రివ్యూ: సూపర్ ఓవర్
తారాగణం: నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందు మౌళి, ప్రవీణ్, అజయ్, హర్ష తదితరులు
సంగీతం: సన్నీ ఎం.ఆర్.
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: సుధీర్ వర్మ
రచన, దర్శకత్వం: ప్రవీణ్ వర్మ
వేదిక: ఆహా
విడుదల తేదీ: జనవరి 22, 2021
ఐపీఎల్ సీజన్లోను, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ టోర్నీలు జరుగుతున్నపుడు క్రికెట్ బెట్టింగ్స్ ఏ రేంజ్‌లో జరుగుతుంటాయనేది జగద్విదితమే. బెట్టింగ్స్‌కి సంబంధించి లీగల్ వెబ్‌సైట్లు కూడా వుంటాయి. ఇంత పాపులర్ అయిన ఈ టాపిక్‌పై ఇంతవరకు ఎవరూ తెలుగులో సినిమా తీయలేదు. దివంగత దర్శకుడు ప్రవీణ్ వర్మ ఈ అంశాన్ని ఎంచుకుని థ్రిల్లర్ సెట్ చేసాడు. ఓటిటి ప్లాట్‌ఫామ్ కోసమే అన్నట్టుగా ఈ చిత్రానికి సింపుల్ సెటప్ పెట్టుకున్నాడు.
అవసరం కొద్దీ బెట్టింగ్‌లోకి దిగిన ముగ్గురు స్నేహితులకు ఒక బెట్టింగ్‌లో కలిసొచ్చి రాత్రికి రాత్రి కోటి డెబ్బయ్ లక్షలు వస్తాయి. అయితే ఆ డబ్బు చేతికి రావడానికి ఎంత కష్టపడతారు, ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు, ఎంతమంది ఆ డబ్బుపై కన్నేస్తారు వంటివి ఈ కథలో కీలక పాత్ర పోషిస్తాయి.
డబ్బుని, అమ్మని సమానంగా ప్రేమించే ఓ పోలీస్ కంట్లో పడ్డ వీళ్లు అతడి నుంచి తప్పించుకోలేకపోతారు. అతడిని వదిలించుకున్నామనేలోపు మరొకరు ఆ డబ్బు తన్నుకుపోతారు. ఇలా కొత్త పాత్ర వారికి తారసపడిన ప్రతిసారీ దర్శకుడు వెనక్కు వెళ్లి వాళ్లు ఈ సీన్లోకి ఎలా వచ్చారనేది చూపిస్తాడు. తొంభై నిమిషాల లోపు నిడివిలో తీసేసిన ఈ చిత్రాన్ని ఓటిటి కోసమని కాకుండా వెండితెర కోసం తీసినట్టయితే మరింత రసవత్తరంగా రూపొంది వుండేదేమో.
సినిమా ఆరంభం క్రికెట్ బెట్టింగ్స్ నేపథ్యంలో జరిగినా కానీ అది కాసేపే కనిపిస్తుంది. మిగతాదంతా డబ్బు చుట్టూ తిరిగే రెగ్యులర్ క్రైమ్ కామెడీల మాదిరిగానే సాగుతుంది. అయితే కథలో ఎక్కువ శాతం ఒకే రాత్రి జరగడం వల్ల తీసే వాళ్లకు పెద్ద ఛాలెంజే ఎదురయింది. ముఖ్యంగా కెమెరా వర్క్ అబ్బురపరుస్తుంది. చిన్న సినిమా అయినా కానీ విజువల్ క్వాలిటీ పరంగా ఎలాంటి లోటు లేదు.
సుధీర్ వర్మకు స్వామిరారా, దోచెయ్ లాంటి సినిమాలు తీసిన అనుభవం వుండడం కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. అయితే పొటెన్షియల్ వున్న సినిమాను స్కేల్ తక్కువ పెట్టుకుని సింపుల్‌గా తీసేసారనేదే లోటు అనిపిస్తుంది. చాలా విషయాలు కన్వీనియంట్‌గా జరిగిపోతూ వుంటాయి. దాని వల్ల క్లయిమాక్స్‌ని కూడా సింపుల్‌గా తేల్చేసినట్టు అనిపిస్తుంది.
చూస్తున్నంత సేపు ఆసక్తి కలిగించినా కానీ సూపర్ ఓవర్‌లో వుండాల్సిన థ్రిల్, కిక్ అయితే మిస్ అయ్యాయనే చెప్పాలి. నటీనటులు కూడా ఎక్కువ మంది లేరు. నవీన్, రాకేందు మౌళి, ప్రవీణ్, చాందిని, అజయ్ అందరూ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఆహా సబ్‌స్క్రిప్షన్ తీసుకుని మరీ చూడాల్సిన సినిమా అయితే కాదు కానీ ఆల్రెడీ సబ్‌స్క్రయిబర్ అయినట్టయితే తీరిక వేళలో కాలక్షేపానికి చూడ్డానికి లోటు లేదు.
బాటమ్ లైన్: షార్ట్ అండ్ సింపుల్!
– ఏ.పి.