సినిమా రివ్యూ: మిస్టర్‌

రివ్యూ: మిస్టర్‌ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌ తారాగణం: వరుణ్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, లావణ్య త్రిపాఠి, సత్యం రాజేష్‌, మురళి శర్మ, ఆనంద్‌, నాజర్‌, హరీష్‌ ఉత్తమన్‌, పృధ్వీ, రఘుబాబు, తేజస్వి,…

రివ్యూ: మిస్టర్‌
రేటింగ్‌:
2/5
బ్యానర్‌: లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌
తారాగణం: వరుణ్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, లావణ్య త్రిపాఠి, సత్యం రాజేష్‌, మురళి శర్మ, ఆనంద్‌, నాజర్‌, హరీష్‌ ఉత్తమన్‌, పృధ్వీ, రఘుబాబు, తేజస్వి, సురేఖ వాణి, ఈశ్వరి, నికితిన్‌ దీర్‌, తనికెళ్ల భరణి తదితరులు
కథ: గోపిమోహన్‌
మాటలు: శ్రీధర్‌ సీపాన
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
సంగీతం: మిక్కీ జె మేయర్‌
ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), 'ఠాగూర్‌' మధు
కథనం, దర్శకత్వం: శ్రీను వైట్ల
విడుదల తేదీ: ఏప్రిల్‌ 14, 2017

వరుస విజయాలతో 'దూకుడు' మీదున్న దర్శకుడు శ్రీను వైట్లకి 'ఆగడు'తో షాక్‌ తగిలింది, 'బ్రూస్‌లీ'తో బ్రేక్‌ పడింది. దీంతో విసిగిస్తోన్న తన రొటీన్‌ టెంప్లేట్‌ వదిలేసి కొత్త తరహా కథనంతో చేస్తోన్న ప్రయత్నమంటూ చెప్పుకొచ్చిన 'మిస్టర్‌', వైట్ల తీసిన గత రెండు చిత్రాలే బెటర్‌ అనే భావన కలిగిస్తుంది! దురదృష్టకరమే కానీ ఇది నిజం. 'మిస్టర్‌' ద్వితియార్థం చూస్తుంటే లిటరల్‌గా 'చివరి వరకు కూర్చోగలరేమో చూద్దాం' అంటూ ప్రేక్షకులకి పరీక్ష పెడుతున్నారా అనిపిస్తుంది. ఆ సన్నివేశాలు, పాత్రలు చూస్తూ వుంటే… ఏదో ఒక పాయింట్‌లో పాజ్‌ ఇచ్చి, పాప్‌-అప్‌ స్క్రీన్‌లోకి శ్రీను వైట్ల వచ్చి… 'ఇప్పటివరకు మీరు చూసిందంతా జోక్‌. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది' అని చెప్తాడేమో అనే ఆశ కలుగుతుంది. 

రాయల కాలం నాటి మనుషులట, సంప్రదాయాలట… తప్పు చేసిన వారి తల నరికేయమంటూ తీర్పులట. అంత సనాతన సంప్రదాయాలని పాటించే వారింట మరణ దండన పడిన వ్యక్తి ముందు ఐటెమ్‌ సాంగులట. జాతకాలట, గృహనిర్బంధనమట… రుద్రాక్ష పుట్టుమచ్చ వున్న వరుడట. ఏ కాలంలో వున్నామని మనల్ని మనమే గిచ్చి చూసుకుంటూ వుండగా లొకేషన్‌ షిఫ్ట్‌ అయి మరో ఊరికి వెళుతుంది. అక్కడ కర్రసాములో గెలిచిన వారికి పది సంవత్సరాల పాటు ఊరి పెత్తనం ఇచ్చేస్తారట. దీనికే ఇలాగైపోతే ఎలాగన్నట్టు చివర్లో హీరో, హీరోయిన్ల ప్రేమలు ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యే దృశ్యాలతో 'నాక్‌ అవుట్‌ పంచ్‌' ఇస్తారు. 

శ్రీను వైట్ల సినిమాల్లో సింపుల్‌ కథకి వివిధ త్రెడ్స్‌ని కలుపుకుంటూ ఎంగేజింగ్‌గా సాగే స్క్రీన్‌ప్లే పెద్ద ఆకర్షణ. ఇతర దర్శకులు, రచయితల వల్ల కాని ఆ కాంప్లికేటెడ్‌ స్టయిల్‌ని వైట్ల మాస్టర్‌ చేసి వరుసగా బ్లాక్‌బస్టర్లు కొట్టాడు. అయితే ఫామ్‌లో వుండగా అలాంటి స్క్రీన్‌ప్లే పుల్‌ చేయగలిగిన శ్రీను వైట్ల 'ఆగడు' నుంచి ఆ మ్యాజిక్‌ చేయలేకపోతున్నాడు. ఆగడు, బ్రూస్‌లీ తన టెంప్లేట్‌ కథలే అయినప్పటికీ శ్రీను వైట్ల వాటిని ఎంటర్‌టైనింగ్‌గా మలచలేకపోయాడు. దీంతో ఈసారి ఒక ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీని తీసుకుని తనదైన శైలిలో వివిధ త్రెడ్స్‌తో కూడిన స్క్రీన్‌ప్లేతో కొత్త తరహా అనుభూతిని ఇవ్వాలని చూసాడు. కానీ శ్రీను వైట్ల మునుపటి టచ్‌ కోల్పోయాడనేది 'ఊపిరి' స్పూఫ్‌ చూస్తేనే తెలిసిపోతుంది. అసలు ఆ స్పూఫ్‌ ఉద్దేశమేంటో అర్థం కాదు. నవ్వించాలని తీసారో, లేక సీరియస్‌గా శ్రీనివాసరెడ్డికి తేజస్వితో లవ్‌ ట్రాక్‌ రాసారో కూడా బోధపడదు. 

సినిమా ఇండస్ట్రీకి చెందిన క్యారెక్టర్లు, సినిమా వాళ్లపై సెటైర్లు శ్రీను వైట్ల సినిమాల్లో కామన్‌గా కనిపిస్తుంటాయి. ఇందులోను అది రిపీట్‌ అయింది. కాకపోతే మునుపటి పంచ్‌ మిస్‌ అయింది. ఎక్కడో ఒకటీ అరా పంచ్‌లు తప్ప నవ్వించిన సందర్భాలు బహు తక్కువ. ఫస్ట్‌ హాఫ్‌ ఏదో అలా అలా సాగిపోతుంది కానీ సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి మొదలవుతుంది శూల దండన. అసలు ఈ సెటప్‌ అంతా వర్కవుట్‌ అవుతుందని ఎలా అనుకున్నారో, పేపర్‌ మీదే సిల్లీగా అనిపించేదానిని తెరమీదకి ఎలా ఎక్కించారో అర్థమవదు. సాధారణంగా ఒక బ్యాడ్‌ ఎపిసోడ్‌ తర్వాత అయినా సినిమాలు ఏదో రకంగా ట్రాక్‌ ఎక్కేస్తాయి. కనీసం క్లయిమాక్స్‌లో అయినా వాటిని మరిపించేది ఏదైనా వుంటుంది. కానీ మిస్టర్‌ ట్రాక్‌ తప్పిన తర్వాత ఇక మళ్లీ రైట్‌ వేలోకి రాలేదు. సినిమా అయిపోతుందనే దశలో నాజర్‌ పాత్రని పరిచయం చేయడమే కాకుండా మళ్లీ అక్కడో సంక్రాంతి పాట పెట్టారు. అటుపై కర్రసాము ఫైటుతో 'విసుగు'కి పీక్స్‌ చూపిస్తూ, పతాక సన్నివేశాల్లో ఆ ప్రేమ బదిలీ తంతుతో పూర్తిగా చరమ గీతం పాడేసారు. 

వరుణ్‌ తేజ్‌ ఇంతకుముందు రెగ్యులర్‌ హీరో పాత్రలు చేయలేదు. మొదటిసారిగా తన ఏజ్‌కి తగ్గ ట్రెండీ క్యారెక్టర్‌లో కనిపించిన వరుణ్‌ ఈ స్టయిలిష్‌ అవతార్‌లో బాగున్నాడు. హీరోయిన్లు ఇద్దరూ అతని పక్కన తేలిపోయారు. లావణ్య నటనతో మెప్పించినా, హెబ్బా పటేల్‌ మాత్రం టోటల్‌గా మిస్‌కాస్ట్‌ అనిపిస్తుంది. ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా కన్విన్సింగ్‌గా కనిపించే టాలెంట్‌ వున్న మురళిశర్మ కూడా తన పాత్రని రక్తి కట్టించలేకపోయాడు. పృధ్వీ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. రాజేష్‌, శ్రీనివాస్‌రెడ్డి కూడా కామెడీకి హెల్ప్‌ అయ్యారు. 

టెక్నికల్‌గా సినిమాటోగ్రాఫర్‌ పనితనం ఒక్కటీ మెప్పిస్తుంది. విజువల్స్‌ రిచ్‌గా వున్నాయి. విదేశాల్లో తీసిన ఎపిసోడ్‌ కనువిందు చేస్తుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు క్యాచీగా లేవు. డైలాగ్స్‌లో శ్రీను వైట్ల సినిమాల్లో వుండే పంచ్‌ మిస్‌ అయింది. నిర్మాతలు ఖర్చుకి వెనకాడలేదు. శ్రీను వైట్ల మాత్రం మరోసారి పర్‌ఫెక్ట్‌ స్క్రిప్ట్‌ రాసుకోవడంలో ఫెయిలయ్యాడు. ఏదో జరుగుతోందనే భావన కలిగించడానికి ఎన్నెన్నో క్యారెక్టర్లని పెట్టి, ప్యారలల్‌గా చాలా ట్రాక్స్‌ నడిపిస్తూ హంగామా చేసారు కానీ మేటర్‌ లేదనేది క్లియర్‌గా తెలిసిపోతున్నపుడు ఆ హంగులన్నీ దండగే. ఇదే కథకి విచిత్రమైన బ్యాక్‌డ్రాప్‌లు లేకుండా స్ట్రెయిట్‌గా చెప్పినట్టయితే ఎలాగుండేదో కానీ ఇప్పుడు తీర్చిదిద్దిన తీరు మాత్రం విపరీతంగా విసిగిస్తుంది. ఈ మిక్స్‌డ్‌ ట్రాక్స్‌ వ్యవహారం వదిలేసి సింపుల్‌గా ఆనందం, వెంకీ, ఢీ తరహా వినోదాత్మక కథలపై శ్రీను వైట్ల ఫోకస్‌ పెడితే బాగుంటుందని అతని హాస్యానికి అభిమానులైన వారు కోరుకోకుండా వుండరు. టోటల్‌గా మిస్‌ఫైర్‌ అయిన 'మిస్టర్‌' ప్రేక్షకుల్లో ఏ వర్గాన్ని మెప్పించడమైనా కష్టమే మరి. ఇన్ని బలహీనతలతో బాక్సాఫీస్‌ దగ్గర సస్టెయిన్‌ అవగలదో లేదో చూడాలి. 

బాటమ్‌ లైన్‌: మిస్టర్‌ వైట్ల మ్యాజిక్‌ మిస్సింగ్‌!

– గణేష్‌ రావూరి