Advertisement


Home > Movies - Reviews
సినిమా రివ్యూ: స్పైడర్‌

రివ్యూ: స్పైడర్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: ఎన్‌విఆర్‌ సినిమా
తారాగణం: మహేష్‌, ఎస్‌.జె. సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, భరత్‌, ప్రియదర్శి, ఆర్‌జె బాలాజీ, జయప్రకాష్‌ తదితరులు
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌
సమర్పణ: ఠాగూర్‌ మధు
నిర్మాత: ఎన్‌.వి. ప్రసాద్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మురుగదాస్‌
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 27, 2017

మురుగదాస్‌కి కమర్షియల్‌ పల్స్‌ బాగా తెలుసు. కమర్షియల్‌ హంగులకి సోషల్‌ మెసేజ్‌ జోడించి లార్జర్‌ దేన్‌ లైఫ్‌ హీరో క్యారెక్టర్లతో రసవత్తరంగా కథ చెప్పడం అతని శైలి. శంకర్‌ సినిమాలు ఒక తరహాలో అలరిస్తే, అలాంటి అంశాలతోనే మురుగదాస్‌ మాస్‌ని మెప్పించేలా మరో రకంగా సినిమాలు తీస్తుంటాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అతని ఫార్ములా చాలా రేర్‌గా మిస్‌ఫైర్‌ అవుతుంది. మురుగదాస్‌ మార్క్‌ స్టయిలిష్‌ టేకింగ్‌కి తోడు, ఆకర్షణీయమైన సెటప్‌తో 'స్పైడర్‌' పేపర్‌ మీద ఎక్సయిటింగ్‌ సబ్జెక్టే, కానీ తెర మీదకి వచ్చేసరికి రెండున్నర గంటల పాటు నిలబెట్టే సరుకు కరవైంది.

హీరోలని 'హీరోల్లా' చూపించడాన్ని ఇష్టపడే దర్శకుల్లో ఒకడైన మురుగదాస్‌ ఈసారి తన స్పైడర్‌ని కుర్చీకి, కంప్యూటర్‌ స్క్రీన్‌కీ పరిమితం చేసాడు. దీంతో ఈ సినిమాకి మహేష్‌లాంటి పెద్ద స్టార్‌ బలం కావాల్సింది పోయి, అతడికి ఈ కథాబలం సరిపోకుండా పోయింది. ఎక్కవ ఏ అవసరం వచ్చినా, ఆపద పొంచి వున్నా కానీ దానికి వెంటనే స్పందించేలా స్పైడర్‌ ఒక సాఫ్ట్‌వేర్‌ తయారు చేసుకుంటాడు.

తన లక్ష్యాన్ని, ఆశయాన్ని అతను నాలుగు మాటల్లో చెప్పేస్తాడు. కానీ అతడికి ఎదురయ్యే విలన్‌ కోసం మాత్రం మురుగదాస్‌ నాలుగు సీన్లపైనే రాసుకున్నాడు. హీరో కంటే విలన్‌ పాత్రని దర్శకుడు ఎక్కువ ప్రేమించిన విషయం అర్ధమవుతుంది. అయితే హీరో పాత్రని కూడా అంతే బలంగా తీర్చిదిద్దినట్టయితే వాళ్లిద్దరి సమరం ఆసక్తికరంగా వుండేది.

అసలు హీరోని స్పైగా చూపించాల్సిన అవసరం, అతడికున్న లక్ష్యం ఈ కథకి అవసరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే అలాంటి హీరో ఎప్పుడైనా పెద్ద ఇష్యూ కోసం పోరాడాలి. కానీ హీరో పాత్ర పరిచయమైన కాసేపటికే ఇది కేవలం హీరో వర్సెస్‌ విలన్‌ కథగా మారిపోతుంది. అంత మాత్రం దానికి హీరో స్పై కావడం, ఇంటిల్లిజెన్స్‌ బ్యూరో వగైరా దేనికనిపిస్తుంది.

కనీసం స్పైగా పెట్టుకున్నందుకు, ఆ సెటప్‌ చూపించినందుకు ఆరంభంలో కాసిని ఆసక్తికరమైన సీన్లయినా వేసుకుని వుండాల్సింది. కానీ స్పైడర్‌ చేసే వ్యవహారమంతా కేవలం ఒక పాటలో చూపించేసి సరాసరి విలన్‌ కోసం అన్వేషణ స్టార్ట్‌ చేసేట్టు చేస్తారు. విలన్‌ పాత్రకి మాత్రం నేపథ్యం చాలా డీటెయిల్డ్‌గా చూపిస్తారు. విలన్‌ నేపథ్యం, అతని బాల్యం ఆసక్తికరంగా వున్నాయి. ఇంటర్వెల్‌కి ముందు ఎస్‌జె సూర్య ఎంట్రీ కూడా పర్‌ఫెక్ట్‌గా కుదరడంతో మురుగదాస్‌ మ్యాజిక్‌ మొదలైనట్టే అనిపిస్తుంది.

కానీ మూడు నాలుగు సుదీర్ఘ ఎపిసోడ్లని, యాక్షన్‌ 'బ్లాక్స్‌'ని పెట్టుకుని సెకండాఫ్‌ కానిచ్చేయడంతో ఇంటర్వెల్‌ టైమ్‌లో ఆసక్తి రేకెత్తించిన హీరో-విలన్‌ ఫేస్‌ఆఫ్‌ కాస్తా కేవలం కొన్ని నిమిషాలకే పరిమితమైంది. హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాల్లో లాజిక్‌ గురించి ఎక్కువ పట్టించుకోరు. అదే స్టయిల్‌ పాటించిన ఈ చిత్రానికి కూడా లాజిక్‌ అవసరం లేదని అనుకున్నట్టున్నారు. కాకపోతే ఆ సినిమాల్లో వుండే వేగం వల్ల లాజిక్‌ గురించి ఆలోచించే వ్యవధి చూసేవాళ్లకి దొరకదు. కానీ తాపీగా సాగే స్పైడర్‌లో లాజిక్‌ గాలికి వదిలేసిన ప్రతిసారీ అది భూతద్దంలో కనిపించేస్తుంది.

ఫస్ట్‌హాఫ్‌లో విలన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సీన్లకి సంబంధించిన ఎపిసోడ్‌లా, సెకండ్‌ హాఫ్‌లో టీఆర్పీల ద్వారా విలన్‌ ఆచూకీ కనుక్కునే ఎపిసోడ్‌ ఒకటి ఆసక్తి రేకెత్తిస్తుంది. మురుగదాస్‌ ముద్ర కనిపించే ఇలాంటి సీన్స్‌ ఎక్కువ లేకపోవడం స్పైడర్‌కి మైనస్‌ అయింది. మరీ ముఖ్యంగా ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌ దృశ్యాలు అత్యంత పేలవంగా వుండడంతో నిరాశ తప్పదు. తన సినిమాల్లో మెసేజ్‌ తప్పనిసరి ఎలిమెంట్‌ కనుక దానినీ క్లయిమాక్స్‌లో ఇరికించేసాడు. మానవత్వం గురించి చెప్పే ఆ మాటలు కేవలం మెసేజ్‌ ఇవ్వడం కోసమే పెట్టినట్టుంటాయి తప్ప కథతో సింక్‌ అవ్వవు.

ఇవన్నీ ఒకెత్తు అయితే, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పేరిట ఇంత కాలం డిలే అయిన ఈ చిత్రంలో మెప్పించే ఎఫెక్ట్స్‌ లేనే లేవు. రోలర్‌ కోస్టర్‌ ఫైట్‌, కొండ రాయి దొర్లే యాక్షన్‌ ఎపిసోడ్‌, హాస్పిటల్‌లో క్లయిమాక్స్‌ అన్నీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా చాలా దారుణంగా తేలిపోయాయి. ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో రొమాన్స్‌ ట్రాక్‌ అయితే చాలా పేలవంగా వుంది. మహేష్‌ తనవంతు చేయగలిగింది చేసినా కానీ మురుగదాస్‌ తన చేతులు కట్టి పడేయడం వల్ల స్పైడర్‌ని స్క్రిప్ట్‌ దాటి ఎలివేట్‌ చేయలేకపోయాడు. విలన్‌గా సూర్య అభినయం ఆకట్టుకుంటుంది. సినిమా పూర్తయిన తర్వాత అందరూ మాట్లాడుకునేది విలన్‌ క్యారెక్టర్‌ గురించే అంటే అతిశయోక్తి కాదు.

సాంకేతికంగా కూడా స్పైడర్‌ ఆ బడ్జెట్‌కి తగ్గ సినిమా అనిపించలేదు. పాటలు ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఇంతకాలం నిర్మాణంలో వున్న చిత్రానికి వుండాల్సిన గ్రాఫిక్స్‌ హంగులు మాత్రం లేవు. బాహుబలి జమానాలో ఇలాంటి గ్రాఫిక్స్‌కి పెదవి విరుపులు తప్పవు. మహేష్‌-సూర్య తమ అభినయంతో ఈ చిత్రానికి కొమ్ము కాచినప్పటికీ మురుగదాస్‌ తన ముద్ర వేయలేకపోవడం స్పైడర్‌ని బిలో యావరేజ్‌గా మిగిల్చాయి. ప్లస్‌ల కంటే మైనస్‌లే అధికంగా వున్న స్పైడర్‌ కాంపిటీషన్‌ని తట్టుకుని పండగ సీజన్‌ని ఎంతవరకు క్యాష్‌ చేసుకుంటుందనేది చూడాలి.

బాటమ్‌ లైన్‌: మిస్‌ఫైర్‌!

- గణేష్‌ రావూరి

పబ్లిక్ టాక్ కోసం క్లిక్ చేయండి