తెలంగాణలో పవన్ రాజకీయం.. ఇకపై ఇదే ఫైనల్

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఏపీ కంటే ఏడాది ముందుగానే జరుగుతాయి కాబట్టి.. పార్టీలన్నీ ముందు అక్కడ తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాయి. జనసేన కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కానీ అక్కడ పవన్ పార్టీకి…

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఏపీ కంటే ఏడాది ముందుగానే జరుగుతాయి కాబట్టి.. పార్టీలన్నీ ముందు అక్కడ తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాయి. జనసేన కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కానీ అక్కడ పవన్ పార్టీకి బీజేపీతో పెద్ద చిక్కొచ్చి పడింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ బీ-ఫామ్ లు కూడా ఇచ్చేసిన దశలో పోటీ వద్దని బీజేపీ పట్టుబట్టింది. ఆటోమేటిగ్గా పవన్ వెనక్కి తగ్గారు. ఫలితంగా బీజేపీకి లాభం చేకూరింది. జనసేన పోటీ చేసి ఉంటే ఓట్లు చీలేవి అని చెప్పలేం కానీ, జనాల్లో కన్ఫ్యూజన్ లేకపోవడం, జనసేన పోటీలో లేకపోవడంతో.. పవన్ అభిమానులు కూడా బీజేపీకి ఓట్లు వేశారు. మరి అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఏంటి..?

తెలంగాణలో టీఆర్ఎస్ కి ఏకైక ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ.. జనసేనతో కలసి పోటీచేయాలనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణలో జనసేనకు, జనసేనానికి అంత సీన్ లేదనే విషయం బీజేపీకి తెలుసు. అందులోనూ జనసేనపై ఏపీ పార్టీ అనే ముద్ర ఉంది. వారితో స్నేహం చేస్తే టీఆర్ఎస్ విమర్శలను తట్టుకోవడం కష్టం. 

ఇటీవలే ఏపీపై హాట్ కామెంట్స్ చేసి కేటీఆర్ ఒక రకమైన సెంటిమెంట్ జ్వాల రగిల్చారు. ఇప్పుడు బీజేపీ, జనసేన పొత్తుపెట్టుకుని తెలంగాణలో పోటీ చేస్తే కాషాయదళానికే శానా కష్టం. అందుకే ఆ పార్టీ తెలంగాణ వరకు జనసేనను దూరం పెడుతోంది.

మాతో వద్దు.. మీరూ పోటీ చేయొద్దు..

మాతో పొత్తు వద్దు, మీరు కూడా పోటీ చేయొద్దు.. తెలంగాణ ఎన్నికల వరకు జనసేనకు బీజేపీ పెడుతున్న కండిషన్ ఇది. కలసి పోటీ చేస్తే.. స్థానిక సెంటిమెంట్ ని ఒడిసి పట్టుకోలేరు. విడివిడిగా పోటీ చేస్తే ఏపీలో పొత్తు ఉంది కదా అంటూ సెటైర్లు పడతాయి, జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. 

ఎందుకొచ్చిన తంటా అనుకున్న బీజేపీ, జనసేనను ఈ ఆపరేషన్ కి దూరంగా ఉండాలని చెబుతోంది. పవన్ కల్యాణ్ ని న్యూట్రల్ గా ఉండాలని సూచిస్తోంది.

పవన్ కర్తవ్యం ఏంటి..?

ఈమధ్య తెలంగాణలో కూడా పార్టీ కమిటీలు అంటూ హడావిడి చేసిన పవన్.. ఎప్పటిలాగే ఎన్నికల వరకు ఆ హడావిడి కొనసాగిస్తారు. ఆ తర్వాత సైలెంట్ గా తప్పుకుంటారు. మరోసారి త్యాగరాజు అనే బిరుదు తనకు మాత్రమే సొంతం అనేలా ఫోజులిస్తారు. దీనివల్ల పవన్ కి రెండు లాభాలు. 

తెలంగాణలో బీజేపీ ఓడిపోయినా పవన్ కి పెద్ద నష్టం లేదు. నేను బరిలో దిగి ఉండే మరోలా ఉండేది అనే బిల్డప్ ఇవ్వొచ్చు. ఏపీలో బీజేపీపై మరింత పట్టు బిగించొచ్చు. అక్కడ త్యాగం చేశాం కదా, ఇక్కడ మా సంగతేంటని ప్రశ్నించొచ్చు.

ఒకవేళ తెలంగాణలో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వస్తే.. ఆ పార్టీతో పొత్తు కంటిన్యూ చేయడానికి అంతకంటే పెద్ద భరోసా పవన్ కి ఇంకోటి ఉండదు. పోరాడటం కంటే లైట్ తీసుకోవడమే పవన్ కి ఎక్కువ ఇష్టం కాబట్టి.. తెలంగాణ ఎన్నికలను ఆయన పూర్తిగా లైట్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 

బీజేపీతో కూడా ఆయన అంటీముట్టనట్టు ఉంటారు. అంటే తెలంగాణ జనసైనికులు ఇప్పుడే తమ దారి తాము చూసుకోవడం మంచిది.