Advertisement

Advertisement


Home > Movies - Reviews

Captain Miller Review: మూవీ రివ్యూ: కెప్టెన్ మిల్లర్

Captain Miller Review: మూవీ రివ్యూ: కెప్టెన్ మిల్లర్

చిత్రం: కెప్టెన్ మిల్లర్
రేటింగ్: 2.5/5
తారాగణం:
ధనుష్, ప్రియాంక అరుళ్ మోహన్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, జయప్రకాష్ తదితరులు. 
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
కెమెరా: సిద్ధార్థ నుని
నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
దర్శకత్వం: అరుణ్ మాతేశ్వరన్
విడుదల: జనవరి 26, 2024 

"సర్" అనే హిట్ సినిమా తర్వాత రఫ్ లుక్ తో బ్రిటీష్ నేపథ్యం కథతో ముందుకొచ్చాడు ధనుష్. తమిళంలో మొన్న పొంగల్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో డబ్బయి వచ్చింది. ఇందులో ఏముందో చూద్దాం. 

బ్రిటీష్ కాలంలో ఒక మారుమూల గ్రామంలో ఒక ప్రాచీన దేవాలయం. ఆ దేవాలయం చుట్టూ వెనుకబడిన కులాల వాళ్ల గుడిసెలు. ఆ గుడిలోకి వాళ్లకి ప్రవేశం ఉండదు. అలా అని వాళ్లు ఆ గుడి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్లరు. ఈ తెగకు చెందిన వాడు అగ్నీశ్వర (ధనుష్). అతని అన్న శివన్న (శివరాజ్ కుమార్). అదే ఊళ్లో రాజేంద్ర భూపతి (జయప్రకాష్) అనే జమిందారు. అతని కుటుంబం ఈ జనాన్ని అణచివేతకు గురిచేస్తూ ఉంటుంది. వీరికి తోడు బ్రిటీష్ వాళ్ల జులుం సరేసరి.

శివన్న స్వాతంత్రపోరాటం బ్రిటీష్ వాళ్ల మీద. అతని ఆశయాలకి విరుద్ధంగా అగ్నీశ్వర బ్రిటీష్ సైన్యంలో చేరతానంటాడు. అన్నదమ్ముల మధ్య వాగ్వివాదం జరుగుతుంది. సొంత ఊళ్లో పైకులాల వాళ్ల అమర్యాద కంటే బ్రిటీష్ ప్రభుత్వంలో సైనికుడిగా బతకడం గౌరవప్రదమని అంటాడు. అదే తనకి స్వాతంత్ర్యమని చెప్పి సైన్యంలో చేరతాడు. అక్కడ బ్రిటీష్ వాళ్లు తనకిచ్చిన పేరే మిల్లర్. 

ఆ తర్వాత బ్రిటీష్ ఆర్మీలో చేరి అతను పడ్డ మానసిక వేదన, జీవితంలో మలుపులు అన్నీ ఒక కొలిక్కి వచ్చి తన తెగల ప్రజలకి అన్నిరకాలుగా విముక్తి కల్పించడంతో కథ ముగుస్తుంది. 

నిజానికి రచనలో గానీ, మేకింగ్ లో గానీ ఎక్కడా అశ్రద్ధ కనపడలేదు. తమకి తాము ఒక ఎపిక్ ని తెరకెక్కిస్తున్నట్టే తీసారు. కానీ పెట్టుకున్న అన్ని పాత్రలకి న్యాయం జరగక, మొత్తం ధనుష్ పాత్రనే సెంటర్ చెయడం వల్ల, ఎడతెగని యాక్షన్ సీన్స్ కారణంగా దీనిని ఆశించిన స్థాయికి తీసుకెళ్లలేకపోయారు. 

పైగా బ్రిటీష్ కాలం కథలు, కుల వివక్ష వంటి అంశాలు తమిళ తెర మీద రొటీనైపోయాయి. కథ ఎంత కొత్తదైనా అదే నేపథ్యంలో సినిమాలనేటప్పటికి ఎంతో ఎమోషన్ పండితే తప్ప కొత్తదనం అనిపించదు.

ఇందులో సందీప్ కిషన్, శివన్న పాత్రలు అతిధి పాత్రలకంటే కాస్త పెద్దవి అంతే. ఉన్నారంటే ఉన్నారు..కానీ కథపై వాళ్ల ప్రభావం లేదు. అలా పాత్రల్ని సమర్ధవంతంగా వాడుకోలేదు. 

నిజానికి టూ డైమెన్షనల్ గా శివన్న చేసే బ్రిటీష్ వాళ్లపై పోరాటాన్ని, ధనుష్ చేసే పైకులాలవారిపై పోరాటాన్ని బలంగా చూపించొచ్చు. అలా కాకుండా మొత్తం ధనుష్ మీదే నడపాలనుకున్నప్పుడు శివన్న లాంటి నటుడిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక సందీప్ కిషన్ పాత్రైతే మారీ ఆటలో అరటిపండైపోయింది.

బ్రిటీష్ పాలన నేపథ్యంలో రాసుకున్న కల్పిత కథే అయినా చూపించిన ఆయుధాలు, రాకెట్ లాంచర్లు అతిగా ఉన్నాయి. అటు చేసి ఇటి చేసి మళ్లీ కేజీఎఫ్ తరహా యాక్షన్ పోకడల్ని అనుసరించినట్టు అనిపిస్తుంది. ఇక యాక్షన్ సీన్లైతే ఎప్పటికీ ఆగవు.  రెండు ముప్పావు గంటల సినిమా మూడున్నర గంటల సినిమాలా అనిపించడానికి కారణం మందకొడి సీన్లు, పొడవాటి యాక్షన్ సన్నివేశాలే కారణం. 

అలాగే... బ్రిటీష్ వారిపై తిరగబడి వాళ్లని క్రూరంగా చంపే హీరో అదే బ్రిటీష్ వాళ్లిచ్చిన పేరుని గొప్పగా ఫీలౌతూ ఎందుకు తనని తాను "కెప్టెన్ మిల్లర్" గా చెప్పుకుంటూ ఉంటాడో అర్ధం కాదు. 

ఇక రచన పరంగా చూసుకుంటే డబ్బింగ్ క్వాలిటీ దాదాపు బానే ఉంది. పాటల్లో పదాలు కూడా అరవపూత లేకుండా తెలుగుదనంతో ఉన్నట్టే అనిపించాయి. 

నటీనటుల విషయానికొస్తే జమిందారు కొడుకుగా చేసినతను మాత్రం అరవసాంబారు ఓవరాక్షన్ చేసాడు. ఆ పాత్ర మలచిన పద్ధతి ఒక్కటే ఎబ్బెట్టుగా ఉంది. మిగిలిన వాళ్లంతా ఓకే. 

ధనుష్ లో వైవిధ్యమేమీ కనపడలేదు. కంట్రోల్డ్ ఎమోషన్స్ తో కనిపించే పాత్రగా మలచడం వల్ల భావోద్వేగాల్ని కనబరచడానికి స్కోప్ తక్కువైపోయింది. తల్లిపోయిన సీన్లో గానీ, తోటి సైనికుడు పోయినప్పుడు కానీ... ఇంకా కొన్ని సన్నివేశాల్లో మెప్పించే అవకాశమున్నా కూడా సటిల్ యాక్షన్ తో ఓకే అనిపించాడు. 

శివన్న పాత్ర గురించి చెప్పుకోవడానికేమీ లేదు. సందీప్ కిషన్ మొదట్లో ఓ సారి, చివర్లో ఓ సారి పలకరించే పాత్ర అంతే. 

ప్రియాంక అరుల్ మోహన్, నివేదితా సతీష్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. మిగిలినవాళ్లు ఓకే. 

టెక్నికల్ గా ఉన్నతంగా ఉన్న సినిమా ఇది. ఆర్ట్ వర్క్, కాస్ట్యూం, మేకప్, కెమెరా వర్క్ అన్నీ చెప్పుకోదగ్గగా ఉన్నాయి. 

జీవీ ప్రకాష్ ఆకట్టుకునే నేపథ్య సంగీతాన్ని అందించాడు. కొన్ని యాక్షన్ సీన్స్ మీద వచ్చే మ్యూజిక్ అయితే గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ కథకి, మేకింగ్ కి ఎలాంటి సంగీతం ఉండాలో అలా ఉంది. 

ప్రధమార్ధంలోనూ, ద్వితీయార్థంలోనూ కూడా ఫైటింగ్ సీన్లే డామినేట్ చేసాయి. కులవివక్ష మీద కథే అయినా "జై భీం" లో లాగ కళ్లు చెమర్చే సెంటిమెంట్ లేదు. బ్రిటీష్ వారి మీద పోరాటం అయినా గుండెల్లో దేశభక్తి పొంగే ఎమోషన్ లేదు. కంటికే తప్ప మనసుని హత్తుకునే ఎమోషనల్, పొయెటిక్ మొమెంట్స్ లేకపోవడం వల్లనే ఈ చిత్రం సాధారణ స్థాయికి పరిమితమయ్యింది. 

పైన చెప్పుకున్న నేపథ్యం నచ్చేవాళ్లకి, ఎడతెగని యాక్షన్ సన్నివేశాలు అలుపెరగకుండా చూడగలిగేవాళ్లకి తప్ప ఇతర ప్రేక్షకులకి కష్టమవచ్చు.  

బాటం లైన్: హత్తుకోని పోరాటం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?