Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: నిన్ను కోరి

సినిమా రివ్యూ: నిన్ను కోరి

రివ్యూ: నిన్ను కోరి
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌
తారాగణం: నాని, నివేథా థామస్‌, ఆది పినిశెట్టి, మురళి శర్మ, పృధ్వీ, విద్యుల్లేఖా రామన్‌, తనికెళ్ల భరణి తదితరులు
కథనం, మాటలు: కోన వెంకట్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
సంగీతం: గోపి సుందర్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాత: డి.వి.వి. దానయ్య
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
విడుదల తేదీ: జులై 7, 2017

'జీవితం మనకెన్నో అవకాశాలని ఇస్తుంది. మనం జీవితానికి ఒక అవకాశమిద్దాం' అనే థీమ్‌తో చెప్పిన ఈ మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ సహజమైన పాత్రలతో, రిలేట్‌ చేసుకునే సంఘర్షణలతో, హత్తుకునే భావోద్వేగాలతో 'రొమాన్స్‌' జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

ప్రతి సినిమాలోను లవర్‌బాయ్‌గానే కనిపించినా కానీ, ఏ చిత్రం చూస్తున్నప్పుడు ఆ పాత్రని మాత్రమే చూసేట్టు చేసే అద్భుతమైన టాలెంట్‌ నానిది. శివ నిర్వాణ తన కథకి తగ్గ లీడ్‌ యాక్టర్లని ఎంచుకోవడంతోనే సగం సక్సెస్‌ అయిపోయాడు. కథని నడిపించే మూడు పాత్రలు పోషించిన నాని, నివేథా థామస్‌, ఆది తమ క్యారెక్టర్లో లీనమైపోయారు. ఈ సంఘర్షణని నిజంగా అనుభవిస్తున్నామనేంత కన్విన్సింగ్‌గా నటించారు. ఫలితంగా ఇంతకుముందు చూసిన కథే అయినప్పటికీ 'నిన్ను కోరి' హృదయాన్ని స్పృశిస్తుంది. కనులు చెమ్మగిల్లేట్టు చేస్తుంది.

ఈ కథకి రెండే క్లయిమాక్స్‌లున్నాయి. అయితే అలా ముగించాలి, లేదా ఇలా ముగించాలి తప్ప మధ్యే మార్గం లేని కథాంశమయినపుడు ఎక్కడికక్కడ ప్రిడిక్టిబులిటీ కథకుడిని ఛాలెంజ్‌ చేస్తుంటుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఊహించగలిగే కథ చెబుతున్నపుడు తదుపరి క్షణం గురించి కాకుండా ప్రస్తుతాన్ని ఆస్వాదించేలా చెప్పే నైపుణ్యం కావాలి. ఈ క్షణంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తే, తదుపరి ఏం జరుగుతుందనే దానిపై నుంచి ఆలోచన మరలిపోతుంది. అలాంటి చక్కటి మూమెంట్స్‌ క్రియేట్‌ చేయడంలో దర్శకుడు శివ సక్సెస్‌ అయ్యాడు.

ప్రేమకథని చాలా సహజంగా చూపించాడు తప్ప సినిమాటిక్‌ ఎమోషన్స్‌ జోలికి వెళ్లలేదు. నిజ జీవితంలో ప్రేమ జంటలకి ఎలాంటి పరిస్థితులు ఆటంకాలు అవుతాయో వాటినే చూపించాడు తప్ప స్ట్రయికింగ్‌గా వుండాలని బలమైన సంఘటనల వైపు వెళ్లలేదు. దీంతో తెరపై జరిగేది ఒక సహజ ప్రేమకథలానే అనిపిస్తుంది తప్ప సినిమా కథలా తోచదు.

అయితే ఈ కథ మొత్తం బేస్‌ అయిన ఒక పాయింట్‌ మాత్రం చాలా అసహజంగా వుంటుంది. తన భార్యని ప్రేమించిన వ్యక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని తెలిసి, అతడిని మార్చడానికి తమ ఇంట్లోనే కొన్ని రోజులు వుండనిద్దామని భార్య కోరితే ఏ భర్తా అంగీకరించడు. ఇలాంటి డెలికేట్‌ త్రెడ్‌ మీద ఇంత భారమైన ప్రేమకథని నిలబెట్టినా, అతను అంగీకరించడానికి ఒక బలమైన కారణాన్ని చెప్పి మనల్ని కన్విన్స్‌ చేసేస్తారు.

ప్రేమిస్తున్న అమ్మాయి తన భర్తతో సంతోషంగా వుంటోన్న ఇంట్లోకి వచ్చిన వ్యక్తి స్వభావం ఎలాగైనా వుండొచ్చు. అయితే ఎమోషనల్‌గా డీల్‌ చేయవచ్చు, వాళ్లిద్దరినీ అలా చూడలేక అతను నెగెటివ్‌గాను రియాక్ట్‌ అవ్వవచ్చు. తక్కువ పాత్రల మధ్య నడిచే డ్రామా కనుక ఈ రెండో పద్ధతిని ఎంచుకుంటే వినోదానికి స్కోప్‌ వుంటుంది. అయితే దీని వల్ల లీడ్‌ యాక్టర్‌పై సింపతీ పోయే ప్రమాదముంది.

ఆ రిస్కుని యాక్సెప్ట్‌ చేసి ఎంటర్‌టైనింగ్‌ రూట్‌ ఎంచుకున్న డైరెక్టర్‌ కొన్ని కొన్ని మూమెంట్స్‌ సృష్టించి నాని క్యారెక్టర్‌తో రిలేట్‌ చేసుకునేట్టు, అతడి ఎమోషన్‌తో కనక్ట్‌ అయ్యేట్టు చేసాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడితో ఆమె నీకొక ఆప్షనే తప్ప నీ ఛాయిస్‌ కాదని అంటాడు. నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయిల్లో వేరే ఎవరిని ఆప్షన్‌గా తీసుకున్నా తన ప్రేమ బ్రతికేదంటాడు.

అడపాదడపా ఇలాంటి ఎమోషనల్‌ మూమెంట్స్‌తో టచ్‌ చేస్తూనే, కథ మరీ విసిగించకుండా పృధ్వీ, మురళి శర్మలని తీసుకొచ్చి వినోదం మిస్‌ అవకుండా చూసుకున్నారు. ఇదే కథని పూర్తిస్థాయి ఎమోషనల్‌ డ్రామాగా తీర్చిదిద్దితే కల్ట్‌ క్లాసిక్‌ అయి వుండేది. కానీ కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యేలా చూసుకుని ఎమోషనల్‌ కోర్‌ని ఒకింత డిస్ట్రబ్‌ చేసారు. దీనిపై కొందరు కంప్లయింట్‌ చేయవచ్చు కానీ మెజారిటీ ఆడియన్స్‌కి ఈ స్వీట్‌ కోటింగే రుచిస్తుంది.

ఎంత చేసినప్పటికీ, ఎన్ని మూమెంట్స్‌ క్రియేట్‌ చేసినప్పటికీ ముందుగా చెప్పుకున్న ఆ రెండు క్లయిమాక్స్‌లలో ఏదో ఒకటి డిసైడ్‌ అయినపుడు దానిని కన్విన్సింగ్‌గా చెప్పగలగాలి. ఇక్కడే కొత్త దర్శకుడు శివ చాలా పరిణితి చూపించాడు. ఆది-నాని మధ్య కాన్‌ఫ్రంటేషన్‌, నాని క్యాజువల్‌గా మాట్లాడిన మాటలతో నివేథకి వచ్చే రియలైజేషన్‌, ఆది-నివేథల కాన్వర్‌జేషన్‌... అన్నీ చక్కగా కుదిరి పర్‌ఫెక్ట్‌ ఎండింగ్‌ దిశగా నడిపించాయి.

రచయితగా కోన వెంకట్‌ తన అనుభవాన్ని మొత్తం రంగరించి దీనిని జనరంజకంగా మలిచిన తీరు మెచ్చుకోతగింది. దర్శకుడిగా శివ నిర్వాణ తన మెచ్యూరిటీ లెవల్స్‌ చాటుకుని తెలుగు సినిమాకి మరో ప్రామిసింగ్‌ టాలెంట్‌ వచ్చాడనే నమ్మకం కలిగించాడు. అడిగా అడిగా, ఉన్నట్టుండి గుండె పాటలతో గోపి సుందర్‌ ఆకట్టుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఎమోషనల్‌ సీన్స్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లాడు. కాకపోతే ద్వితీయార్థంలో రెండు మంచి పాటలు పెట్టి వుండాల్సింది. సెకండ్‌ హాఫ్‌లో వచ్చే పాటలు ఏమంత ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రాఫర్‌ కూడా కథకి తగ్గ మూడ్‌ మెయింటైన్‌ చేసాడు.

నాని మరొక్కసారి తను ఎంత గొప్ప పర్‌ఫార్మర్‌ అనేది చూపించాడు. పది నిమిషాలు టైమ్‌ ఇవ్వమంటూ అలా నడిచెళ్లిపోతూ కన్నీళ్లు పెట్టుకునే సీన్లో అతని అభినయానికి హేట్సాఫ్‌. నివేథ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. కీలకమైన పతాక సన్నివేశాల్లో ఆది మెప్పించాడు. మురళి శర్మ, పృధ్వీల హాస్యం అసలు కథకి అడ్డు రాకుండా, కథనం భారమవుతుందనే చోట లైట్‌ మూమెంట్స్‌ పంచడానికి భలేగా అక్కరకొచ్చింది. విద్యుల్లేఖా రామన్‌ కూడా అక్కడక్కడా కామెడీకి హెల్ప్‌ అయింది.

నిదానంగా సాగే కథనం, ప్రిడిక్టిబుల్‌ నేచర్‌ ఈ చిత్రం అప్పీల్‌పై లిమిటేషన్స్‌ విధిస్తాయి. ఆద్యంతం వేగం కోరుకునే ప్రేక్షకుల సైడ్‌ నుంచి థమ్సప్‌లు రాకపోవచ్చు కానీ హృద్యమైన ప్రేమకథలు ఇష్టపడేవారికి ఇది కొన్ని గుర్తుంచుకునే మూమెంట్స్‌ ఇస్తుంది. ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మధ్య సమతూకాన్ని పాటించిన ఈ చిత్రం టార్గెట్‌ ఆడియన్స్‌ అండదండలతో బాక్సాఫీస్‌ని ఈజీగానే గెలిచేయాలి.

బాటమ్‌ లైన్‌: మెప్పించే లవ్‌స్టోరీ!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?