Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రాజా ది గ్రేట్‌

సినిమా రివ్యూ: రాజా ది గ్రేట్‌

రివ్యూ: రాజా ది గ్రేట్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: రవితేజ, మెహ్రీన్‌, రాధిక, రాజేంద్రప్రసాద్‌, వివాన్‌, సంపత్‌ రాజ్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సన, హరితేజ, అన్నపూర్ణ తదితరులు
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: సాయి కార్తీక్‌
ఛాయాగ్రహణం: మోహనకృష్ణ
నిర్మాత: శిరీష్‌
సమర్పణ: దిల్‌ రాజు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: అక్టోబర్‌ 18, 2017

తన తమ్ముడి మరణానికి కారణమైన హీరోయిన్‌ని చంపాలని విలన్‌ ఫిక్స్‌ అవుతాడు. ఆమెని హీరో ఎలా కాపాడాడు అన్నది 'రాజా ది గ్రేట్‌' కథ. మామూలుగా అయితే సగటు మాస్‌ సినిమా కథలన్నిటిలానే అనిపిస్తుంది. కొత్తదనం కోసమని కథానాయకుడిని అంధుడిని చేసారు. ఇంకా చెప్పాలంటే 'ఒక్కడు' సినిమా కథకి, దీనికి పెద్ద తేడాయేం లేదు. కాకపోతే హీరో అంధుడు అయ్యే సరికి కొత్త డైమెన్షన్‌ వచ్చిందంతే.

హీరో అవడానికి అంధుడైనా కానీ ఎందులోను తీసిపోడు. డిజైనర్‌ బట్టలేసుకుని తిరుగుతాడు, లయ తప్పకుండా డాన్స్‌ చేస్తాడు, తడబడకుండా నడిచేస్తాడు, ఎంతమంది వచ్చినా నరికేస్తాడు! అంధుల పాత్రలని ఒక రీతిన 'పాసివ్‌'గా చూపించాలనే పడికట్టు పద్ధతులని తోసిరాజని 'రాజా ది గ్రేట్‌'ని చాలా యాక్టివ్‌గా చూపించినందుకు అనిల్‌ రావిపూడి అభినందనీయుడు. సింపథెటిక్‌ క్యారెక్టర్‌లా కాకుండా చాలా ఎనర్జిటిక్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా హీరోని చూపించిన రావిపూడి ఆ క్రమంలో సగటు కమర్షియల్‌ హీరోకి, ఈ రాజాకీ మధ్య గీత ఎక్కడ గీయాలో విస్మరించాడు.

సగటు మాస్‌ కథానాయకుడి పాత్రలా కాకుండా సమ్‌థింగ్‌ గ్రేట్‌ అనిపించేలా ఈ పాత్రని తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. నలభై అయిదు డిగ్రీలు పక్కకి తల వంచి, పక్క చూపులు చూడ్డం మానేసి రవితేజ స్ట్రెయిట్‌గా చూసేసినట్టయితే రెగ్యులర్‌ మాస్‌ హీరోకి, ఈ రాజాకీ తేడాయే లేదు. ఎన్ని వందల మంది వచ్చినా కానీ హీరో వారిని వెలుగులో అయినా, చీకట్లో అయినా ఉతికి ఆరేస్తాడు. ఎందుకంటే అతను బ్లయిండ్‌ కానీ ట్రెయిన్డ్‌ అట! చిన్నప్పుడే అతడికి అన్ని విద్యలూ నేర్పిస్తుందని తల్లి. తన వైకల్యం తనకి అడ్డు కాకుండా ఎలాంటి ప్రమాదంలోంచి అయినా తప్పుకునే తెలివితేటలు అతని సొంతం. ఇంత ట్రెయిన్డ్‌ బ్లయిండ్‌ పర్సన్‌ని విలన్‌ ఎలా ఎదుర్కోగలడు పాపం?

తనకి ఎమ్మెల్యే పదవి కావాలని అడిగిన విలన్‌, ఒక పార్టీలో వందల మంది చూస్తుండగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేని తుపాకీతో కాల్చేస్తాడు. కానీ తన సమీపంలోకి వెళితే తప్ప తనని ఏమీ చేయలేని హీరోపై మాత్రం తుపాకీ వాడడు. ఎంత ట్రెయిన్డ్‌ బ్లయిండ్‌ పర్సన్‌ అయినప్పటికీ తన పరిధిలోకి రాని వారిని హీరో ఏమీ చేయలేడుగా? ఆమాత్రం లాజిక్‌ ఆలోచిస్తే తెలుగు సినిమా విలన్‌ ఎలా అవుతాడని అంటారా? ప్రాబ్లమ్‌ ఏమిటంటే, తమ కథల్లోని విలన్లకే కాక, తమ చిత్రాలు వీక్షించే వారికి సైతం అంతగా బుర్రలుండవని అనేసుకుంటారో ఏమో అనిపిస్తుంది ఇందులోని కొన్ని సీన్లు చూస్తుంటే.

ఒక సందర్భంలో హీరో తల్లి చేతి నరం కోసేసి కాపాడుకోమని హీరోకి విలన్‌ ఛాలెంజ్‌ విసుర్తాడు. తల్లిని జీప్‌లో ఎక్కించుకుని వెళ్లిపోతున్న వారిని వెంబడించడం కోసం వారి కారుకి గంట కడతాడు హీరో. ఇక దానిని ఛేజ్‌ చేసుకుంటూ వెళ్లిన హీరో ముందుగా రన్నింగ్‌ వ్యాన్‌ ఎక్కుతాడు. అంతవరకు ఓకే అనుకున్నా, తర్వాత రన్నింగ్‌ ట్రెయిన్‌ వెనకనుంచి ఎక్కేసి టాప్‌ మీద కూర్చుంటాడు. తను దిగాల్సిన ప్లేస్‌ వచ్చినపుడు పోల్‌ పట్టుకుని దూకేస్తాడు. 'పలనాటి బ్రహ్మనాయుడు'లో తొడగొడితే ట్రెయిన్‌ వెనక్కి పోయే సీన్‌కి ఏమాత్రం తీసిపోని సన్నివేశమిది.

మామూలుగా అన్నీ సవ్యంగా వుండేవారికన్నా అంధులకి జ్ఞాపకశక్తితో సహా చాలా విషయాల్లో ఎక్కువ నేర్పు వుంటుంది. అలాంటివి వాడుకుంటూ విలన్‌ని హీరో దెబ్బ కొడుతుంటే బాగానే వుంటుంది కానీ, ఇలా పరుగెత్తే రైళ్లు, ఎగిరే విమానాలు ఏదైనా ఎక్కేయగలరు అన్నట్టు చూపిస్తేనే 'ఎలా కనిపిస్తున్నామని' అడగాలనిపిస్తుంది. చివర్లో విలన్‌ పెద్ద రాడ్‌ వేసుకుని హీరోని కొట్టి పడేస్తే, హీరో తల్లి వచ్చి... 'నువ్వు కొడుతుంటే పడిపోయాడు అనుకున్నావా? ఇక్కడి పరిసరాలని స్టడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మూడొందల అరవై డిగ్రీలు అతడికి తెలుసు' అంటూ ఏదో చెబుతుంది.

యాక్షన్‌ పార్ట్‌ మొత్తం ఇలాంటి అసంబద్ధమైన, అసహజమైన సన్నివేశాలతో నిండిపోయినా కానీ హాస్య సన్నివేశాలు కొన్ని బాగా పండడం మాత్రం రిలీఫ్‌. ముఖ్యంగా పోసాని, హరితేజ తదితరులపై తీసిన ఎపిసోడ్‌ నవ్విస్తుంది. ఈ ఎపిసోడ్‌లో హీరో కండ బలం వాడకుండా బుద్ధిబలంతోనే అలరిస్తాడు. ఇదే తరహా ట్రీట్‌మెంట్‌ విలన్స్‌ దగ్గరా వున్నట్టయితే లాజిక్‌ గాలికి పోయేది కాదు. అనిల్‌ రావిపూడికి చిత్రమైన సెన్సాఫ్‌ హ్యూమర్‌ వుంది. తన టిపికల్‌ హాస్య చతురతతో అతను కొన్ని సీన్లతో బాగా నవ్వించాడు. కమర్షియల్‌ పల్స్‌ తెలిసిన రావిపూడి కొన్ని సందర్భాల్లో దానిని చాలా బాగా వాడాడు.

ఉదాహరణకి 'గున్నా గున్నా మావిడి' సాంగ్‌ ప్లేస్‌మెంట్‌ భలేగా కుదిరింది. ఇక రవితేజ అంటేనే ఎనర్జీ పీక్స్‌లో వుంటుంది కనుక చాలా మామూలు డైలాగులని కూడా పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో చెప్పి మరింత నవ్వించగలిగాడు. 'ఏమో సార్‌ నాకు కనపడదు' అనే సింగిల్‌ డైలాగ్‌తో బ్యాంక్‌ రాబరీ సీన్‌లో రవితేజ పుట్టించిన హాస్యం అంతా ఇంతా కాదు. 'జింగ్‌ జింగ్‌ అమేజింగ్‌'లా ఇందులో 'ఇట్స్‌ లాఫింగ్‌ టైమ్‌ హుహుహూహూ' అంటూ ఏదో ట్రై చేసారు కానీ అదేమంత క్యాచీగా లేకపోగా, ఒక దశ దాటిన తర్వాత ఇరిటేట్‌ చేస్తుంది.

రవితేజ ఎప్పటిలానే తన మార్కు ఎనర్జీతో రాజా పాత్రలో రాణించాడు. మెహ్రీన్‌ మాత్రం మరోసారి తేలిపోయింది. డార్జిలింగ్‌లో వయొలిన్‌ వాయించే సీన్‌లో ఆమె పర్‌ఫార్మెన్స్‌ గురించి మాట్లాడుకోనవసరం లేదు. విలన్‌గా వివాన్‌ ఓవరాక్షన్‌ చేసాడు. సంపత్‌ రాజ్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం కామెడీ అని సరిపెట్టుకోవడానికి లేదు. తనికెళ్ల భరణి పాత్ర బాగుంది. రాధిక, రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, పోసాని తదితర ఆర్టిస్టులు తమ పాత్రల్లో మెప్పించారు. తెర వెనుక పని చేసిన వారిలో మోహనకృష్ణ పనితనం బాగుంది. డార్జిలింగ్‌ అందాలని ఆయన కెమెరాలో బాగా చూపించారు.

సాయికార్తీక్‌ స్వరపరిచిన బాణీలు మాత్రం చాలా సాధారణంగా వున్నాయి. దిల్‌ రాజు సినిమాల్లో తరచుగా కనిపించే వైవిధ్యం ఇందులో కొరవడింది. బడ్జెట్‌ని కంట్రోల్‌లో వుంచారని మాత్రం స్పష్టంగా తెలిసింది. అనిల్‌ రావిపూడి మరోసారి కొత్తరకం కామెడీ పుట్టించడంలో సక్సెస్‌ అయ్యాడు. అలాగే కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ బాగా డీల్‌ చేసాడు. కాకపోతే ఇలాంటి కథకి చాలా అవసరమైన ఎమోషన్‌ పూర్తిగా మిస్‌ అయ్యాడు. అలాగే యాక్షన్‌ పార్ట్‌లో లాజిక్‌ పూర్తిగా వదిలేసి, నేల విడిచి సాము చేసిన సన్నివేశాలతో బ్లండర్‌ చేసాడు. కొత్తదనం చూపించడమంటే కేవలం హీరోకో వైకల్యం మాత్రం పెట్టి ఊరుకోకుండా, అందుకు తగ్గ ఆసక్తికరమైన కథనం కూడా రాసుకుని వుంటే ఈ రాజా నిజంగానే గ్రేట్‌ అనిపించేవాడు.

మాస్‌ ప్రేక్షకులు కామెడీతో సంతృప్తి పడిపోయినా కానీ, కొత్తదనం కోరుకునే వారు మాత్రం ఇందులో రవితేజ మాదిరిగా 'ఇట్స్‌ వెరీ రొటీన్‌.. హు హు హూ హూ!' అంటూ రెస్పాండ్‌ అవుతారు.

బాటమ్‌ లైన్‌: లాజిక్‌ ఏది రాజా!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?