cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చిత్రలహరి

సినిమా రివ్యూ: చిత్రలహరి

రివ్యూ: చిత్రలహరి
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌
తారాగణం: సాయితేజ్‌, కళ్యాణి ప్రియదర్శన్‌, నివేథా పేతురాజ్‌, సునీల్‌, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: ఏ. శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం.)
రచన, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల
విడుదల తేదీ: ఏప్రిల్‌ 12, 2019

'ఒక ప్లేట్‌ సక్సెస్‌ కావాలి' అంటూ వెయిటర్‌ని అడుగుతాడు ఇందులో హీరో... సాయి తేజ్‌. ఇటీవల వరుస అపజయాలతో డీలాపడ్డ సాయి తేజ్‌ది నిజంగా ఇందులో తాను చేసిన క్యారెక్టర్‌ విజయ్‌లానే సక్సెస్‌ కోసం డెస్పరేట్‌గా వున్న సిట్యుయేషన్‌. మూస కథలు, మాస్‌ పాత్రలు అంటూ ట్రాక్‌ తప్పిన సాయి తేజ్‌ ఇప్పుడు రైట్‌ ట్రాక్‌లోకే వచ్చాడు. ఫైట్లు, ఫీట్లు, పంచ్‌ డైలాగులు, పేరున్న డైరెక్టరు... లాంటివి సక్సెస్‌ సూత్రాలు కాదని తెలుసుకున్నాడు. హీరోలా కనిపించడం కాకుండా తాను పోషించే పాత్రలా అనిపించాలని రియలైజ్‌ అయ్యాడు. నటుడిగా చిత్రలహరి తననో మెట్టు ఎక్కిస్తుంది కానీ తాను ఎదురు చూస్తోన్న ప్లేట్‌ సక్సెస్‌ కోసం మాత్రం ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేసేట్టు చేస్తుంది.

ఫెయిల్యూర్స్‌లో వున్నపుడు సక్సెస్‌ని అందుకునే రూట్‌ని ఈజీ చేసేది అండర్‌డాగ్‌ క్యారెక్టర్‌. సాయి తేజ్‌ ఈ కథకి కనక్ట్‌ అవడానికి అదే అయివుండొచ్చు రీజన్‌. ఈ సినిమాలో దర్శకుడే చెప్పినట్టు బాగా సక్సెస్‌ అయ్యే మనుషులు ఎక్కడో టూ పర్సంట్‌ మాత్రమే వుంటారు. అంటే మిగతా వాళ్లంతా రాజీ పడి జీవించేస్తుంటారు. అందుకే ఇలాంటి స్టోరీ లైన్స్‌తో ఎక్కువ శాతం కనక్ట్‌ అవుతుంటారు. ఈ తరహా కథలని వాళ్లే సక్సెస్‌ చేస్తుంటారు. కాకపోతే ఆ రిలేటబులిటీ ఎస్టాబ్లిష్‌ చేయడంలోనే 'చిత్రలహరి' దర్శకుడు కిషోర్‌ శృతి తప్పాడు. సక్సెస్‌ కాలేకపోతోన్న హీరో తాలూకు పెయిన్‌ అర్థమవుతున్నా కానీ అందుకోసం అతను పెట్టే ఎఫర్ట్స్‌ లేదా సక్సెస్‌ వైపు అతని జర్నీతో మాత్రం కనక్ట్‌ చేయలేకపోయాడు.

ఒంటరిగా వెళుతూ యాక్సిడెంట్‌కి గురయిన వాళ్లని కాపాడే పరికరం ఒకటి హీరో కనిపెడతాడు. దానికి ఇన్వెస్టర్‌ని వెతకడమే అతని పని. ఈ తరహా ప్రొఫెషన్‌తో ఎంతమంది కనక్ట్‌ కాగలరు? ఆ పరికరం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కూడా బలంగా లేవు. హీరో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తోంటే 'వావ్‌' అనే ఫీలింగ్‌ ఎక్కడా రాదు. ఇక ఆ ఐడియాతో సక్సెస్‌ అయ్యాడని చూపిస్తే 'హై' ఎలా వస్తుంది? ఇందులోని విజయ్‌ క్యారెక్టర్‌కి బేసిక్స్‌ బాగా తెలుసు. సక్సెస్‌ కాకపోయినా కానీ బేసిక్స్‌ పాటిస్తాడు. కానీ ఆ పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు కిషోర్‌ మాత్రం కొన్ని బేసిక్స్‌ విస్మరించాడు.

పాత్రలని బాగా రాసుకున్నాడు. ప్రతి పాత్రకీ ఒక చక్కని పరిచయ సన్నివేశంతో పాటు ఓ విలక్షణతని కూడా ఆపాదించాడు. ఇందులోని ప్రతి కీలక పాత్రా ఆకట్టుకునేలానే వుంటుంది. అలాగే ఈ పాత్రలని తీసుకెళ్లి ఒక అండర్‌డాగ్‌ సక్సెస్‌ జర్నీ అనే ప్లాట్‌లో పెట్టాడు. ఇంతవరకు బాగానే వుంది. కానీ అన్నిటికంటే ప్రధానమైన బేసిక్స్‌ ఏవి? ఈ కథలో సంఘర్షణ ఎక్కడుంది? కాన్‌ఫ్లిక్ట్‌ లేకుండా ఏ స్టోరీ అయినా ఎంతవరకు ఇంట్రెస్ట్‌ని సస్టెయిన్‌ చేయగలదు? పాత్రలు, పాటలు, మాటలు లాంటివి పూర్తిగా ఆసక్తి కోల్పోకుండా ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలుగుతాయి కానీ తెరపై జరుగుతున్న దానిలో లీనమయ్యేలా కానీ, పాత్రలు అనుభవిస్తోన్న భావోద్వేగాలని ఫీలయ్యేలా కానీ చేసే కథనం, డ్రామా కిషోర్‌ పూర్తిగా విస్మరించాడు.

డ్రామా సరిగ్గా పండితే కథ కొత్తగా వుండాల్సిన పని లేదు. కిషోర్‌ తిరుమల తీసిన నేను శైలజ కథలో కొత్తదనం ఏముండదు. కానీ డ్రామాని పండించిన తీరు, భావోద్వేగాలతో కదిలించిన విధానం ఆ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టాయి. కిషోర్‌ తిరుమల గత చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'లో ఎలా అయితే పాత్రలని తీర్చిదిద్ది అవి నడిపించడానికి తగిన బలమైన కథని ఇవ్వలేకపోయాడో ఇక్కడా అదే మిస్టేక్‌ రిపీట్‌ చేసాడు. పొటెన్షియల్‌ వున్నా కానీ చాలా సందర్భాల్లో చిత్రలహరి అండర్‌ కుక్డ్‌గా అనిపించడానికి దర్శకుడే కారకుడు.

సంభాషణలు బాగా రాయగల రచయితలు చాలా మందిలో కనిపించే బలహీనత ఇది. సన్నివేశ బలం లేకపోయినా సంభాషణలతో కవర్‌ చేసేస్తుంటారు. అయితే అన్ని వేళలా అలా మాయ చేయడం కుదరదు. నెరేషన్‌ ఇస్తున్నపుడు డైలాగ్స్‌ స్ట్రయికింగ్‌గా అనిపిస్తూ డైవర్ట్‌ చేస్తాయి కానీ దృశ్యంతో చూస్తున్నపుడు కేవలం మాట మాత్రమే బలంగా వుంటే సరిపోదు. ఈ సినిమాకి టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఇస్తూ... కొన్ని పాటలు కలిసి చిత్రలహరి అయినట్టుగా, కొన్ని పాత్రలు కలిసి ఈ చిత్రలహరి అయిందని దర్శకుడు ఈ చిత్రాన్ని స్టార్ట్‌ చేస్తాడు. ఆ చిత్రలహరిలో పాటలు వినసొంపుగా వుంటే చాలు. కానీ పాత్రలని దగ్గరకి చేర్చిన ఈ చిత్రలహరిలో దారం అతుకులమయంగా అనిపించకూడదు.

ప్రథమార్ధం వరకు అలాంటి అతుకులేం కనిపించకపోయినా, కీలకమయిన ద్వితియార్ధంలో మాత్రం చాలాసార్లు కథనానికి అవి అడ్డు పడి ఇబ్బంది పెట్టాయి. ఉదాహరణకి హీరో చేసిన పరికరానికి కథలో ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక అటెంప్ట్‌ జరిగింది. స్వేచ్ఛ (నివేథ) వల్ల ఈ పరికరం చేసే ఆలోచన వచ్చిందనే రివీల్‌ ఎలాంటి ఇంపాక్ట్‌ వేయకపోగా చాలా సిల్లీగా అనిపిస్తుంది. అలాంటి విషయాలని చాలా గొప్పగా అనిపించేట్టుగా తీర్చిదిద్దాలి. లేదా అసలు అలాంటి ఎలిమెంటే లేకపోయినా ఫర్వాలేదు. ఇక చివర్లో జరిగిన కోర్టు డ్రామా కూడా 'పతాక ఘట్టం' గాట్టిగా వుండాలని చేసిన ప్రయత్నంలా వుంటుందే తప్ప విజయ్‌ సాధించిన విజయాన్ని హర్షించేలా లేదు. ఇక్కడా దర్శకుడు దృశ్యం కంటే శ్రవణం (మాటలు, నేపథ్య సంగీతం) మీదే ఆధార పడ్డాడు.

సాయితేజ్‌ తన పేరులోని కొన్ని అక్షరాలు, తన పాత్రల్లో తరచుగా కనిపించే కొన్ని లక్షణాలు వదిలేసుకున్నాడు. సంభాషణలు హడావిడిగా పలికే ధోరణి కూడా తగ్గించాడు. ఎక్స్‌ప్రెషన్స్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. కాస్త బరువు తగ్గి, ఆ 'రంగస్థలం' గడ్డాన్ని మరికాస్త తగ్గించినట్టయితే ఇంకా బాగుండేది కానీ మొత్తంమీద తన వరకు మంచి స్కోరే దక్కించుకుంటాడు. సునీల్‌, పోసాని లాంటి నటులు మంచి సహకారం అందించగా, హీరోయిన్లు ఫర్వాలేదనిపించారు. వెన్నెల కిషోర్‌ కామెడీతో కాస్త ఉపశమనం ఇస్తాడు.

పాటలు, మాటలు చాలా బాగున్నాయి. ఛాయాగ్రహణం, కళ, కూర్పు అన్నీ చక్కగా కుదిరాయి. అయితే ముందే చెప్పినట్టుగా బేసిక్స్‌ని 'చిత్రలహరి' దర్శకుడు ఓవర్‌ లుక్‌ చేసాడు. చిత్రలహరిలో హీరో తాలూకు ప్రేమకథ కానీ, అతని స్నేహితులతో వున్న అనుబంధం కానీ, తండ్రితో వున్న బంధం కానీ అంతా పైపైన టచెస్‌తో సాగిపోతుందే తప్ప ఏదీ అలా స్ట్రయికింగ్‌గా, ఎఫెక్టివ్‌గా రిజిష్టర్‌ కాదు. ఇంకాస్త రిలేటబుల్‌ జర్నీ, అతని కష్టం తెలిసే గమ్యం, ఆ గమ్యం చేరితే వచ్చే సంతృప్తి లాంటి వాటిపై దృష్టి పెటినట్టయితే చిత్రలహరి మొత్తంగా అలరించేది.

చిత్రలహరి కార్యక్రమంలో మామూలుగా అన్నీ అలరించే పాటలే ప్రసారమయ్యేవి. కానీ ఈ చిత్రలహరిలో మాత్రం మెప్పించినవి, నొప్పించినవి కూడా సమానంగా షేర్‌ తీసుకున్నాయి. కొన్ని మంచి మూమెంట్స్‌ వున్నప్పటికీ బయటకి వచ్చేప్పుడు గుర్తుంచుకునేవి, గుర్తు చేసుకుని మరొకరితో షేర్‌ చేసుకునేవి, లేదా కూర్చున్నంతసేపు అలరించేవి లేక ఈ చిత్రం సగటు స్థాయిని దాటి పైకి వెళ్లలేకపోయింది.

బాటమ్‌ లైన్‌: చిత్రలహరిలో పాటలు, పాత్రలు బాగున్నాయి!
- గణేష్‌ రావూరి