ఇకపై మెగా కాంపౌండ్ హీరోలు తమ కాంపౌండ్ లో బ్యానర్లపైనే ఎక్కువగా సినిమాలు చేస్తారేమో. ఇప్పటికే చిరంజీవి సినిమాల్ని రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చిరు 150వ సినిమాను కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చెర్రీ.. చిరంజీవి 151వ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తాడట చరణ్.
పవన్ కల్యాణ్ కూడా నిర్మాతగా మారాడు. ఇప్పటికే తన సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్న పవన్.. చెర్రీ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని ఇదివరకే ప్రకటించాడు. వచ్చే ఏడాది ఆ మూవీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దాంతో పాటు వీలైతే సాయిధరమ్ తేజ హీరోగా ఓ సినిమా నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నాడట పవన్.
అటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా తన కాంపౌండ్ హీరోల కోసం భారీ లైనప్ సిద్ధంచేశారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత.. త్వరలోనే వాళ్లిద్దరితో చెరో రెండు సినిమాలు చేసే యోచనలో ఉన్నారు. తన రెండో తనయుడు అల్లు శిరీశ్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.
వీళ్లతోపాటు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని.. ఈమధ్యే ప్రకటించారు అల్లు అరవింద్. అయితే నాగబాబు మాత్రం ప్రస్తుతానికి తన బ్యానర్ పై ఏ సినిమా ప్రకటించలేదు. భవిష్యత్తులో అతడు కూడా తన కొడుకు హీరోగా సినిమా నిర్మించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.