టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం నానా బీభత్సంగా వార్తలు పండిస్తోంది. పోలీసులు అధికారికంగా చెప్పకపోయినా, పేర్లు బయటకు వచ్చేసాయి. కొందరు తమకు నోటీసులు అందాయని, కానీ తమకు ఏమీ తెలియదని అంటుంటే, మరి కొందరు తమకు అందలేదని, అనవసరంగా తమ పేర్లు లాగుతున్నారని అంటున్నారు. ఇదిలా వుంటే మొత్తం వ్యవహారం అంతా దర్శకుడు పూరిజగన్నాధ్ సర్కిల్ చుట్టూనే తిరగడం విశేషం.
పూరిజగన్నాధ్, చార్మి, ముమైత్ ఖాన్ అంటే వేరే ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. ఇటు చార్మి కానీ, అటు ముమైత్ ఖాన్ కానీ దాదాపు పూరి యూనిట్ మనుషులే అని టాలీవుడ్ లో అందరికీ తెలిసిందే. ఆర్ట్ డైరక్టర్ చిన్నా అంటే పూరితో దాదాపు దశాబ్దకాలానికి పైగా కలిసి పని చేస్తున్నారు. ఇక సుబ్బరాజు అంటే దాదాపు పూరితోనే వుంటారు.
ఇక హీరో రవితేజ పేరు వినవచ్చింది. రవితేజ ను హీరోగా నిలబెట్టింది పూరిజగన్నాధ్ నే అన్న సంగతి తెలియంది కాదు. ఇక నవదీప్, నందు లు ఆ మధ్య మరో విధంగా పూరి క్యాంప్ కు దగ్గరయ్యారు. అదెలా అంటే, పూరి గురువు రామ్ గోపాల్ వర్మ వీళ్లతో చకచకా సినిమాలు చేసారు. ఇక సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు గతంలో పూరి పెద్ద సినిమాలు అనేక వాటికి పని చేసారు. వాటిలో టెంపర్, దేవుడు చేసిన మనుషులు, బిజినెస్ మాన్, కెమేరామన్ గంగతో రాంబాబు వున్నాయి.
ఇలా మొత్తం ఎవరికైతే నోటీసులు అందాయని రూమర్లు వస్తున్నాయో, వాళ్లందరికీ దర్శకుడు పూరిజగన్నాధ్ తో అనుబంధం వుండడం విశేషం.