cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: శమంతకమణి

సినిమా రివ్యూ: శమంతకమణి

రివ్యూ: శమంతకమణి
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: భవ్య క్రియేషన్స్‌
తారాగణం: నారా రోహిత్‌, సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబు, ఆది సాయికుమార్‌, రాజేంద్రప్రసాద్‌, ఇంద్రజ, రఘు కారుమంచి, రాజేష్‌ తదితరులు
కూర్పు: ప్రవీణ్‌ పూడి
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
నిర్మాత: వి. ఆనంద్‌ ప్రసాద్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
విడుదల తేదీ: జులై 14, 2017

నలుగురు యువ హీరోలు కలిసి ఒక సినిమా చేసారంటేనే దానిపై ఆసక్తి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక వినోదభరిత ప్రోమోలతో 'శమంతకమణి' సినీ ప్రియుల దృష్టిని ఎప్పుడో ఆకర్షించింది. అయితే విడుదలకి ముందు కనిపించిన 'ప్రామిస్‌'కి తగ్గ 'ప్రోడక్ట్‌' ఇవ్వడంలో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. కథ, కథనాలతో ఆకట్టుకుని, వినోదంతో మెప్పించాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు కాస్టింగ్‌, ఇతర హంగుల సపోర్ట్‌తో సక్సెస్‌ని వెతుక్కోవాలి.

అయిదు కోట్ల విలువైన కారు దొంగిలించబడుతుంది. ముగ్గురి (రాజేంద్రప్రసాద్‌, సందీప్‌ కిషన్‌, ఆది) మీదకి అనుమానం వెళుతుంది. కారుని అమ్మగా భావించే బాధితుడు (సుధీర్‌బాబు), అతడి కారుని కనిపెడతానంటూ డ్యూటీలోకి దిగిన ఒక అవినీతి పరుడైన పోలీసు (నారా రోహిత్‌). సెటప్‌ అయితే బ్రహ్మాండంగా కుదిరింది. ఆలస్యం చేయకుండా ఆదిలోనే హుక్‌ చేసేలా మంచి బిగినింగ్‌తో స్టోరీ స్టార్ట్‌ చేసిన దర్శకుడు క్యారెక్టర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ డీటెయిల్స్‌లోకి వెళ్లడంతోనే కథనం పట్టు తప్పింది. ఏ ఒక్క క్యారెక్టర్‌కీ ఆసక్తికరమైన బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోగా, వారు జీవితాల్లో పైకి రావాలని కోరుకోవడానికి తగిన మోటివ్‌ కూడా స్ట్రయికింగ్‌గా అనిపించదు. దీంతో ఏ ఒక్క క్యారెక్టర్‌తో అయినా రిలేట్‌ చేసుకోవడం కష్టం.

సుధీర్‌బాబు 'అమ్మ' సెంటిమెంట్‌ కూడా కదిలించదు. రాజేంద్రప్రసాద్‌-ఇంద్రజల 'ముదురు' ప్రేమ నవ్వించదు. సందీప్‌, ఆదిని సీరియస్‌గా తీసుకునే సిట్యువేషన్స్‌ ఏమీ కనిపించవు. పోలీస్‌ అనగానే స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ రంజిత్‌ కుమార్‌లా కాకుండా, కారులో శృంగారం చేసుకుంటోన్న యువతీ యువకుల నుంచి డబ్బులు, చెయిన్‌ లంచం తీసుకునే సగటు పోలీస్‌లా నారా రోహిత్‌ క్యారెక్టర్‌ ఒక్కటే రియలిస్టిక్‌గాను, ఇంట్రెస్టింగ్‌గాను వుంది. ప్రథమార్థం మొత్తం క్యారెక్టర్ల బ్యాక్‌గ్రౌండ్‌ని చెప్పడానికి, వాళ్లకున్న అవసరాలని వివరించడానికే కేటాయించడంతో, ఆ సన్నివేశాల్లో అటు హాస్యం కాని, ఇటు థ్రిల్లిచ్చే అంశం కానీ లేకపోవడంతో ఫస్ట్‌ హాఫ్‌ చాలా ఫ్లాట్‌గా సాగిపోతుంది.

కారు ఎవరు దొంగిలించారు? అనే పాయింట్‌పై జరిగే ఇన్వెస్టిగేషన్‌ అంతా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌డోర్స్‌కే పరిమితం కాగా, ఆ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసే ఏ విషయం కూడా ఆసక్తి కలిగించదు. కనీసం వినోదాన్ని కూడా పండించవు. చిక్కు ముడి విప్పడానికి క్లయిమాక్స్‌కి ముందు 'పది నిమిషాల' టైమ్‌ అడిగిన నారా రోహిత్‌కి అప్పటికప్పుడు సినిమాటిక్‌గా ఒక ఫోన్‌ కాల్‌ రావడంతో కథ క్లయిమాక్స్‌కి చేరిపోతుంది. 'ఎలా జరిగింది?' అనే పాయింట్‌ ఆసక్తిగా కూర్చోబెట్టినప్పటికీ, 'ఎందుకు జరిగింది?' అనేది తెలిసిన తర్వాత తుస్సుమంటుంది. మంచోళ్లకి మంచి జరుగుతుంది, చెడ్డవాళ్లకి చెడు జరుగుతుంది అనే రెగ్యులర్‌ ఎండింగ్‌ ఇచ్చినప్పటికీ మొత్తం సినిమాలో ఈ పార్ట్‌ ఒక్కటే మెప్పిస్తుంది.

కాస్టింగ్‌ పరంగా మాత్రం శ్రీరామ్‌ ఆదిత్య బాగా స్కోర్‌ చేసాడు. నలుగురు హీరోలకి ఎవరికి సూటయ్యే పాత్రలు వారికిచ్చాడు. ఎవరూ కూడా మిస్‌ కాస్ట్‌ అనిపించరు. పైగా సినిమా అంతా తామే మోయాల్సిన భారం లేకపోయే సరికి అందరూ చాలా ఈజ్‌తో నటించారు. నారా రోహిత్‌ ఎప్పటిలానే తన క్యాజువల్‌ నటనతో మెప్పించగా, సందీప్‌ కిషన్‌ తన మూమెంట్స్‌ రిజిష్టర్‌ అయ్యేట్టు చక్కని పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. సుధీర్‌బాబు త్రెడ్‌లో ఎమోషన్స్‌ బాగా రాసుకోవాల్సింది.

ఈ కథకి కొత్త డైమెన్షన్‌ ఇచ్చే అవకాశం వున్నప్పటికీ దానిపై ఎక్కువ కసరత్తు జరగలేదు. సుధీర్‌ మాత్రం తన వంతుగా ఫుల్‌ ఎఫర్ట్స్‌ పెట్టాడు. ఆది మాస్‌ క్యారెక్టర్స్‌పై మోజు మానుకుని ఇలాంటి పక్కింటి అబ్బాయి తరహా క్యారెక్టర్స్‌కి ఫిక్స్‌ అయితే రిజల్ట్స్‌ బాగుంటాయి. రాజేంద్రప్రసాద్‌-ఇంద్రజ ట్రాక్‌ మరీ పేలవంగా వుంది. వాళ్లిద్దరి రొమాన్స్‌ త్రెడ్‌ కామెడీకి పనికొస్తుందని అనుకున్నారేమో కానీ స్క్రీన్‌ప్లేలో ల్యాగ్‌కి కారణమైంది. రోహిత్‌ అసిస్టెంట్‌గా కారుమంచి రఘుకి లెంగ్తీ క్యారెక్టర్‌ దక్కింది. అతను పండించే హాస్యం నవ్విస్తుంది.

మణిశర్మ నేపథ్య సంగీతం, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం ఈ చిత్రాన్ని సాంకేతికంగా ఉన్నతంగా నిలబెట్టాయి. గయ్‌ రిచీ సినిమాల తరహా స్లిక్‌ ఎడిటింగ్‌ ఎఫెక్టివ్‌గా వుంది. తక్కువ ఖర్చుతో మంచి అవుట్‌పుట్‌ తీసుకొచ్చినందుకు దర్శకుడిని, టెక్నీషియన్స్‌ని అభినందించాలి. మాటల రచయితగా రాణించిన ఆదిత్య రాసిన పంచ్‌లు అక్కడక్కడా బాగానే పేలాయి.

దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తన మొదటి చిత్రానికి ఎంచుకున్నట్టే క్రైమ్‌ కామెడీ జోనర్‌ని ఎంచుకున్నాడు. ఈ జోనర్‌ని ఎలా డీల్‌ చేయాలనేది తెలిసినా కానీ ఈసారి సబ్‌స్టెన్స్‌ కంటే స్టయిల్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. జోకులు అనుకున్నవి పేలక, ఫన్నీగా వుంటుందనేది పండక అడపాదడపా మెరుపులు మినహా 'శమంతకమణి' తళుకులీనలేకపోయింది. కాకపోతే నలుగురు హీరోలు, కారెవరు దొంగిలించారనే సస్పెన్సు, చివరాఖరి ఘట్టాలు లాంటివి కలిసి రావడంతో శమంతకమణి ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది.

బాటమ్‌ లైన్‌: మెరుపు లేని మణి!

- గణేష్‌ రావూరి

 


×