసుకెళ్లడం, తమన్‌ ఒక చెయ్యేసి వాటి ఇంపాక్ట్‌ని ఇంకాస్త పెంచడంతో అవి ఉత్తేజాన్నిస్తాయి. అదే సమయంలో కథనం కొన్ని సందర్భాలలో చాలా ఫ్లాట్‌గా వెళ్లిపోతున్నా ఏ దశలోను విసుగు పుట్టించేంత లెవల్‌కి దానిని వెళ్లనివ్వకపోవడం కలిసొచ్చింది.

త్రివిక్రమ్‌ పాయింట్‌ని వదిలి బయటకి రావడానికి ఇష్టపడక పాటలు, కామెడీ జోలికి కూడా పోలేదు కానీ ఆ స్కోప్‌ లేకపోలేదు. తమన్‌ ఈ చిత్రానికి ప్రాణం పోసాడనేది చిన్నమాటే అవుతుంది. 'పెనిమిటి'లాంటి మంచి పాటకి తగ్గ న్యాయం త్రివిక్రమ్‌ చిత్రీకరణ చేయలేదు కానీ త్రివిక్రమ్‌ తీసిన సాధారణ సన్నివేశాలని కూడా మరింత ఎఫెక్టివ్‌గా మార్చడంలో తమన్‌ నేపథ్య సంగీతం పెద్ద రోల్‌ ప్లే చేసింది. త్రివిక్రమ్‌ టేకింగ్‌లో వుండే స్టయిలిష్‌నెస్‌ ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌కి వన్నె తెచ్చింది.

ఈ బ్యాక్‌డ్రాప్‌లో చేసే చిత్రాలని ఇంత స్టయిలిష్‌గా ప్రెజెంట్‌ చేసే వీలుందా అనిపిస్తుంది. ఫస్ట్‌ ఫైట్‌ సీన్‌ని రామ్‌ లక్ష్మణ్‌ డిజైన్‌ చేసిన విధానం అలరిస్తుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలున్న ఈ చిత్రానికి తెరపై నటీనటవర్గం కూడా కలిసొచ్చింది. ఎన్టీఆర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రౌద్ర రసపూరిత పాత్రలు తనకి కొత్త కాకపోయినా మునుపు చూసిన ఎన్టీఆర్‌కి పూర్తి భిన్నంగా ఆ సన్నివేశాల్లో కనిపిస్తాడు. అరుపులు, ఆర్తనాదాలు కాకుండా కేవలం కళ్లల్లో, హావభావాల్లోనే తన రౌద్రాన్ని ప్రదర్శించడం ఈ చిత్రానికి ప్రత్యేకత తెచ్చిపెట్టింది.

స్టాక్‌ ఫ్యాక్షనిస్ట్‌ క్యారెక్టర్స్‌కి భిన్నంగా, మంద్ర స్వరంతోనే గాంభీర్యం పలికించడం ఈతరం నటుల్లో తనెందుకు హై రేటెడ్‌ యాక్టర్‌ అనేది చూపిస్తుంది. జగపతిబాబు ఆహార్యం, నటన మెప్పిస్తాయి. ఎన్టీఆర్‌ తర్వాత తెరపై ఈ చిత్రానికి ప్లస్‌ జగపతి అనడం కాదు అతిశయోక్తి. పూజ హెగ్డే గ్లామరస్‌గా వుంది. సొంత డబ్బింగ్‌ అప్పుడప్పుడూ ఇబ్బంది పెట్టింది. ఈ పాత్ర చిత్రణ ఇలా జరిగి వుండాల్సింది కాదేమోననే భావన కలుగుతుంది. సునీల్‌కి ఈ తరహా పాత్రలతో డిస్టెన్స్‌ ఏర్పడినా కానీ కమెడియన్‌గా ఇంకా ఫామ్‌లోనే వున్నాడనేది క్లియర్‌గా తెలిసిపోతుంది.

త్రివిక్రమ్‌ దర్శకుడిగా పూర్తి ఫామ్‌లో లేకపోయినా పలు సందర్భాల్లో తనలోని రైటర్‌ సాయపడ్డాడు. కొన్ని అత్యద్భుతమైన సంభాషణలని రాసిన త్రివిక్రమ్‌ కేవలం 'మాటలతో' మార్పుల కోసం ప్రయత్నించకుండా సన్నివేశ బలం మీద ఫోకస్‌ పెట్టినట్టయితే మరింత బాగుండేది అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా తీసాడో, కొన్నిచోట్ల ఏదోలే అన్నట్టు కానిచ్చేసాడు. ఉదాహరణకి పతాక సన్నివేశంలో ఎన్టీఆర్‌-జగపతిబాబు ముఖాముఖి సన్నివేశంలో వుండాల్సినంత లోతు లేదు.

అలాగే తన భావంలో వున్న గాఢత కొన్నిసార్లు తెర మీదకి రాలేదు. ఉదాహరణకి 'పెనిమిటి' పాట సాహిత్యంలో వున్న ఆర్ధ్రత తెరపై అస్సలు లేదు. కథ, కథనాల పరంగా సగటు సినిమా అయినా కానీ ఎన్టీఆర్‌ నటన, త్రివిక్రమ్‌ మాటలు, ఉత్తేజపరిచే యాక్షన్‌ దృశ్యాలు, విసుగెత్తించని కథాగమనం ఈ చిత్రాన్ని చూడదగ్గ చిత్రంగా నిలబెట్టాయి.

త్రివిక్రమ్‌ నుంచి కోరుకునే కొత్తదనం లేకపోయినా కానీ పాత కథని తనదైన తీరులో చెప్పడం మెప్పిస్తుంది. దర్శకుడిగా త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యాడనడం కంటే, ఆయనకి తారక్‌ బలమయ్యాడనడం సమంజసం.

బాటమ్‌ లైన్‌: తారక రాముని పరాక్రమం!
-గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?