‘మీ.. టూ.. ‘ రకుల్ అలా.. కాజల్ ఇలా!

''మహిళా లోకం ఎదుర్కొంటోన్న అతి పెద్ద సమస్యల్లో 'లైంగిక వేధింపు' అతి ముఖ్యమైనది. ఈ అంశంపై ఇప్పటిదాకా పెదవి విప్పలేని పరిస్థితులు వున్నాయేమో. ఇకపై ఎవరూ మహిళలపై లైంగిక వేధింపులకు సాహసించకుండా మహిళా లోకం…

''మహిళా లోకం ఎదుర్కొంటోన్న అతి పెద్ద సమస్యల్లో 'లైంగిక వేధింపు' అతి ముఖ్యమైనది. ఈ అంశంపై ఇప్పటిదాకా పెదవి విప్పలేని పరిస్థితులు వున్నాయేమో. ఇకపై ఎవరూ మహిళలపై లైంగిక వేధింపులకు సాహసించకుండా మహిళా లోకం అంతా ఒక్కటై నడుంబిగించాలి. ఈ క్రమంలో ప్రతి మహిళా సాటి మహిళకు అండగా నిలవాలి.. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా మిగిలిపోకూడదు. అలా పబ్లిసిటీ స్టంట్‌ అని ఎవరైనా ఆరోపణలు చేసినా పట్టించుకోవాల్సిన పనిలేదు.

బురదజల్లేవారెప్పుడూ వుంటారు.. మన పని మనం చేసుకుపోవాల్సిందే..'' అంటూ 'మీ.. టూ..' ఉద్యమంపై కాజల్‌ అగర్వాల్‌ తాజాగా స్పందించింది. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి, మాధవీలత తదితరులు 'మీ..టూ..' అంటూ మాట్లాడినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదుగానీ, ఎప్పుడైతే బాలీవుడ్‌లో ప్రముఖ నటి తనూశ్రీ దత్తా 'మీ..టూ..' అంటూ ముందుకొచ్చిందో.. అప్పటినుంచి మొత్తం సీన్‌ మారిపోయింది.

పలువురు ప్రముఖులు మీడియా ముందుకొస్తున్నారు. ఇంకొందరు మీడియా ముందుకు రాకపోయినా, సోషల్‌ మీడియా వేదికగా 'మీ.. టూ..' ఉద్యమానికి ఊతమిస్తున్నారు. తాజాగా, ఓ దర్శకుడి చెంప ఛెళ్ళుమనిపించిన నటి ఉదంతం వీడియో రూపంలో వెలుగుచూసింది. 'జాలీ ఎల్‌ఎల్‌బీ' దర్శకుడు సుభాష్‌ కపూర్‌ చెంప ఛెళ్ళుమనిపించింది నటి గీతిక త్యాగి.

సుభాష్‌ కపూర్‌పై ఆరోపణల నేపథ్యంలో అతని దర్శకత్వంలో రూపొందుతోన్న 'మొఘల్‌' సినిమా నుంచి బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ తప్పుకున్నాడట కూడా. ఇలాంటి ఉదంతాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూస్తూనే వున్నాయి. సినీరంగాన్నే కాదు, మీడియా రంగాన్నీ ఓ కుదుపు కుదిపేస్తోంది 'మీ.. టూ..'

మొత్తమ్మీద, 'మీ..టూ..' ఉద్యమం ఎవరూ ఊహించనంతగా బలోపేతమయ్యింది. సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌పై శ్రీరెడ్డి మాట్లాడితే, 'అలాంటిదేమీ లేదు..' అని రకుల్‌ గతంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చి వివాదాల్లోకెక్కింది. ఆమెపై శ్రీరెడ్డి అప్పట్లో విరుచుకుపడింది కూడా.

ఇప్పుడు 'మీ..టూ..' వివాదంపై సానుకూలంగా స్పందించడమే కాదు, ఈ ఉద్యమానికి మద్దతివ్వకపోతే నేరమన్న భావన హీరోయిన్లలో కన్పిస్తోంది. కాజల్‌ కావొచ్చు, మరొకరు కావొచ్చు.. లైంగిక వేధింపులపై 'మీ..టూ..' అంటూ స్పందించడాన్ని అభినందించి తీరాల్సిందే.