టైటిల్: అశోకవనంలో అర్జునకళ్యాణం
రేటింగ్: 2.5/5
తారాగణం: విశ్వక్ సేన్, రుక్షర్ థిల్లాన్, రితిక నాయక్, గోపరాజు రమణ తదితరులు
కథ: రవికిరణ్ కోల
కెమెరా: కార్తిక్ పళని
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సంగీతం: జై క్రిష్
నిర్మాత: బాపినీడు బి
దర్శకత్వం: విద్యాసాగర్ చింత
విడుదల తేదీ: 6 మే 2022
సంప్రదాయబద్ధంగా కనిపించే టైటిల్…కానీ వివాదాస్పదమైన వెరైటీ పబ్లిసిటీతో ముందుకొచ్చింది. సినిమా మీద కంటే జనం దృష్టంతా ఒక టీవీ చానల్ యాంకర్ కి, హీరో విశ్వక్ సేన్ కి మధ్యన జరిగిన ఒక రియాలిటీ షో లాంటి గొడవ మీదే పడింది.
ట్రైలర్ ని బట్టి చూస్తే ఆంధ్రా అమ్మాయి, తెలంగాణా అబ్బాయి మధ్యలో పెళ్లికి చెందిన కథే. అందులోనే విలేజ్ కామెడీ, ఎమోషన్ వగైరాలన్నీ కలగలిపిన ఫార్ములా బేస్డ్ మాస్ మసాలా చిత్రమని అర్థమౌతుంది.
ఇంతకీ మ్యాటరేంటో చూద్దాం.
33 ఏళ్ల సూర్యాపేట వరుడు తూర్పుగోదావరి జిల్లాలోని అమ్మాయితో నిశ్చితార్థానికి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్తాడు. అక్కడేం జరిగిందనేది కథ. ఒకే లొకేషన్లో సింగిల్ పాయింట్ మీద కథ నడపడమంటే అంత తేలిక కాదు. ఉన్న పరిధిలో ఉన్న పాత్రలతోటే ఎమోషన్, కామెడీ, సెంటిమెంట్, లవ్ అన్నీ పండించాలి.
ప్రధమార్థం సరదాగా సాగినా ద్వితీయార్థానికి వచ్చే సరికి ల్యాగులతో కొంత నీరసం తెప్పిస్తుంది. కథ ఏమవబోతోందో ఆడియన్స్ కి తెలిసిపోయినా ఎలా అవబోతోందో తెలుసుకోవడానికి చివరిదాకా కూర్చోవాలి.
ఈ టైప్ సెంటిమెంట్ హీరో కథలు 1990-2000 లో వెంకటేష్ తో వచ్చేవి. ఈమధ్యన “షాదీ ముబారక్” అని పెళ్లి చూపులు నేపథ్యంలో వచ్చింది. అదే కాస్త అటు ఇటు అయ్యి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” గా వచ్చింది.
అలాగే పాత తరం హీరోలైన చంద్రమోహన్ లాంటి వాళ్లు 1980ల్లో సాధారణ ఫిజిక్ తోటే నటించేవాళ్లు. అయినా ఆ రోజుల్లో అదేమంత ఎబ్బెట్టుగా ఉండేది కాదు. ఆకృతికి తగిన పాత్రలే చేసేవాళ్లు కూడా.
కానీ ఈ రోజుల్లో హీరో అంటే స్లిం గా ఉండాలి, మంచి హెయిర్ లైన్ ఉండాలి, కుదిరితే సిక్స్ ప్యాక్ ఉండాలి లాంటి కొలతలు ఏర్పడ్డాయి. వాటిని బ్రేక్ చేస్తూ కనిపించాడు ఇందులో విశ్వక్.
ఈ సినిమాలో ఉన్న ప్రధానమైన గుణమేంటంటే కథ పాత పద్ధతిలో ఉన్నా ఆర్గానిక్ గా ఉండి…కథనం మాత్రం సినిమాటిక్ గా ఉండడం. 35 దాటిన పెళ్లికాని ప్రసాదులెందరినో టచ్ చేసే కథ ఇది.
లాక్డౌన్ నేపథ్యంలో పెళ్లివారంతా ఒకచోటే ఉండిపోవడం లాంటి సీక్వెన్సులు మాత్రం ఇప్పుడు ఔట్ డేట్ అయిపోయాయి.
ఆడపిల్ల నువ్వు అర్థం కావా, రామసిలకా పాటలు బాగున్నాయి. జైక్రిష్ సంగీతంలో విషయమైతే ఉంది.
విశ్వక్ సేన్ యూత్ మెచ్చే నటుడు. కానీ పాత్రకి అనుగుణంగా పొట్టతో, ఊడిపోతున్న జుట్టుతో సగటు మిడిల్ క్లాస్ పల్లెటూరి వ్యక్తిగా కనిపించాడు. ఎక్కడా ఓవర్ చెయ్యలేదు. అలాగని అండర్ ప్లే కూడా లేదు. ఎక్కడ ఎంత చెయ్యాలో అంత చేసుకుపోయాడు.
రుక్షర్ చూడ్డానికి బాగుంది కానీ నటించడానికి పెద్దగా స్కోపైతే లేదు. పేరుకు తాను హీరోయినే అయినా కథంతా రితికా నాయక్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా పూర్తయ్యే సరికి గుర్తుండిపోయే పాత్ర ఆమెదే.
గోపరాజు రమణ తనదైన శైలిలో చిరాకు పెట్టించే బంధువు క్యారెక్టర్ ని రక్తికట్టించాడు. కాదంబరి కిరణ్ కూడా రొటీన్ తూగో జిల్లా కామెడీ చేసాడు. అయితే యాసని కొన్ని చోట్ల విసురుగా ప్రదర్శించడం వల్ల డయలాగ్స్ అర్థం కావు.
దర్శకుడిలో కూర్చోబెట్టగలిగే టాలెంట్ ఉంది. అయితే కథనంలో ఎమోషన్ తో పాటూ టేకింగ్ లో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు నేటి ప్రేక్షకులు. ఆ దిశగా మరికొంత కృషి చేయాల్సి ఉంది.
మధ్యవయసొచ్చినా పెళ్లి కాని ప్రసాదులు పెరగడానికి గల కారణాన్ని ప్రస్తావిస్తూ, “వచ్చే జెనరేషన్ అబ్బాయిల కోసం ఈ జనరేషన్ అమ్మాయిలు కష్టపడైనా అమాయిల్ని కానాల్సిందే” అంటూ హీరో లైటర్ వీన్ లో ఒక డయలాగ్ కొడతాడు. అలా ఇండైరెక్టుగా సమాజానికి మెసేజు కూడా వదిలాడన్నమాట.
ఇది నిజంగా మనసు పెట్టి తీసిన సినిమా. అయితే అత్యద్భుతం అనిపిస్తే తప్ప చిన్న సినిమాల్ని చూడడానికి థియేటర్స్ కి జనం రాని రోజులివి. అద్భుతం కాదు కానీ బానే ఉంది అన్నాకూడా టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకునే ప్రేక్షకులు పెరిగారు. కనుక మనసుకు నచ్చినట్టు తీయడం కన్నా ఏం చేస్తే ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించవచ్చో ఆలోచించి మరింత కసరత్తు చేసుంటే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేది.
బాటం లైన్: ఓ పెళ్లికాని ప్రసాదు కథ