టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. మొదటి నుంచి ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు. తండ్రి గంగసుబ్బరామిరెడ్డి ఎమ్మెల్యేగా శ్రీకాళహస్తి నుంచి ప్రాతినిథ్యం వహించారు. తండ్రి వారసత్వంగా బొజ్జల రాజకీయాల్లో ప్రవేశించారు.
మొదటిసారి 1989లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత 1994, 1999లో వరుసగా గెలుపొందారు. 2004లో దివంగత వైఎస్సార్ గాలిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్సీవీ నాయుడి చేతిలో బొజ్జల ఓడిపోయారు. ఆ తర్వాత 2009, 2014లలో విజయం సాధించారు. 2019లో బొజ్జల తనయుడు పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డితో చేతిలో ఓడిపోయారు.
సొంతజిల్లాకు చెందిన చంద్రబాబుతో బొజ్జలకు సాన్నిహిత్యం వుంది. పలు సంక్షోభ సమయాల్లో చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో మందుపాతర్లు పేలినపుడు చంద్రబాబు వెంటే బొజ్జల వున్నారు. అప్పట్లో బొజ్జల కూడా గాయాలపాలయ్యారు.
చంద్రబాబు కేబినెట్లో బొజ్జలకు ప్రతి సందర్భంలోనూ బెర్త్ కేటాయించేవాళ్లు. అయితే 2014లో మొదట మంత్రి వర్గంలోకి తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత అనారోగ్య కారణంతో తొలగించారు. తనను కేబినెట్ నుంచి తప్పించడపై అప్పట్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆవేదన చెందారు.
బొజ్జల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల బొజ్జల పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన ఇంటికి చంద్రబాబు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ బొజ్జల తుదిశ్వాస విడవడం టీడీపీకి తీరనిలోటు.